Diamonds Hunting : రతనాల సీమలో వజ్రాల సిరులు.. తొలకరిలో కోటీశ్వరులవుతున్న సామాన్యులు

తొలకరి కురిసిందంటే రాయలసీమలో వజ్రాలు తళుక్కున మెరుస్తాయి. అదృష్టం ఉన్నవారి కంట పడితే ఇక వారి జీవితాలు మారిపోతాయి. వజ్రాల మెరుపులు వారి జీవితాల్లో మెరుస్తాయి. వారి పేదరికంగా పటాపించలై రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతారు.ఈ తొలకరిలో కూడా సామాన్యుల జీవితాల్లో వజ్రాలు మెరుపులు మెరిపిస్తున్నాయి. ఆ తళుకుల వెనుక ఉన్న కష్టం కూడా ఉంది..

Diamonds Hunting In Kurnool : రాయలసీమ రతనాల సీమ అన్న నానుడి అనాదిగా వస్తోంది. అందుకు తగ్గట్టుగానే సీమలో అపారమైన బంగారు, వజ్ర నిక్షేపాలున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు చెబుతున్నాయి. అంతేకాదు ఇక్కడి పొలాల్లో స్థానికుల, రైతులకు వజ్రాలు దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా ఓ రైతుకు 20 లక్షల రూపాయల విలువైన వజ్రం దొరికిందని చెబుతున్నారు. ఇంతకీ సీమలో వజ్రాలు ఎక్కడున్నాయి? వాటిని గుర్తించడం ఎలా?..

వర్షాకాలంలో ఎక్కడైనా రైతులు పొలంబాటపడతారు.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై పైసో పరకో సంపాదించుకోవాలని చూస్తారు. పంటలు బాగా పండి బతుకు బండి సాఫీగా సాగిపోవాలని దేవుడిని ప్రార్థిస్తుంటారు. కానీ, రాయలసీమలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితులు. తొలకిరి ఎప్పుడొస్తుందా.. తమ అదృష్టం ఎప్పుడు మారుతుందా? అని చూస్తుంటారు సీమ రైతులు… ఒక్కసీమ రైతులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అదృష్టంపై నమ్మకంతో అనేక మంది సీమలో పొలంబాట పడుతుంటారు. కరువు నేలగా చెప్పే రాయలసీమలో రైతులు.. ఇతర ప్రాంతాల వారు ఎందుకంత ఆసక్తిగా ఎదురుచూస్తారని ఎవరికైనా అనుమానం రావొచ్చు. రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతోపాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబూనగర్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోని పొలాల్లో వర్షాకాలంలో వజ్రాల వేట సాగుతుంటుంది. అదృష్టవంతులకు కోట్ల రూపాయల విలువైన వజ్రాలు దొరికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

Kurnool District : మహిళా రైతు పంట పండింది.. పొలంలో దొరికిన వజ్రంతో లక్షాధికారి అయ్యింది

తాజాగా కర్నూలు జిల్లా మద్దకికెర మండలంలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికిందని చెబుతున్నారు. ఈ వజ్రానికి 14 లక్షల రూపాయల డబ్బుతోపాటు నాలుగు తులాల బంగారం ముట్టజెప్పి వజ్రాన్ని కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మద్దికేర మండలం మదనంతపురం గ్రామానికి చెందిన ఓ మహిళా రైతుకు ఈ వజ్రం దొరికిందని చెబుతున్నారు. మార్కెట్‌లో వ్యాపారి చెల్లించిన డబ్బుకు మూడింతలు విలువ ఉంటుందని.. అయినా వ్యాపారి మహిళా రైతు నుంచి తక్కువ మొత్తానికి తీసుకున్నారని అంటున్నారు.

ఈ వ్యవహారం ఎలా ఉన్నా.. ఏటా వర్షాకాలంలో రాయలసీమలో వజ్రాల వేటకు వందలాది మంది తరలివస్తుంటారు. వజ్రాలు, రంగులరాళ్ల కోసం రేయింబవళ్లు అన్వేషిస్తుంటారు. కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు ప్రాంతంలో అధిక భాగం ఎర్ర నేలలు ఉన్నాయి. నునుపైన రంగురాళ్లు కలిగిన ఈ ఎర్రనేలలు కొంత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ఎర్రనేలల్లో తొలకరి చినుకులు కురిసిన తరవాత వజ్రాలు దొరుకుతాయన్న స్థానికులు నమ్ముతుంటారు.

Also Read: ఆరుద్రకు వెంటనే రక్షణ కల్పించండి- ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

నంద్యాల-గిద్దలూరు మధ్యనున్న నల్లమల అటవీ ప్రాంతంలోని సర్వనారసింహస్వామి క్షేత్ర పరిసరాల్లోని వంకల్లో వర్షానికి వజ్రాలు కొట్టుకొస్తాయని.. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున అన్వేషణ కొనసాగిస్తుంటారు. ఈ వజ్రాల కోసం రాయలసీమ వాసులే కాకుండా ప్రకాశం, గుంటూరు జిల్లాలతోపాటు కర్నాటకలోని బళ్లారి నుంచి కూడా జనం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇలా వచ్చే వారంతా పొలాలకు సమీపంలో చెట్లకిందే వంట చేసుకుని తింటూ.. రాత్రిళ్లు పాఠశాలలు, ఆలయాల వద్ద తలదాచుకుంటూ తమ అదృష్టం తిరిగేవరకు ప్రతి అణువూ జల్లెడ పడుతుంటారు. చాలామంది తేడాగా కనిపించిన రాళ్లన్నిటినీ ఏరుకుంటుంటారు.

సీమ జిల్లాల్లో వజ్రాలపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం శ్రీకృష్ణదేవరాయల పాలనలో వజ్రాలు, రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని, శత్రువులు కొల్లగొట్టకుండా రాజులు ఎక్కడపడితే అక్కడ నిధులు దాచారని, అప్పట్లో ఊహించని వైపరీత్యాలవల్ల వజ్రాలు, రత్నాలు భూమిలో కలిసిపోయి ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు అవి బయటపడుతున్నాయన్నది ఒక కథనం. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఔషధ మెుక్కలున్నాయని, వర్షపు బిందువులు వాటిపై పడ్డప్పుడు అవి వజ్రాలుగా మారతాయని, ఈ విషయం కొన్ని వైద్య గ్రంథాల్లోకూడా ఉందన్నది మరో కథనం.

Also Read: దారుణంగా పోస్టులు పెడుతున్నారు, మిమ్మల్ని ఏడిపించే రోజు మాకు త్వరలోనే వస్తుంది- వంగలపూడి అనిత

అయితే ఈ వాదనలను కొట్టిపడేస్తున్నారు గనులు, భూగర్భశాఖ అధికారులు. సీమలో వజ్రాల నిక్షేపాలున్నాయని, భూమి లోపల సహజసిద్ధంగా జరిగే కొన్ని పరిణామాల వల్ల అవి భూపైభాగానికి చేరుకుంటాయని గనుల శాఖ అభిప్రాయం… ఏదిఏమైనా సీమ పొలాల్లో లభించే వజ్రాలు చాలా మంది జీవితాలను ఒక్క రోజులోనే మార్చేస్తున్నాయి. అదేసమయంలో వజ్రాలపై ఆశతో చాలా మంది సొంతపనులు మానుకుని ఊసురోమంటున్నారు. లక్‌ ఫేవర్‌ చేస్తేనే వజ్రం దొరకడమైనా.. దరిద్రం వదలడమైనా జరుగుతుందనేది జగమెరిగిన సత్యం.

 

ట్రెండింగ్ వార్తలు