Shaik Mastan Vali : మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రధాని 30 సెకన్లు మాత్రమే మాట్లాడారు.. బీజేపీ చేసింది శూన్యం

రావణకాష్టంలా తయారైన మణిపూర్ రాష్ట్రంలో హింసాత్మక ఘటనలను నివారించడానికి బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలీ, తులసిరెడ్డి విమర్శించారు.

Shaik Mastan Vali Tulasi Reddy takes on PM Modi over Manipur violence

Shaik Mastan Vali – Tulasi Reddy : మణిపూర్ లో మహిళలపై జరిగిన దారుణ ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్ వలీ డిమాండ్ చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ (Manipur) ఒక రావణకాష్టం లా తయారైందని.. మెయిటీ తెగను తీసుకొచ్చింది బీజేపీయేనని ఆరోపించారు. మణిపూర్ పరిణామాలపై అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని.. భారతదేశం తల దించుకునేలా డబుల్ ఇంజిన్ పార్టీ పరిపాలన ఉందని విమర్శించారు. మణిపూర్ వాసులు శాంతియుతంగా ఉండాలని, సంయమనం పాటించాలని తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోరినట్టు చెప్పారు.

దేశంలో అవమానకర సంఘటనలు జరుగుతున్నాయని మస్తాన్ వలీ వాపోయారు. సుప్రీంకోర్టు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతోనే ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు వచ్చారని.. పార్లమెంటులో 30 సెకన్లు మాత్రమే ప్రధాని మణిపూర్ గురించి మాట్లాడారని తెలిపారు. మోదీ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని.. ఇదే పంథాలో దేశ వ్యాప్తంగా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. కామన్ సివిల్ కోడ్ తో భయానక వాతావరణం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. కామన్ సివిల్ కోడ్ ను 2018లోనే లా కమిషన్ నిలిపేసిందని గుర్తు చేశారు.

బీజేపీ ప్రభుత్వం చేసింది శూన్యం: తులసిరెడ్డి
గత 75 రోజులుగా మణిపూర్ రాష్ట్రంలో మంటలు మండుతున్నా రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా చేసింది శూన్యమని కాంగ్రెస్ పార్టీ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. కడపలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మణిపూర్ లో హత్యలు, అత్యాచారాలు.. అకృత్యాలు జరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని అన్నారు. రాబోవు లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపు తథ్యం, ఎన్డీఏ ఓటమి సత్యమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ పంగనామాలు పెట్టి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు.

Also Read: నగ్నంగా మహిళల ఊరేగింపు.. నాటి షాకింగ్ ఘటన గురించి బాధిత మణిపూర్ మహిళ ఏం చెప్పారంటే..

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతంలో బీజేపీని తప్పుబట్టి ఇప్పుడు ఎన్డీఏతో జట్టు కట్టడం శోచనీయమని తులసిరెడ్డి అన్నారు. పెట్రోల్ ధరలు దేశంలో కల్లా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉన్నాయని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ధరలు పెంచారని దుయ్యబట్టారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో నజీర్ అహ్మద్, విష్ణుప్రీతంరెడ్డి, సత్తారు తిరుమలేశు తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఈ ఒకే ఒక్క వదంతి వల్ల.. ఆ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించారు.. ఇప్పుడు యావత్ భారత్ రగిలిపోతోంది..

ట్రెండింగ్ వార్తలు