వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్ ఇచ్చి బతికించారు- కేంద్ర బడ్జెట్‌పై సీఎం చంద్రబాబు

త్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్ లో క్లారిటీ ఇస్తాం.

Cm Chandrababu Naidu : కేంద్ర బడ్జెట్ పై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తన స్పందన తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ఆక్సిజన్ ఇచ్చిందన్నారు. బడ్జెట్ లో ఏపీ గురించి, ఏపీ ప్రాజెక్టుల గురించి కేంద్రం ప్రస్తావించిందన్నారు. అమరావతికి రూ.15 వేల కోట్లు వచ్చేలా చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత మాదేనని కేంద్రం చెప్పిందని చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్చడం సంతోషం అన్నారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పిందని చంద్రబాబు వెల్లడించారు.

”బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రానికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేశం ఆర్థిక ప్రగతిలో నడిచేలా కేంద్రం బడ్జెట్ ఉంది. త్వరలోనే ఏపీ బడ్జెట్ పెడతాం. సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలను అమలు చేస్తాం. అన్నింటి మీద త్వరలో పెట్టబోయే బడ్జెట్ లో క్లారిటీ ఇస్తాం.
పవన్ కల్యాణ్ ఆలోచన మేరకు స్కిల్ సెన్సస్ చేపడుతున్నాం. సుపరిపాలనకు మారు పేరుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది” అని సీఎం చంద్రబాబు అన్నారు.

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు నిధులపై సీఎం చంద్రబాబు స్పందన..
”అమరావతికి రూ.15 వేల కోట్లు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు గ్రాంట్, పారిశ్రామిక అభివృద్ధికి సహకారంతో పాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు, వర్కింగ్ క్యాపిటల్ కు సహకారంపై ముందుకు వచ్చిన కేంద్రానికి ధన్యవాదాలు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి బతికించారు. ఇక కష్టపడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ ను పెడతాం. అందులో ప్రాధామ్యాలను తెలియచేస్తాం”.

కేంద్ర బడ్జెట్ పై మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్..
”కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా తోడ్పాటు ఇచ్చేలా ఉంది. మేం పెట్టిన ప్రతిపాదనలు చాలా వరకూ ఆమోదించారు. రాజధాని నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయి. దీని వల్ల రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం పెరుగుతుంది. నిధులు ఏ రూపేణా వచ్చినా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగం. రాష్ట్రం ఆర్ధికంగా ఎంతో కూరుకుపోయి ఉంది. అందుకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయి. రాజధాని నిర్మాణం బండి వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపకరిస్తాయి. వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే నిధులు కొన్ని అప్పు రూపేణా అయినా దాదాపు 30ఏళ్ల తర్వాతే తీర్చేవి. అది అప్పటికి అంత భారమేమీ కాదు. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును కేంద్రం తన పూచీకత్తుతో ఇస్తుంది. మరికొంత గ్రాంట్ కూడా కలిసి ఉంటుంది.

వచ్చే నిధుల్లో కొంత కేంద్ర గ్రాంట్ కూడా కాపిటల్ అసిస్టెన్స్ రూపేణా కలుస్తుంది. అది లాభమే. పోలవరం ప్రాజెక్టుకు ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం అంది. మనకి అది చాలు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజీ తరహాలో ఉంటుందని మాకు సమాచారం. ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పారిశ్రామిక రాయితీలు కూడా ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే అవకాశం ఉంది. ఇందులో నియమ నిబంధనలు పరిశీలించాక మనకు అనుకూలంగా వాటిని మలుచుకుంటాం. వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశంని కూడా చేర్చటం ఆ జిల్లాకు ఎంతో ఉపయోగం” అని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు నిధుల వరద.. తెలంగాణకు నిరాశ

ట్రెండింగ్ వార్తలు