ఫైల్స్‌ కాల్చివేత అందుకేనా.. ఇది వారి పనేనా.. తప్పు మీద తప్పుతో మరింత ముప్పు తెచ్చుకుంటున్నారా?

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఫైళ్లు మాయం చేశారని, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్‌ చేశారంటున్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్‌ చేసిన ఫైళ్లు రికవరీ చేస్తోందట ప్రభుత్వం.... కానీ, గల్లంతైన నోట్‌ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియడం లేదంటున్నారు.

Gossip Garage : అగ్గి రాజుకుంటోంది…. మారిన రాజకీయం మంటలు పుట్టిస్తోంది…. ఇన్నాళ్లు గుట్టుచప్పుడుగా సాగిన దందాలు బయటపడతాయన్న టెన్షనో…. జరిగిన తప్పులు… చేసిన మేళ్లు ద్వారా బక్కైపోతామనే బెంగో కాని… ముఖ్య ఫైళ్లు బూడిదవుతున్నాయి. ఫలితాలకు ముందు సీఐడీ కార్యాలయంలో హెరిటేజ్‌ ఫైళ్లు… తాజాగా భూగర్భ గనులశాఖ పత్రాల కాల్చివేత రాజకీయ వివాదానికి కారణమవుతోంది. అసలు ఫైల్స్‌ కాల్చివేత దేనికి? కాగితాలే కదా కాల్చేస్తే పోలా? అనుకున్నారా? కాల్చేయమని ఆదేశించినది ఎవరు? ఆచరించినది ఎవరు? తప్పుమీద తప్పుతో మరింత ముప్పు తెచ్చుకుంటున్నారా?

పనికిరాని పత్రాలను రహస్యంగా కాల్చివేయడం దేనికి?
ఏపీ రాజకీయం వేడెక్కుతోంది. అధికారం మారిన తర్వాత గత ప్రభుత్వ వ్యవహారాలపై కూపీలాగుతున్న ప్రభుత్వం…. ఎవరిపై యాక్షన్‌ తీసుకుంటుందోనన్న టెన్షన్‌ వైసీపీ నేతలు, వారికి అనుకూలంగా పనిచేసిన అధికారులను వెంటాడుతోంది. ఇప్పటికే ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖ వ్యవహారాలపై విచారణ చేస్తున్న ప్రభుత్వం కీలక ఆధారాలు సేకరించిందంటున్నారు. ఇదే సమయంలో విజయవాడలో భూగర్భ గనుల శాఖకు చెందిన కీలక పత్రాలు రహస్యంగా కాల్చివేయడం చర్చనీయాంశమైంది.

ఆధారాలు మాయం చేయాలనుకోవడం ద్వారా మరో తప్పు..
పనికిరాని చిత్తు కాగితాలే కాల్చేశామని పోలీసుల అదుపులో ఉన్న నిందితులు చెబుతున్నప్పటికీ… పనికిరాని కాగితాలను రహస్యంగా కాల్చివేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. కార్యాలయానికి దూరంగా కీలక పత్రాలను ఎందుకు తరలించాల్సివచ్చిందన్న విషయాన్ని పోలీసులు కూపీలాగుతున్నారు. ఇప్పటికే కొన్ని వ్యవహారాల్లో అడ్డంగా దొరికిపోయిన నేతలు, అధికారులు… పత్రాలను కాల్చివేసి ఆధారాలు మాయం చేయాలనుకోవడం ద్వారా మరో తప్పు చేసినట్లైంది.

ఎక్సైజ్‌ శాఖలో ఫైళ్ల మాయంపై సీఐడీ కేసు..
రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ప్రక్షాళన ప్రారంభించారు. ఆర్థిక శాఖతోపాటు పోలవరం, అమరావతి, ఎక్సైజ్‌, మైనింగ్‌ డిపార్ట్‌మెంట్లపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే పోలవరం, అమరావతి శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇక మిగిలిన శాఖలపై సమాచార సేకరణ జరగుతోంది. ఇదే సమయంలో ఎక్సైజ్‌ శాఖలో ఫైళ్లు మాయంపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు ఎక్సైజ్‌, మైనింగ్‌ శాఖా కార్యాలయాలను ప్రభుత్వం సీజ్‌ చేసింది.

గనులశాఖలోని ఆ నోట్ ఫైల్స్ ఏమయ్యాయి?
ఐతే ఎన్నికల ఫలితాలకు ముందే కొన్ని శాఖల్లో కీలక సమాచారం మాయం చేసినట్లు గుర్తించింది ప్రభుత్వం. గనుల శాఖలో చాలా వరకు నోట్‌ ఫైల్స్‌ కనిపించడం లేదంటున్నారు. దీనిపైన కూపీలాగుతున్న ప్రభుత్వం బాధ్యులను గుర్తించే పనిలో పడింది. ఈ పని ఒకవైపు కొనసాగుతుండగానే… అదే శాఖకు చెందిన కొన్ని పత్రాలు కార్యాలయం బయటకు రావడం, నిర్మానుష్య ప్రాంతంలో కాల్చివేయాలని చేయడం సంచలనంగా మారింది.

ఫైల్స్ మాయం, సమాచారం డిలీట్?
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఫైళ్లు మాయం చేశారని, కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని డిలీట్‌ చేశారంటున్నారు. సాంకేతిక నిపుణుల సహకారంతో డిలీట్‌ చేసిన ఫైళ్లు రికవరీ చేస్తోందట ప్రభుత్వం…. కానీ, గల్లంతైన నోట్‌ ఫైళ్లు ఎక్కడున్నాయో తెలియడం లేదంటున్నారు. ముఖ్యమైన నోట్‌ ఫైళ్లను రహస్యంగా దాచారా? లేక వాటికి నిప్పుపెట్టి బూడిద చేశారా? అన్నది తెలియాల్సి వుంది.

పెద్దిరెడ్డి సూచనలతోనే కీలక ఫైళ్ల కాల్చివేత?
ఎన్నికల ఫలితాలకు ముందు సీఐడీ విభాగంలో హెరిటేజ్‌ సంస్థకు చెందిన కీలక పత్రాలను కాల్చివేయడం వివాదాస్పదమైంది. అప్పట్లో ఎన్నికల కోడ్‌ ఉండటంతో ఈసీ ఆ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. దీనిపై ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుండగా, తాజాగా విజయవాడ యనమలకుదురులో భూగర్భశాఖకు చెందిన పత్రాలు కాల్చివేయడం, ఆ పత్రాల్లో వైసీకి చెందిన కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫొటోలు కనిపించడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. పెద్దిరెడ్డి సూచనలతోనే కీలక ఫైళ్లు కాల్చేశారని టీడీపీ ఆరోపిస్తోంది.

ప్రధాన కార్యాలయాలు, అధికారుల కదలికలపై టీడీపీ నిఘా..
ప్రభుత్వం మారి దాదాపు నెల రోజులు కావస్తున్నా, అధికారులు ఇంకా పాత వాసనలు వదిలించుకోలేకపోతున్నారని, గతంలో చేసిన తప్పులకు ఎక్కడ బలైపోతామనే భయంతోనే ఫైళ్లు కాల్చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది టీడీపీ. నిజానికి పోలింగ్‌ జరిగిన నుంచి ఏపీ సచివాలయంతోపాటు, విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉన్న ప్రధాన కార్యాలయాలపై టీడీపీ ఓ కన్నేసి ఉంచింది. అనుమానం ఉన్నచోట అధికారుల కదలికలపై నిఘా వేసింది. ఇలా టీడీపీ క్యాడర్‌ అప్రమత్తంగా ఉండటంతోనే ఎక్సైజ్‌శాఖ కార్యాలయం నుంచి అప్పటి బెవరేజెస్‌ ఎండీ వాసుదేవరావు ఫైళ్లు హైదరబాద్‌కు తరలించడం బయటపడింది.

ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు టీడీపీ కేడర్ డేగ కన్ను..
అదేవిధంగా హెరిటేజ్‌ పత్రాల కాల్చివేతను తొలుత బయటపెట్టింది టీడీపీ కార్యకర్తలే. తాజాగా విజయవాడ సంఘటనలోనూ పత్రాలు తీసుకువచ్చిన కారును వెంబడించి, అందులోని ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నదీ టీడీపీయే. నిను వదలని నీడను నేను… అన్నట్లు అక్రమార్కులను నీడలా వెన్నాడుతున్న టీడీపీ నేతలు.. ఫైళ్ల దహనాలను అడ్డుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ నిఘా, ఇంకోవైపు టీడీపీ కేడర్‌ డేగ కళ్ల నుంచి తప్పించుకోవడం కష్టంగా మారడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు, అధికారులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

Also Read : కూటమి ప్రభుత్వం టార్గెట్ నెంబర్ 1 ఆయనేనట..! సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎం ముప్పేట దాడితో ఉక్కిరిబిక్కిరి

ట్రెండింగ్ వార్తలు