IND vs NZ Final : ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా..! వాతావరణ శాఖ కీలక అప్డేట్.. టీమిండియా ఫ్యాన్స్‌ను భయపెడుతున్న పిచ్..
IND vs NZ Final : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఆదివారం) సాయంత్రం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య పైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉంటుందా అనే విషయంపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.
T20 World Cup 2026 Final
- నేడు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్
- వర్షం ముప్పు లేదన్న వాతావరణ శాఖ
- పిచ్‌పై టీమిండియా ఫ్యాన్స్‌లో ఆందోళన
IND vs NZ Final : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఆదివారం) సాయంత్రం భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య పైనల్ పోరు జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలని కివీస్ ఆరాటపడుతుండగా.. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించాలని భారత్ ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు.
ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానుంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా అనే సందేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇవాళ వర్షం పడి మ్యాచ్ రద్దయినా ఫైనల్ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. అయితే, వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఈరోజు అహ్మదాబాద్ లో వర్షం కురిసే అవకాశం దాదాపుగా లేదు. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రం 6గంటల సమయంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండనుంది. అర్ధరాత్రి ఉష్ణోగ్రతలు 28 నుంచి 27 డిగ్రీలకు పడిపోవచ్చు. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో గాలి వీచే అవకాశముంది. ఈ పరిస్థితి పవర్ ప్లేను ప్రభావితం చేయొచ్చునని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇవాళ జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటికీ.. రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే, ఇవాళ జరిగే మ్యాచ్ రద్దయ్యే స్థాయిలో వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ పేర్కొంది.
ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన వేదికల్లో పిచ్ పరంగా కొంచెం కంగారు పెట్టే మైదానం అహ్మదాబాద్దే. ఈ స్టేడియంలో ఇటీవలి కాలంలో భారత్ కు మెరుగైన రికార్డు లేదు. ఈ స్టేడియంలో 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో టీమిండియాకు ఎదురైన ఏకైక ఓటమి కూడా ఈ పిచ్ లోనే. సూపర్-8 దశలో అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది.
అహ్మదాబాద్ పిచ్ ఏరోజు ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం కష్టం. ఈ నేపథ్యంలో ఫైనల్‌కు పిచ్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఫైనల్‌కు ఎర్ర, నల్ల మట్టి కలిపిన పిచ్‌ను ఎంచుకోనున్నట్లు సమాచారం. ఈ పిచ్ సమతూకంతో ఉంటుందని అంటున్నారు. స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియాకు ఇది నాలుగో ఫైనల్ మ్యాచ్. 2007, 2024లో భారత జట్టు విజేతగా నిలిచింది. 2014లో ఫైనల్లో ఓటమిపాలైంది. ఇవాళ జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న జట్టుగా భారత్ పేరు గడిస్తుంది. మరోవైపు.. భారత్, న్యూజిలాండ్ జట్ల విషయానికి వస్తే.. ఇరు జట్లు మొత్తం 30 టీ20 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో 16 మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధిస్తే.. 11సార్లు కివీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.
