బడ్జెట్‌లో అగ్ర తాంబూలం, గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం భారీ సాయం.. ఏపీకి కలిసొచ్చిన అంశాలేంటి?

రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ రిక్త హస్తమే చూపారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. చెంబుడు నీళ్లు.. తట్టెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు.

బడ్జెట్‌లో అగ్ర తాంబూలం, గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం భారీ సాయం.. ఏపీకి కలిసొచ్చిన అంశాలేంటి?

Gossip Garage : ఎప్పటి నుంచో చిన్న ఆశ… ఆశ అంటే మామూలు ఆశ కాదు… అలాగని స్వార్థం కోసమో.. స్వలాభం కోసమో కాదు.. నవ్యాంధ్రను నిలబెట్టాలనే ఆశ… ఆ తరుణం ఆసన్నమైంది. నవ్యాంధ్ర నిధులు సాధించుకుంది. ఇది ఏ ఒక్కరి విజయమో కాదు… ప్రజలంతా సరైన సమయంలో తీసుకున్న నిర్ణయమే ఏపీకి నిధుల వరద పారిస్తోంది. ఒక్క రాజధానే కాదు… శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు… అమలాపురం నుంచి అనంతపురం వరకు…. నవ్యాంధ్ర నలుమూలలా అభివృద్ధి జరిగేలా భారీ భరోసా దక్కింది… పదేళ్ల నిరీక్షణ ఫలించింది.. ఈ విజయంలో ఐదు కోట్ల ఆంధ్రుల పాత్ర ఎంత? గతంలో ఎప్పుడూ లేనట్లు కేంద్రం నుంచి ఇంత సాయం దక్కడానికి కలిసొచ్చిన అంశాలేంటి?

బడ్జెట్ లో నిధులు.. ఏపీ ప్రజల విజయం..
ఏపీ ప్రజల ఆశలు నెరవేరుతున్నాయి… రాజధాని వాసుల కలలు ఈడేరుతోంది.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అగ్ర తాంబూళం కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ తీరని కోరికగా మారిన రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు ప్రధాన ప్రాజెక్టులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం భరోసా ఇవ్వడం… కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయిస్తూ ప్రకటన చేయడం ఏపీ ప్రజల విజయంగా చెబుతున్నారు. రాజధాని లేని రాష్ట్రంగా 2014లో మిగిలిన ఏపీ…. పదేళ్లుగా ఎంతో నలిగిపోయింది. రాజకీయాలో… ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడమే.. కారణం ఏదైతేనేం.. పదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగానే మిగిలిపోయింది.

అనివార్యంగానైనా… ఆపన్నహస్తం అందించాల్సి వస్తోంది…
ఇక గత ఎన్నికల్లో రాజధానే ప్రధాన ప్రచార అంశంగా మారడం.. అమరావతి వర్సెస్‌ మూడు రాజధానులుగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు అమరావతిని నిలబెట్టుకున్నారు. ఏపీలో అధికార కూటమికి స్పష్టమైన బలం ఇవ్వడంతోపాటు… తమ తీర్పుతో కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలే కీలకమయ్యేలా తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో పదేళ్లు రకరకాల సాకులు చూపిన కేంద్రం… ఇప్పుడు అనివార్యంగానైనా… ఆపన్నహస్తం అందించాల్సి వస్తోంది.

ప్రజలిచ్చిన తీర్పుతో అమరావతిని అంగీకరించాల్సి వచ్చింది..
ఏపీకి రాజధాని ఓ కల…. నవ నగరాలు అంటూ నవ్యాంధ్ర కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేశారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా.. రాజధాని నిర్మాణాలను పరుగు పెట్టించారు. కానీ, 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత సీన్‌ మారిపోయింది. రాజధాని అమరావతి స్థానంలో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది. దీనిపై ఎన్నో వివాదాలు నడిచినా… తాజా ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుతో ఇటు రాష్ట్రం నుంచి అటు కేంద్రం వరకు అన్ని పార్టీల నాయకులు అమరావతిని అంగీకరించాల్సి వచ్చింది.

చంద్రబాబు, పవన్‌తోపాటు ప్రజలంతా కలిసి సంయుక్తంగా సాధించిన విజయం..
ఇక రాజధాని శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ రిక్త హస్తమే చూపారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. చెంబుడు నీళ్లు.. తట్టెడు మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని గత కొన్నేళ్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా… కేంద్రంలో ప్రధానిగా మోదీనే కొనసాగుతున్నారు. కానీ, గత పదేళ్లలో రాజధానికి ఇంత భారీగా నిధులు ఇవ్వని కేంద్రం… ఇప్పుడు మోదీ 3.O ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌లోనే 15 వేల కోట్లు కేటాయించడం విశేషంగా చెప్పొచ్చు. అందుకే దీన్ని చంద్రబాబు, పవన్‌తోపాటు ప్రజలంతా కలిసి సంయుక్తంగా సాధించిన విజయంగా అంతా అభివర్ణిస్తున్నారు.

కేంద్రంపై టీడీపీ, జనసేన పట్టు బిగించినట్లే..
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఉన్నా… ప్రభుత్వం నడపడానికి బీజేపీకి తగినంత సంఖ్యా బలం లేదు. తప్పనిసరిగా మిత్రపక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి…. అందుకే గతానికి భిన్నంగా ఇప్పుడు మిత్రపక్షాల డిమాండ్లకు తగిన ప్రాధాన్యమిస్తోంది బీజేపీ… దీనికి ఉదాహరణే కేంద్ర బడ్జెట్‌ . ఒక్క ఏపీకే కాదు… కేంద్రంలోని సంకీర్ణ సర్కారులో కీలకంగా మారిన బిహార్‌కు భారీగా సాయం చేసింది. ఐతే ఇక్కడ ఏపీకి జరిగిన కేటాయింపులే దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. పక్కనే ఉన్న తెలంగాణలో బీజేపీకి అధికార పార్టీతో సమానంగా 8 మంది ఎంపీలు ఉన్నా… నిధుల కేటాయింపులో ఏపీకే పెద్దపీట వేసింది. ఇది ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాన్ని తెలియజేస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించడం చూస్తే… ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు కేంద్రంపై పట్టు బిగించినట్లే అర్థం చేసుకోవచ్చంటున్నారు విశ్లేషకులు.

ఎప్పుడూ ఈ స్థాయిలో ఏపీకి ప్రాధాన్యం దక్కలేదు..
గత రెండు సార్లు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా.. ఎప్పుడూ ఈ స్థాయిలో ఏపీకి ప్రాధాన్యం దక్కలేదు. ప్రధాని నరేంద్ర మోదీ తొలివిడత సర్కారులో టీడీపీ భాగస్వామి అయినప్పటికీ.. అప్పుడు టీడీపీ సంఖ్యా బలంతో బీజేపీకి పని లేకపోవడంతో రాష్ట్రం నిర్లక్ష్యానికి గురైందని విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కారణంతోనే 2018లో బీజేపీ-టీడీపీ మధ్య విభేదాలు పెరిగి.. ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగేలా చేసింది. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా కేంద్రంలో బీజేపీని శాసించలేకపోయింది. కేంద్రంలో ఏపీ ఎంపీల అవసరం ఉంటేనే నిధులు సాధించే అవకాశం ఉంటుందని అప్పట్లో వైసీపీ పదేపదే చెప్పేది. కానీ, అవసరమైన సందర్భాల్లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా బీజేపీకి మద్దతు తెలపడం వల్ల ఏపీకి ఎలాంటి ఆదరణ దక్కలేదు.

చంద్రబాబు, పవన్ ఉమ్మడి విజయం..
కానీ, ఇప్పుడు సీన్‌ మారింది. ఏపీ శాసిస్తే…. కేంద్రం పాటించాలి అన్నట్లు పరిస్థితి మారింది. అందుకే చంద్రబాబు విజ్ఞప్తులకు వెనువెంటనే కేంద్రం స్పందించింది. బడ్జెట్‌ సమావేశాలకు ముందు రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు… ప్రధాని మోదీతోపాటు కేంద్రమంత్రులను వరుసగా కలిసి నిధులు సాధించారు. బడ్జెట్‌లో నిధులు ఒక్కటే కాదు… ఎప్పటినుంచో ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను రక్షించారు. కేంద్ర మంత్రి విశాఖ వచ్చి మరీ… ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు ప్రకటించారు. ఇది సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్‌ ఉమ్మడి విజయగా చెప్పొచ్చు. ఇద్దరూ జోడెద్దుల్లా ఏపీ అభివృద్ధికి పనిచేస్తామని చెబుతూనే…. కేంద్రంతో సఖ్యతగా మెలగడం వల్ల తొలి పద్దులోనే చెప్పుకోదగ్గ ఓదార్పు దక్కింది… ఇలా వచ్చే ఐదేళ్లు కేంద్రం సహకారం ఉంటే ఏపీ ప్రజలు ఆశించినట్లు అంతా మంచే జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : పాత పన్ను విధానం.. కొత్త పన్ను విధానం.. ఏది బెస్ట్?