ఆ 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు అంటూ ప్రచారం..! అసలు బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ ఏంటి?

ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే... పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్‌... కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది.

ఆ 10 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు అంటూ ప్రచారం..! అసలు బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ ఏంటి?

Gossip Garage : దున్నపోతు ఈనిందని ఒకరంటే.. వెళ్లి దుడ్డె పిల్లను కట్టెయ్యి రా.. అని మరొకరు అన్నారంట…. తెలంగాణలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య పవర్‌ పాలిటిక్స్‌ను చూస్తే అచ్చంగా ఇలానే చెప్పాల్సి వస్తోంది.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్‌ ఓ పక్క పావులు కదుపుతుంటే… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని… ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని గులాబీదళం ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. అసలు తెలంగాణలో ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? బీఆర్‌ఎస్‌ స్కెచ్‌ ఏంటి? కాంగ్రెస్‌ ప్లాన్‌ ఏంటి?

క్యాడర్‌లో స్థైర్యం నింపేందుకు ఉప ఎన్నికల ప్రచారం..!
తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎల్పీ విలీనమంటూ ఇంతకాలం ప్రచారం చేసిన కాంగ్రెస్‌… అసెంబ్లీ సమావేశాల నాటికి తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ప్రస్తుతానికి 10 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్న అధికార పక్షం… ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఐతే ఫిరాయింపుల చట్టం ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందిగా బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తోంది. ఇటు స్పీకర్‌ను అటు న్యాయస్థానాన్ని ఒకేసారి ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌… ఆపరేషన్‌ ఆకర్ష్‌కు చెక్‌ పెట్టేలా చురుగ్గా పావులు కదుపుతోంది. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు వలస వెళ్లిన నియోజకవర్గాల్లో క్యాడర్‌లో స్థైర్యం నింపేందుకు ఉప ఎన్నికలు జరగబోతాయంటూ ప్రచారం ప్రారంభించింది. ఫిరాయింపుదారులపై వేటు పడిన వెంటనే ఉప ఎన్నిక జరుగుతుందని మీరే అభ్యర్థి అంటూ కొందరికి భరోసా ఇస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.

ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం ఏర్పడేలా చేయాలని ప్లాన్‌..
ఇప్పటివరకు బీఆర్‌ఎస్‌ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది బీఆర్‌ఎస్‌. అసెంబ్లీ వర్షా కాల సమావేశాల్లో ఫిరాయింపుదారులపై అనర్హత వేటు కోసం పట్టుబట్టాలని నిర్ణయించింది గులాబీదళం. మరోవైపు క్యాడర్‌ను కాపాడుకోవాలంటే ఇప్పటినుంచే ఎన్నికల వాతావరణం ఏర్పడేలా చేయాలని ప్లాన్‌ చేస్తోంది. ముఖ్యంగా పార్టీ క్యాడర్‌ పటిష్టంగా ఉన్నచోట్ల ప్రత్యామ్నాయ నేతలను ఎంపిక చేసి… ఇప్పటి నుంచి ఉప ఎన్నికలు జరుగుతాయన్నట్లే పనిచేయాలని సూచిస్తోంది.

పార్టీ మారిన వారి స్థానంలో ప్రత్యామ్నాయ నేతలపై ఫోకస్‌..
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సొంత జిల్లా మెదక్‌లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యం ట్రబుల్‌ షూటర్‌ హరీశ్‌రావు రంగంలోకి దిగారు. ఇప్పటికే పార్టీ మారిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి స్థానంలో ప్రత్యామ్నాయ నేతలపై ఫోకస్‌ పెట్టారు. ఆ నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ నేతలు కొలను బాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డితోపాటు మెట్టు కుమార్‌యాదవ్‌ ఇన్‌చార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఇన్‌చార్జిగా ఎంపిక చేసి ఉప ఎన్నికలకు సిద్ధం చేయాలని భావిస్తోంది బీఆర్‌ఎస్‌. అదే విధంగా మిగిలిన 9 నియోజకవర్గాలపైనా ఫోకస్‌ చేసింది గులాబీ పార్టీ.

ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్ టాపిక్..
ఒకవైపు ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకుంటూనే… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలని పట్టుబడుతున్న బీఆర్ఎస్‌… కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను సిద్ధంగా ఉండాలని సూచిస్తుండటం హాట్‌టాపిక్‌గా మారింది. కారు పార్టీకి గట్టిపట్టున్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పార్టీ మారగా, ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా సీనియర్‌ నేత ఓరుగంటి రమణారావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దేవ వసంత పోటీ పడుతున్నారు. రమణారావు 2014 వరకు బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఇక జడ్పీ చైర్ పర్సన్‌ వసంత ఎమ్మెల్సీ కవిత వర్గంగా ముద్రపడ్డారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కూడా బీఆర్‌ఎస్‌లో ఉండగా, కవితతో సన్నిహితంగా ఉండేవారు. దీంతో జగిత్యాలలో ఉప ఎన్నిక జరిగితే ఎమ్మెల్సీ కవిత నిర్ణయమే కీలకం కానుందంటున్నారు.

అదేవిధంగా ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పార్టీ వీడారు. దీంతో ఖైరతాబాద్‌ ఇన్‌చార్జి పదవి కోసం మన్నె గోవర్ధన్‌రెడ్డి, సీనియర్‌ నేత దాసోజు శ్రవణ్‌ పోటీపడుతున్నారు. ఈ ఇద్దరు గతంలో వేర్వేరు పార్టీల తరఫున ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఉప ఎన్నిక జరిగితే మళ్లీ రంగంలో నిలుస్తామంటూ అధిష్టానానికి తమ మనోభీష్టాన్ని తెలియజేశారని తెలుస్తోంది.

గట్టి అభ్యర్థులను రెడీ చేస్తున్న బీఆర్‌ఎస్..
ఇక ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సీనియర్‌ నేత కడియం పార్టీ మారడంతో ఆయన స్థానంలో బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్నారు మాజీ మంత్రి రాజయ్య. ఏ క్షణంలో ఉపఎన్నిక జరిగినా… తాను రెడీ అంటూ అప్పుడే ప్రచారం కూడా ప్రారంభించారు. ఇదే విధంగా బాన్సువాడ, భద్రాచలం, గద్వాల, చేవెళ్ల, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు గట్టి అభ్యర్థులను రెడీ చేస్తోంది బీఆర్‌ఎస్‌. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందో… లేదో.. ఇంకా తేలకముందే బీఆర్ఎస్‌ సన్నద్ధం అవ్వడం పార్టీ క్యాడర్‌ను నిలపుకోడానికే అన్న చర్చ జరుగుతోంది.

Also Read : బడ్జెట్‌లో అగ్ర తాంబూలం, గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం భారీ సాయం.. ఏపీకి కలిసొచ్చిన అంశాలేంటి?