Narasapuram MPDO: ఏలూరు కాలువ వద్ద నరసాపురం ఎంపీడీవో మృతదేహం.. స్పందించిన పవన్

ఆ ఎంపీడీవో వారం రోజుల క్రితం స్కూటీతో మచిలీపట్నం వరకు వచ్చి, పార్కింగ్ స్థలంలో బైక్ పార్క్ చేసి..

Pawan Kalyan

నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు మృతి చెందారు. కొన్ని రోజులుగా కనపడకుండాపోయిన ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చివరకు ఆయన మృతదేహాన్ని విజయవాడలోని ఏలూరు కాలువ వద్ద గుర్తించి బయటకు తీశారు.

దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవణ్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఆ ఎంపీడీవో కుటుంబానికి న్యాయం చేస్తామని తెలిపారు. ఆయన బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి తీసుకువచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఇప్పటికే పీఆర్ అండ్ ఆర్డీ అధికారులను ఆదేశించానని తెలిపారు. వెంకట రమణారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని చెప్పారు.

పోలీసులు ఏమన్నారు?
కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ గంగాధర్ రావు మాట్లాడుతూ.. ఆ ఎంపీడీవో వారం రోజుల క్రితం స్కూటీతో మచిలీపట్నం వరకు వచ్చి, పార్కింగ్ స్థలంలో బైక్ పార్క్ చేసి, కొండవీడు ఎక్‌స్ప్రెస్ ఎక్కారని తెలిపారు. తన కుమారుడికి 3 పేజీల లెటర్ ను పంపారని వివరించారు.

ఎక్కడికైనా ఊరు వెళ్లారా? లేక మధురా నగర్ బ్రిడ్జిపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారా? అన్న కోణాల్లో కేసును విచారిస్తున్నట్లు తెలిపారు. ఫెర్రీ డబ్బులు 50 లక్షల రూపాయలు కాంట్రాక్టర్ వద్ద నుంచి రావాల్సి ఉందని ఒకవేళ ఆ డబ్బులు రాకపోతే తనపై భారం పడుతుందని ఆత్మహ్యత లేఖలో కుమారుడికి రమణారావు తెలిపారని చెప్పారు.

Also Read: రైల్వే పోలీసుల ఘనత, చోరీ అయిన 713 సెల్‌ఫోన్లు రికవరీ.. ఫోన్ పోతే వెంటనే ఇలా చేయాలని సూచన..