Pathapatnam Constituency: వైసీపీ, టీడీపీలోనూ అసమ్మతి కుంపట్లు.. ఎవరు తగ్గుతారో, ఎవరు నెగ్గుతారో!

పాతపట్నం నియోజకవర్గంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ కనిపిస్తోంది. రెండు పార్టీల్లోనూ గ్రూప్ వార్ జరుగుతుండటంతో టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది చివరి వరకు సస్పెన్స్‌గా మారనుంది.

Pathapatnam Assembly Constituency Ground Report

Pathapatnam Assembly Constituency : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పాతపట్నం, L.N.పేట, కొత్తూరు, హిరమండలం, మెళియాపుట్టి మండలాలు ఉన్నాయి. మొత్తం 2 లక్షల 24 వేల 648 మంది ఓటర్లు ఉండగా, వీరిలో పురుష ఓటర్లు లక్ష 12 వేల 588 మంది. లక్ష 12 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన రెడ్డి శాంతి (Reddy Shanthi) ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి (Kalamata Venkataramana Murthy) పై 15 వేల 551 ఓట్ల మెజారిటీతో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే.. కొద్దికాలంగా సొంత క్యాడర్ నుంచి అసమ్మతిని ఎదుర్కొంటుండటం.. నియోజకవర్గ రాజకీయంలో హీట్ పుట్టిస్తోంది. తూర్పు కాపు ఓట్లు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఎస్టీ ఓట్లూ విజేతను ప్రభావితం చేస్తాయి. వెలమ, కాళింగ, శ్రీశయన సామాజిక వర్గ ఓట్లరు నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు.

పాతపట్నంలో కొన్ని దశాబ్దాలుగా కలమట కుటుంబం హవాయే నడిచింది. 1978లో ఈ స్థానం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావు.. ఆ తర్వాత కొద్దికాలం కాంగ్రెస్.. సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగి పాతపట్నం తన అడ్డాగా మార్చుకున్నారు. అయితే 1994 ఎన్నికల్లో దేవుని ఫొటోతో ప్రచారం చేశారన్న కారణంగా ఎన్నికల కమిషన్ మాజీ ఎమ్మెల్యే కలమట మోహనరావుపై ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి.. ఈ స్థానం నుంచి అన్న తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి రికార్డు సృష్టించారు. ఆ తర్వాత కూడా కలమట కుటుంబం హవా నడిచింది. 2009 ఎన్నికల ముందు కలమట మోహనరావు ప్రజారాజ్యంలో చేరగా, ఆయన వారసునిగా రాజకీయాల్లోకి వచ్చిన కలమట వెంకటరమణ మూర్తి మాత్రం టీడీపీలో కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు కలమట వెంకటరమణ వైసీపీలో చేరగా, ఆయనపై మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కలమట వెంకటరమణ గెలుపొందగా.. రెండేళ్ల తర్వాత తిరిగి టీడీపీ గూటికి చేరి.. ఇప్పటికీ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే 2014లో వైసీపీ తరఫున గెలిచిన వెంకటరమణమూర్తి ప్లేటు ఫిరాయించడంతో 2019లో ఆయనపై జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన జడ్పీ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతిని పోటీకి పెట్టింది వైసీపీ.. అప్పట్లో జగన్ హవాలో సునాయాశంగా గెలిచారు ఎమ్మెల్యే శాంతి.

Reddy Shanthi

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రెడ్డి శాంతి వైఖరిలో చాలా మార్పు వచ్చిందని ఆరోపిస్తున్నారు కార్యకర్తలు. జిల్లాలో మరే నియోజకవర్గంలోనూ లేనట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేపై నియోజకవర్గం క్యాడర్ మొత్తం తిరుగుబాటు చేస్తోంది. బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేస్తున్నా.. అధిష్టానం మాత్రం దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఎమ్మెల్యే గెలిచిన ఈ నాలుగున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ది జరగలేదనేది ప్రతిపక్షాల విమర్శ. ఎన్నికల హామీలైన వంశధార నిర్వాసితుల సమస్య ఇప్పటికి పరిష్కారమవ్వలేదు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చినా అమలు కాలేదు. పాతపట్నంలో భూగర్భ డ్రైనేజీ, సిసి రోడ్లు, మురుగు కాల్వలు వంటి మౌలిక వసతులు కూడా మెరుగుపడలేదు. మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లో గిరిజన గ్రామాలకు తాగునీరు, రహదారి సదుపాయం లేదు. తాగునీటి కోసం ఆదివాసీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నాలుగున్నరేళ్లలో ఎమ్మెల్యే ఈ సమస్యలపై కనీసం శ్రద్ధ తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత రెడ్డి శాంతి వైఖరిలో చాలా మార్పు వచ్చిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులతో సహా కార్యకర్తలు, ప్రజలను కూడా దూరం పెడుతున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియెజకవర్గంలోని ఐదు మండలాలు ఉండగా.. ఇందులో మూడు మండలాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాలకు స్థానిక ఎంపిపి, జెట్పిటిసి సభ్యులే నాయకత్వం వహిస్తుండటం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యేకి మరోసారి టిక్కెట్ ఇస్తే.. తాము సహకరించమని తెగేసి చెప్పేస్తున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో 38 జెడ్పిటిసి స్థానాలను వైసీపీ గెలుచుకున్నా.. నియోజకవర్గం పరిధిలోని హిరమండలం స్థానంలో ఓడిపోయింది వైసీపీ.. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యే కుమారుడు స్వయంగా పోటీ చేసినా ఓటమే ఎదురైంది. ఎమ్మెల్యే వ్యతిరేక గ్రూపే ఓడించిందనే ప్రచారం కూడా ఉంది.

Also Read: టెక్కలిలో అచ్చెన్నాయుడు దూకుడుకు చెక్ పెడతారా.. అధికార పార్టీ నేతలంతా ఒక్కటవుతారా?

అంతేకాదు ఎమ్మెల్యే పీఏలపై తీవ్రస్థాయి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లాలన్నా.. పీఏలకు ఎంతోకొంత ముట్టజెప్పాల్సివస్తోందని ఆరోపణలు ఉన్నాయి. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేకు నిరసన సెగ తగులు తున్నా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని కొత్తూరు ఎంపీపీ తులసి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్ (Srikanth Mamidi), డిసిసిబి మాజీ చైర్మెన్ డోల జగన్ (Dola Jagan) వైసీపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. పారిశ్రామిక వేత్త సిరిపురపు తేజేశ్వరరావు సైతం లోకల్ సెంటిమెంట్‌తో టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ దక్కుతుందని ధీమాగా ఉన్నారు ఎమ్మెల్యే శాంతి. సీఎం జగన్ అండతో అభివృద్ధి చేస్తున్నానని.. వంశధార నిర్వాసితులకు ఇచ్చిన హామీ ప్రకారం ప్యాకేజి అందజేశామని చెబుతున్నారు ఎమ్మెల్యే.

Kalamata Venkataramana Murthy

అధికార వైసీపీలో రాజకీయం ఇలా ఉండగా.. ప్రతిపక్షం టీడీపీలో కూడా గ్రూప్ వార్ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు పోటీగా.. యువ నేత మామిడి గోవిందరావు (Mamidi Govinda Rao) టీడీపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ఇన్‌చార్జిగా మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వ్యవహరిస్తున్నారు. తొలి నుంచి టీడీపీలో ఉన్న కలమట 2014 ఎన్నికల సమయంలో వైసీపీలోకి వెళ్లి.. మళ్లీ సొంతగూటికి రావడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లు కలమటకు చాన్స్ ఇచ్చారని.. ఇప్పుడు తనకో అవకాశం ఇవ్వాలని యువనేత మామిడి గోవిందరావు కోరుతున్నారు.

Mamidi Govinda Rao

నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న గోవిందరావు.. సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నలబై శాతం యువతకే అవకాశాలు ఇస్తామని అధినేత చంద్రబాబు ప్రకటించారని.. ఆ కోటాలో తనకు ఖచ్చితంగా సీటు వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు గోవిందరావు. కానీ, సీనియర్ నేతగా టిక్కెట్ తనకే దక్కుతుందని ధీమాగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కలమట.. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. తాను ఎమ్మెల్యేగా ఉండగానే.. వంశధార కరకట్టల నిర్మాణం కోసం 650 కోట్లు విడుదల చేయిస్తే.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ నిధులను రద్దు చేసిందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే అవినీతి పెరిగిపోయిందని.. ప్రజలు అంతా గమనిస్తున్నారని చెబుతున్నారు కలమట.

Also Read: ఆమదాలవలసలో మామ మరోసారి జెండా ఎగరేస్తారా.. అల్లుడు చక్రం తిప్పుతాడా?

Gedela Chaitanya

నియోజకవర్గంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ కనిపిస్తోంది. రెండు పార్టీల్లోనూ గ్రూప్ వార్ జరుగుతుండటంతో టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది చివరి వరకు సస్పెన్స్‌గా మారనుంది. ఇక జనసేన తరఫున యువనేత గేదెల చైతన్య (Gedela Chaitanya) నియోజకవర్గంలో టిక్కెట్ ఆశిస్తున్నారు. టీడీపీ పొత్తు కుదిరాకే ఈ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనేది తేలనుంది. ప్రస్తుతానికి అయితే చైతన్య స్థానిక నినాదంతో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మూడు పార్టీల బలాబలాలను పరిశీలిస్తే పోటీ మాత్రం రసవత్తరంగా జరిగేలా కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఓటమి చవిచూసిన టీడీపీ ఈ సారి గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీలో గ్రూప్ వార్‌కు ఫుల్‌స్టాప్ పెట్టకపోతే పాతపట్నంలో టీడీపీని అడ్డుకోలేమని వైసీపీ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొత్తానికి రెండు పార్టీల్లోనూ అసమ్మతి కుంపట్లు రాజుకుంటూనే ఉన్నాయి. ఎన్నికల సమయానికి ఎవరు తగ్గుతారో.. ఎవరు నెగ్గుతారో.. అసమ్మతి నేతలు.. కార్యకర్తలే తేల్చనున్నారు.

ట్రెండింగ్ వార్తలు