Function Hall Warning Board : ఫ్రీగా తిందామని పిలవని పేరాంటానికి వెళ్తున్నారా.. అయితే నేరుగా జైలుకే.. జరిమానా కూడా..!
Function Hall Warning Board : ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఏర్పాటు చేసిన వార్నింగ్ బోర్డు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడమే కాక దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
mahabubabad function hall board warns uninvited guests will sent jail and rs 5000 fine went viral social media
Function Hall Warning Board : పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఫంక్షన్ హాళ్లన్నీ శుభకార్యాలతో కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు అంటే ఎలాంటి ఫంక్షన్ అయినా సరే ఇంటి వద్దనే నిర్వహించేవారు. బంధుమిత్రులను ఆహ్వానించి.. వారికి రుచికరమైన భోజనంతో విందు ఏర్పాటు చేసేవారు. ఆహ్వానం ఉన్నా లేకపోయినా సరే.. వచ్చిన వారికి కడుపునిండా భోజనం పెట్టేవారు. అయితే అప్పట్లో ఎవరూ కూడా పిలవని పేరంటానికి వెళ్లడానికి ఇష్టపడేవారు కారు. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. శుభకార్యాలన్నీ ఫంక్షన్ హాళ్లకు షిఫ్ట్ అయ్యాయి. లెక్క పెట్టుకుని మరి అతిథులను ఆహ్వానించి.. వారికి భోజనాలు వడ్డిస్తున్నారు. కొందరైతే ఆహ్వాన పత్రిక చూపిస్తేనే.. లోనికి అనుమతిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఆహ్వానం లేకపోయినా సరే ఫంక్షన్కు వెళ్లి శుభ్రంగా భోజనం చేసి వస్తుంటారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేయడం కోసం ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఫంక్షన్ హాల్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానం లేకుండా అంటే పిలవని పేరంటానికి వచ్చే వారిని నేరుగా జైలుకు పంపిస్తామని.. జరిమానా కూడా వేస్తామని హెచ్చరిస్తూ ఓ బోర్డు ఏర్పాటు చేసింది.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అశోక్ నందన గార్డెన్స్ ఫంక్షన్ హాలు ముందు ఏర్పాటు చేసిన ఈ హెచ్చరిక బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ బోర్డు చూసిన వారు కొందరు నవ్వుకుంటే.. మరికొందరేమో ఇది పిసినారితనానికి పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకూ ఆ బోర్డు మీద మ్యాటర్ ఏంటంటే.. ఆ ఫంక్షన్ హాల్లో జరిగే ఫంక్షన్కు సంబంధం లేని వారు.. ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే.. అలాంటి వారికి సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్షతో పాటు.. రూ. 5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఆ బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. అయితే ఈ ఫోటో నిజంగా ఫంక్షన్ హాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారా.. లేక ఎవరైనా వ్యూస్ కోసం ఇలాంటి ఫోటోని సృష్టించారా అనే దానిపై క్లారిటీ లేదు.
ఫంక్షన్కు సంబంధం లేని వ్యక్తులు రాకూడదు అంటూ బోర్డు పెట్టడం ఎక్కడైనా సర్వ సాధారణమే. కానీ దీనిలో ఏకంగా సెక్షన్ 441 గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. కారణం సెక్షన్ 441 తీవ్రత వల్ల. ఇంతకూ ఈ సెక్షన్ ఏంటి.. దీన్ని ఎప్పుడు వాడతారంటే.. భారత శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 441 అక్రమ చొరబాటు గురించి తెలుపుతుంది. అంటే ఒకరి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత ఆస్తి, సముదాయాల్లోకి ప్రవేశించడం చట్టరీత్యా నేరం అని ఈ సెక్షన్ వివరిస్తుంది. అలాంటి వారి మీద 441 సెక్షన్ కింద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత వ్యక్తులకు అవకాశం ఉంటుంది. అందుకే సదరు ఫంక్షన్ హాల్ యాజమాన్యం.. ఈ సెక్షన్ కింద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం సంబంధిత నిర్వాహకులకు ఉంటుందని భావించింది. అందుకే పిలవని పేరంటాలకు భోజనాలకు వెళ్లే వారిని అడ్డుకోవడం కోసం ఈ సెక్షన్ని వినియోగిస్తామని.. దీని కింద జైలుకు పంపడమే కాక.. జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది.
