Sarvepalli Constituency: కాకాణి వర్సెస్ సోమిరెడ్డి.. ఈసారి పైచేయి ఎవరిదో.. సర్వేపల్లి ఎవరికి జైకొడుతుంది?

సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఓటమి చెందిన టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసివస్తాయని ఆశిస్తున్నారు.

sarvepalli assembly constituency ground report

Sarvepalli Assembly Constituency: సర్వేపల్లి.. రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియోజకవర్గం పేరు తెలియని వారు ఉండరు. హేమాహేమీలు తలపడే సర్వేపల్లిలో ఈ సారి కూడా టఫ్ ఫైట్ (Tough fight) తప్పేలా లేదు. ఉద్దండులైన ఇద్దరు నాయకుల మధ్య పోటీ పొలిటికల్ వార్‌ను ప్రతిబింబిస్తోంది. ఇప్పటివరకు ఏ నాయకుడు వరుసగా మూడోసారి గెలవని ఈ నియోజకవర్గం నుంచి.. మూడోసారి గెలిచి ఆ రికార్డు తిరగరాయాలని కోరుకుంటున్నారు ఇద్దరు ముఖ్యనేతలు. ఈ ఇద్దరు ఒకరు రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి (Kakani Govardhan Reddy) అయితే.. ఇంకొకరు కాకాణి ప్రత్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy). హాట్ హాట్ పాలిటిక్స్‌కు… హైటెన్షన్ రాజకీయానికి కేరాఫ్ సర్వేపల్లి. రాబోయే ఎన్నికల్లో కనిపించే సీనేంటి. సర్వేపల్లి ఎవరికి జైకొడుతుంది? నెల్లూరు జిల్లా (Nellore District)లో తిరుగులేని నేతలుగా వెలుగొందుతున్న ఇద్దరు నేతల్లో ఈ సారి పైచేయి ఎవరిదో ఇప్పుడు చూద్దాం..

నెల్లూరు జిల్లా అంటే రాజకీయ చైతన్యం ఎక్కువ. రాష్ట్ర, దేశ రాజకీయాలలో ఉన్నత పదవులు అధిరోహించిన నాయకులు చాలా మంది ఈ జిల్లాలో ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న నెల్లూరులో గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా చూపింది. ఈ సారి బలాబలాల్లో కాస్త మార్పు కనిపిస్తోంది. ప్రధాన పార్టీల మధ్య తీవ్ర పోటీ తీవ్రంగా ఉంది. ప్రత్యేకించి జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

సర్వేపల్లి నియోజకవర్గంలో తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు మండలాలు ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఈ నియోజకవర్గంలోనే దేశంలోనే రెండో అతిపెద్ద కృష్ణపట్నం పోర్టు ఉంది. పవర్ ప్రాజెక్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలతో సర్వేపల్లి చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. వ్యవసాయంతో పాటు ఆక్వా కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు. 1955లో ఏర్పాటైన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ఆంధ్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన బెజవాడ గోపాల్ రెడ్డి తొలిసారి శాసన సభ్యులుగా గెలిచారు.

ఈ నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 31 వేల 837 మంది ఓటర్లు ఉoడగా, పురుష ఓటర్లు లక్ష 13 వేల 473. మహిళ ఓటర్లు లక్ష 18 వేల 336. ఇప్పటివరకు ఒక ఉప ఎన్నికతో సహా 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఏడు సార్లు, తెలుగుదేశం నాలుగు సార్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు, సిపిఐ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. అంతేకాదు ఈ నియోజకవర్గం నుంచి ఏ ఎమ్మెల్యే కూడా మూడుసార్లు గెలిచిన పరిస్థితి లేదు. సివి శేషా రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిలు కేవలం రెండుసార్లు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న మంత్రి కాకాణి, మాజీ సోమిరెడ్డిల్లో ఎవరు గెలిచినా అదో రికార్డే అవుతుంది.

Also Read: సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా లక్ష్మీనారాయణ వల్ల అవుతుందా?

1955లో మొట్టమొదటిసారిగా బెజవాడ గోపాలరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నిక కాగా, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో అదే పార్టీ అభ్యర్థి జె.కె.రెడ్డి గెలుపొందారు. 1962లో వి. వెంకురెడ్డి, 1967లో ఎస్‌సీ రిజర్వుడు కేటగిరిలో సిపిఐ తరఫున స్వర్ణ వేమయ్య గెలుపొం దారు. 1972లో మంగళగిరి నానా దాస్, 1978లో సివి శేషారెడ్డి, 1983లో టిడిపి తరపున చెన్నారెడ్డి పెంచలరెడ్డి విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేత ఇ.రామకృష్ణారెడ్డి, 1989లో కాంగ్రెస్ అభ్యర్థి సి.వి శేషారెడ్డి గెలుపొందారు. 1994, 1999లో తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వరుసగా రెండు సార్లు విజయం సాధించి మంత్రిగా పనిచేశారు. ఇక 2004, 2009లో ప్రముఖ కాంట్రాక్టర్ ఆదాల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. 2014, 2019ల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకాని గోవర్దన్ రెడ్డి పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు.

కాకాణి గోవర్దన్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

కాకాని, సోమిరెడ్డి మధ్య టఫ్ ఫైట్
ఈసారి ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి మధ్య టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఏదో ఒక టాపిక్తో నిత్యం వేడివేడిగా ఉంటుంది సర్వేపల్లి రాజకీయం. తొమ్మిదేళ్లుగా నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్న ఈ పోరు వచ్చే ఎన్నికల్లో పతాక స్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. నిత్యం ఏదో ఒక ఇష్యూతో ఈ నియోజకవర్గంలో రాజకీయ రగడను రాజుకుంటూనే ఉంది. గతంలోనూ ఇద్దరి మధ్య అనేక వివాదాలు తలెత్తాయి. లిక్కర్, ఆస్తుల గొడవ, ఇసుక రవాణా, గ్రావెల్, ధాన్యం కొనుగోలు, కోర్టు కేసు.. ఇలా రకరకాల అంశాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరి మధ్య పోటీ.. పొలిటికల్ టెంపరేచర్‌ను పెంచేస్తోంది.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (photo: facebook)

సానుభూతి ఓట్లపై సోమిరెడ్డి ఆశలు
సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఓటమి చెందిన టీడీపీ నేత సోమిరెడ్డి ఈసారి సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కలిసివస్తాయని ఆశిస్తున్నారు. ఈ సారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు సోమిరెడ్డి. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలపై తరచూ గళం విప్పుతూ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలు రియలైజ్ అయ్యారని, చంద్రబాబు పాలనను కోరుకుంటున్నారని.. తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా ప్రదర్శిస్తున్నారు సోమిరెడ్డి.

కాకాణి గోవర్దన్‌రెడ్డి (photo: facebook)

ఇక మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండు సార్లు సర్వేపల్లి నుంచి వైసిపి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాకాని మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతానంటున్నారు. జగన్ క్యాబినెట్లో సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు కాకాని. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా కౌంటర్ ఇస్తూ సీఎం జగన్ వద్ద మంచి మార్కులు కొట్టేశారు. ఇటు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సుమారు నాన్ ఫిషర్మెంట్ ప్యాకేజీ కింద 30 కోట్ల రూపాయలు విడుదలకు కృషి చేశారు కాకాని. జెన్కో పవర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించారు. డేగపూడి-బండే పల్లి కాలువ పనులు ప్రారంభించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సీఎం జగన్ పాలన, సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయనంటున్నారు మంత్రి కాకాని.

Also Read: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాఖాలో వైసీపీ తడాఖా చూపుతుందా?

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోరు మాత్రం రసవత్తరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నియోజక వర్గ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందనేదే ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు