AP Reclassification of Panchayats : పంచాయతీల పునర్ వర్గీకరణకు ఆమోదం.. 4 కేటగిరీలుగా విభజన
AP Reclassification of Panchayats : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల వర్గీకరణకు పచ్చ జెండా ఊపింది.
andhra pradesh government reclassification of gram panchayats into 4 categories in state
AP Reclassification of Panchayats : ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలోని పంచాయతీలను.. జనాభా, పంచాయతీ ఆదాయం ఆధారంగా పునర్ వర్గీకరించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటి వరకు ఏపీలో మూడు రకాల గ్రామ పంచాయతీలు ఉండగా.. ఇకపై ఇవి 4 కేటగిరీలకు మారనున్నాయి. వీటిల్లో ఒక దాన్ని కొత్తగా రూర్బన్ పంచాయతీగా నిర్ణయించారు.
కొత్తగా ఏర్పాటు చేసిన రూర్బన్ పంచాయతీల్లో పట్టణాల తరహా సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనిపై అధికారుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ.. పంచాయతీల పునర్ వర్గీకరణను ప్రతిపాదించింది.
రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు వర్గాలుగా పునర్ వర్గీకరించారు. అవి ఏంటి.. ఏ అంశాల ఆధారంగా విభజించారు అంటే..
రూర్బన్ పంచాయతీలు
10 వేలకు పైగా జనాభా.. రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా వర్గీకరించారు. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే 5 వేల కన్నా ఎక్కువ జనాభా ఉంటే వాటిని రూర్బన్ పంచాయతీలుగా వర్గీకరించారు.
గ్రేడ్-1 పంచాయతీలు
గ్రేడ్ 1 పంచాయతీ అంటే 3 వేల నుంచి 10 వేల మధ్య జనాభా ఉండి.. సంవత్సరానికి రూ. 30 లక్షల కన్నా ఎక్కువ.. రూ. కోటి కన్నా తక్కువ ఆదాయం వచ్చే వాటిని ఈ జాబితాలో చేర్చారు. అయితే గిరిజన ప్రాంతాల్లో అయితే 2,500-5,000 జనాభా ఉంటే వాటిని గ్రేడ్ 1 పంచాయతీలుగా వర్గీకరించారు.
గ్రేడ్-2 పంచాయతీలు
2 వేల కంటే తక్కువ జనాభా.. 30 లక్షల రూపాయల కన్నా తక్కువ వార్షికాదాయం ఉన్న పంచాయతీలను గ్రేడ్ 2 పంచాయతీలుగా వర్గీకరించారు. గిరిజన ప్రాంతాల్లో 1,500-2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్ 2 పంచాయతీలుగా వర్గీకరించారు.
గ్రేడ్-3 పంచాయతీలు
1,500 కంటే తక్కువ జనాభా.. అల్ప వార్షికాదాయం ఉన్న పంచాయతీలను గ్రేడ్ 3 పంచాయతీలుగా వర్గీకరించారు.
