Sattenapalle Constituency: సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా లక్ష్మీనారాయణ వల్ల అవుతుందా?

అంబటి రాంబాబుకి.. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్‌గా.. ఈసారి సత్తెనపల్లిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.

Sattenapalle Assembly constituency Ground Report

Sattenapalle Assembly constituency : రాజకీయాల్లో ఇద్దరూ తలపండిన నేతలే. ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్లే. పైగా.. ఒకేసారి సామాజికవర్గానికి చెందిన వాళ్లు. గట్టి వాయిస్ ఉన్న వాళ్లు. ఇన్నాళ్లూ.. వేర్వేరు చోట్ల పోటీ చేసిన ఆ ఇద్దరు నేతలు.. రాబోయే ఎన్నికల్లో ఒకే సీటు నుంచి బరిలో దిగబోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా (Guntur District)కు చెందిన కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana), మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu).. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేయడం ఖాయమనే టాక్ లోకల్ పాలిటిక్స్‌ (local politics)లో హీట్ పెంచుతోంది. మరి.. ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా వల్ల అవుతుందా? టీడీపీలోని గ్రూపులు కన్నా లక్ష్మీనారాయణకు సహకరిస్తాయా? సత్తెనపల్లిలో ఈసారి కనిపించబోయే సీనేంటి?

సత్తెనపల్లి.. పల్నాడు జిల్లాలో హాట్ సీటు. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి.. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయ్. సత్తెనపల్లి అంటే.. పలానా పార్టీకి కంచుకోట అని చెప్పడానికి కూడా వీల్లేని విధంగా సాగుతుంది ఇక్కడి రాజకీయం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్లు, తెలుగుదేశం(Telugu Desam Party), వైసీపీ.. ఇలా ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. అవి.. రాజుపాలెం, నకరికల్లు, ముప్పాల, సత్తెనపల్లి. ఇక.. రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో.. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇక్కడ గెలుపు జెండా ఎగరేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన అంబటి రాంబాబు.. ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో.. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి అంబటి రాంబాబు, టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు.. లోకల్ పాలిటిక్స్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

అంబటి రాంబాబు (photo: twitter)

అంబటి రాంబాబు, కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం ఓసారి చూస్తే.. 1989 ఎన్నికల్లో రేపల్లె నుంచి అంబటి, పెదకూరపాడు నుంచి కన్నా ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత.. రాంబాబుకు రాజకీయాల్లో పెద్దగా అవకాశాలు రాకపోగా.. కన్నా మాత్రం ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో ఎత్తుకు ఎదిగారు. రాష్ట్ర విభజన తర్వాత సీన్ రివర్స్ అయింది. అంబటి కాంగ్రెస్‌ని వీడి జగన్ వెంట నడిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున సత్తెనపల్లి బరిలో దిగి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో విజయం సాధించి.. జగన్ మంత్రి వర్గంలో చోటు సంపాదించుకున్నారు. కన్నా విషయానికొస్తే.. 2014 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల నాటికి బీజేపీలో చేరి.. నర్సరావుపేట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసినా.. విజయం దక్కలేదు. ప్రస్తుతం.. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాంటిది.. ఇప్పుడు ఇద్దరు నేతలు ఒకే స్థానం నుంచి బరిలోకి దిగుతుండటం.. రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.

కన్నా లక్ష్మీనారాయణ (photo: twitter)

టీడీపీ విషయానికొస్తే.. పల్నాడు జిల్లా (palnadu district)లో తెలుగుదేశానికి ఇంచార్జ్ లేని ఒకే ఒక్క నియోజకవర్గం సత్తెనపల్లి. ఇక్కడ 3 గ్రూపులున్నాయ్. ముగ్గురు నేతలు టికెట్ కోసం పోట్లాడుకుంటుంటే.. బీజేపీ నుంచి పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణని ఇంచార్జ్ పదవి వరించింది. అధిష్టానానికి తలనొప్పిగా మారిన సత్తెనపల్లి వ్యవహారాన్ని.. చంద్రబాబు చాలా సింపుల్‌గా డీల్ చేశారు. అయితే.. సత్తెనపల్లిలో కోడెల శివరాం (Kodela Sivaram), మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు (yv anjaneyulu), యువనేత అబ్బూరి మల్లి (Abburi Malli Babu).. ఎవరికి వారు గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వారసుడిగా.. సత్తెనపల్లి టీడీపీపై సర్వహక్కులు తనకే ఉన్నాయనేలా కోడెల శివరాం వ్యవహారశైలి ఉంది. ఈ ముగ్గురు నేతల్లో ఎవరికి బాధ్యతలు అప్పజెప్పినా.. మిగతా రెండు గ్రూపులు వ్యతిరేకంగా పనిచేస్తాయనే రిపోర్ట్ చంద్రబాబుకి అందింది. దాంతో.. సీనియర్ లీడర్ కన్నాకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పజెప్పారు. అంతేకాదు.. కాపు సామాజికవర్గంపై మంచి పట్టున్న కన్నాని అక్కడికి పంపండం ద్వారా.. పల్నాడు జిల్లాపై కొంతైనా ప్రభావం చూపొచ్చనే ఆలోచన కూడా చంద్రబాబు మదిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కోడెల శివరాం (photo: twitter)

సత్తెనపల్లిలోని రాజుపాలెం, నకరికల్లులోని సగం గ్రామాలు ఒకప్పుడు పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్నవే. వీటిలో.. కన్నాకు భారీ అనుచరగణం ఉంది. అందుకే.. అంబటి దూకుడుకు చెక్ పెట్టేందుకు.. అక్కడ కన్నాని ఇంచార్జ్‌గా నియమించిందనే టాక్ ఉంది. దాంతో పాటు రాబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటి నుంచే.. అంబటిని ఓడించేందుకు గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ కూడా మొదలుపెట్టేశారనే ప్రచారం సాగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే.. వైసీపీని ఓడించడం ఈజీ అవుతుందని చెబుతున్నారు. దీనికితోడు సత్తెనపల్లిలోని రెడ్లలో అంబటిపై కొంత వ్యతిరేకత ఉందనే టాక్ వినిపిస్తోంది. పైగా.. కన్నా బరిలో దిగొచ్చనే సంకేతాలుండటంతో.. అంబటి కూడా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

పక్కాల సూరిబాబు (photo: twitter)

గతంలో కన్నా లక్ష్మీనారాయణ అనుచరుడిగా ఉండి.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న పక్కాల సూరిబాబు (pakkala suribabu)తో.. అంబటి మంతనాలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఎన్నికలకు ఇంకా ఏడాది టైమ్ ఉన్నా.. సత్తెనపల్లిలో ఇప్పుడే పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. కన్నా, అంబటి పోటీకి దిగితే.. గెలిచేది వాయిస్ ఆఫ్ జగనా.. కమిట్మెంట్ ఉన్న కన్నానా? అనే చర్చ మొదలైంది. సత్తెనపల్లిలో మైనార్టీలు, ఎస్సీలు, బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటారు. మైనార్టీలు దాదాపుగా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల మండలాల్లో.. టీడీపీకి బలముంది. అయితే.. సత్తెనపల్లిలో కమ్మ సామాజికవర్గానికి చెందిన ఓట్లు 40 వేల దాకా ఉన్నాయ్. ఇప్పుడు ఆ వర్గమంతా.. కన్నా నియామకాన్ని వ్యతిరేకిస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. దాంతో.. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటి.. గెలుపు జెండా ఎగరేసే పార్టీ ఏది అన్నదే ఇప్పుడు మోస్ట్ ఇంట్రస్టింగ్ పాయింట్.

Also Read: టెక్కలిలో అచ్చెన్నాయుడు దూకుడుకు చెక్ పెడతారా.. అధికార పార్టీ నేతలంతా ఒక్కటవుతారా?

1983 నుంచి ఇప్పటివరకు సత్తెనపల్లిలో తెలుగుదేశం పార్టీ 3 సార్లు మాత్రమే గెలిచింది. 1983లో నన్నపనేని రాజకుమారి, 1999లో వైవీ ఆంజనేయులు, 2014లో కోడెల శివప్రసాదరావు మాత్రమే టీడీపీ తరఫున విజయం సాధించారు. ఈసారి.. కన్నా బరిలో దిగుతుండటంతో.. మరోసారి తెలుగుదేశం గెలుపు ఖాయమనే ధీమా తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. పైగా.. ఒకప్పుడు పెదకూరపాడులో ఉన్న రాజుపాలెం మండలం ఇప్పుడు సత్తెనపల్లిలో ఉండటం కన్నాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అంబటి రాంబాబును ఢీకొట్టేందుకు.. కన్నానే కరెక్ట్ క్యాండిడేట్ అని టీడీపీ నమ్ముతోంది.

Also Read:  యర్రగొండపాలెంలో గెలుపు నీదా, నాదా.. సై అంటున్న వైసీపీ, టీడీపీ

కన్నా లాంటి వ్యక్తికి సత్తెనపల్లి అప్పగించడం ద్వారా.. ఏపీ వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం వైపు తిప్పుకోవచ్చనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే.. సత్తెనపల్లి సీటు కోసం ఆశపడిన ముగ్గురు నేతలకు చంద్రబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లిపోయాయి. వాళ్ల రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని హామీ ఇచ్చి.. కన్నాకు సహకరించాలని ఆదేశించారు. వాళ్ల సహకారం ఏ మేరకు ఉంటుందన్నదే.. ఆసక్తిగా మారింది. మరోవైపు.. అంబటి రాంబాబు హయాంలో నియోజకవర్గంలో 20 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. నాడు- నేడు కింద స్కూళ్లను, విలేజ్ క్లినిక్‌లను అభివృద్ధి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సత్తెనపల్లి టౌన్‌లో పెద్దగా అభివృద్ధి జరగలేదని జనం భావిస్తున్నారు. దాంతో.. అంబటి రాంబాబుకి.. ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయనే దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. ఓవరాల్‌గా.. ఈసారి సత్తెనపల్లిలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు