సై అంటే సై.. వరంగల్‌లో పతాక స్థాయికి ఎమ్మెల్యే‌, మాజీ ఎమ్మెల్యే మధ్య వార్‌..!

రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుండటమే హైలెట్‌గా నిలుస్తోంది.

Gossip Garage : ఓరుగల్లులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య వార్‌ పతాకస్థాయికి చేరింది. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు ఎమ్మెల్యే… మాజీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్‌వార్‌ నడుస్తోంది. మీ పార్టీ కార్యాలయం కూల్చేస్తామని ఒకరంటుంటే… టచ్‌ చేసి చూడు తడాఖా చూపిస్తామంటూ కౌంటర్‌ ఇస్తున్నారు మరొకరు… ఈ కౌంటర్‌, ఎన్‌కౌంటర్‌… పొలిటికల్‌ ప్రియులకు పండగలా మారింది. రెండు పార్టీల నేతలు తగ్గేదేలే అన్నట్లు మాటలు తూటాల్లా పేల్చడం ఆసక్తికరంగా మారింది…

ఎమ్మెల్యేను దీటుగా ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే..
వార్‌ వన్‌సైడే అన్నట్లు పొలిటికల్‌ గేమ్‌ను రక్తికట్టిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి… ఓరుగల్లులో గట్టి సవాల్‌ విసురుతోంది బీఆర్‌ఎస్‌. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కార్యాలయాలకు నోటీసులిస్తున్న ప్రభుత్వం… హన్మకొండలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ భవన్‌కూ నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌ కూల్చివేతకు నోటీసులిచ్చింది. ఐతే ప్రభుత్వం జారీ చేసిన నోటీసులపై న్యాయపోరాటం ప్రారంభించిన బీఆర్‌ఎస్‌… స్థానిక రాజకీయాలను దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయని రాజేందర్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు కూల్చివేయాల్సిందనేననట్లు కంకణం కట్టుకోవడంతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ రంగంలోకి దిగి ఎమ్మెల్యేను దీటుగా ఎదుర్కొంటున్నారు.

సై అంటే సై అంటూ కాక పుట్టిస్తున్న బీఆర్ఎస్ నేత..
ప్రస్తుతం దూకుడు మీదున్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే చాలా చోట్ల బీఆర్‌ఎస్‌ నేతలు వెనక్కి తగ్గుతున్నారు. ఇంకా నాలుగున్నరేళ్లు అధికారం మిగిలివుండగా, కాంగ్రెస్‌ నేతలతో తగాదా ఎందుకంటూ సైడైపోతున్నారనే వాదన వినిపిస్తోంది. కానీ, ఓరుగల్లులో ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసు కూల్చివేస్తామని కాంగ్రెస్‌ బెదిరిస్తుంటే… కాంగ్రెస్‌ కార్యాలయమూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రత్యారోపణలతో కాకరేపుతున్నారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌. పార్టీ ఆఫీసు కోసమని ప్రభుత్వం వద్ద స్థలం తీసుకున్న కాంగ్రెస్‌ అందులో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ నడపడం ఎంతవరకు కరెక్టు అంటూ ప్రశ్నిస్తూ కాక పుట్టిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఒక మాటంటే… ఆయనకు గట్టిగా కౌంటరిస్తూ బీఆర్‌ఎస్‌లో జోష్‌ నింపుతున్నారు.

వినయ్‌భాస్కర్‌ను ఇరకాటంలో పెట్టేలా ఎమ్మెల్యే పావులు..
గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన ఎమ్మెల్యే నాయని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మధ్య మాటల యుద్ధం పతాకస్థాయిలో కొనసాగుతోంది. 2009 నుంచి గత అసెంబ్లీ ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన వినయ్‌భాస్కర్‌ను ఇరకాటంలో పెట్టేలా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. సమాచార హక్కు చట్టాన్ని అస్త్రం చేసుకుని… మాజీ ఎమ్మెల్యేను, బీఆర్‌ఎస్‌ను రాజేందర్‌రెడ్డి టార్గెట్‌ చేయడంతో రాజకీయం వాడివేడిగా మారింది. దూకుడు మీదున్న ఎమ్మెల్యేను అడ్డుకోవడానికి వినయ్‌భాస్కర్‌ కూడా జోరు చూపిస్తుండటంతో ఓరుగల్లు పంచాయితీ ఆసక్తికరంగా మారింది.

అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ..
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ… రాజకీయ అనుభవంతో బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అన్నివైపుల నుంచి ఒత్తిడి తెస్తుండటం… కోర్టులో కేసులు వేసి బీఆర్‌ఎస్‌కు ముప్పతిప్పలు పెడుతుంటే… బీఆర్‌ఎస్‌ కూడా అంతే స్థాయిలో ప్రతిస్పందిస్తూ…. తలవంచేది లేదన్నట్లు సంకేతాలు పంపుతోంది. దీంతో ఓరుగల్లు రాజకీయం రక్తికడుతోందంటున్నారు. మొత్తానికి రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు అధికార, ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతుండటమే హైలెట్‌గా నిలుస్తోంది.

Also Read : ఆ 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు అంటూ ప్రచారం..! అసలు బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ ఏంటి?

ట్రెండింగ్ వార్తలు