Fever Season : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చుట్టుముడతాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, వివిధ రకాల జ్వరాలు లాంటివి వస్తుంటాయి. వర్షాల వల్ల బ్యాక్టీరియాలు అభివృద్ధి చెందుతుంది. తేమ, చల్లని వాతావరణం బ్యాక్టీరియా, వైరస్లకు నిలయంగా మారుతుంది. వర్షపు నీరు నిల్వతో ఎన్నో రకాల దోమలు, క్రిములు తయారవుతుంటాయి. దోమల కారణంగా ఈ సీజన్ లో ఎక్కువగా వ్యాధులు వస్తాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటివి దోమలకారణంగానే వస్తాయి.
వైరల్ ఫీవర్ ; వర్షకాలంలో ఎక్కువ మంది సాధారణంగా వచ్చే వైరల్ ఫీవర్లు అధికమనే చెప్పాలి. జ్వరానికి సంబందించిన లక్షణాలను బట్టి అది ఏరకానికి చెందినదని గుర్తించవచ్చు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు వైరల్ ఫీవర్లో కనిపిస్తుంటాయి. సాధారణ చికిత్సతో వైరల్ ఫీవర్ల నుండి బయటపడవచ్చు.
టైఫాయిడ్ జ్వరం.. కలుషితమైన నీరు, కలుషిత ఆహారం ద్వారా వచ్చే జ్వరం. కడుపులో వికారం, వాంతులు, నీళ్ల విరేచనాలు కనిపిస్తుంటాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇది సంభవిస్తుంది. శరీరంలోని వివిధ అవయవాలకు వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం చికిత్స వెంటనే తీసుకోవాలి. బయటి ఆహారాన్ని అస్సలు తీసుకోకూడదు. ఇంట్లో కూడా ఈసీజన్ లో వండిన వెంటనే తీసుకోవడం మంచిది.
చికెన్ గున్యా; ఇది కూడా దోమ కుట్టడం ద్వారానే సంభవిస్తుంది. జ్వరం రోజు మొత్తం ఉండదు. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది. ఒళ్లునొప్పులు కూడా ఉంటాయి. దోమలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి.
మలేరియా; ఇది ఆడ ఎనాఫిలస్ దోమ ద్వారా వ్యాపిస్తుంది. మనిషి రక్తంలో పరాన్న జీవులు చేరినప్పుడు మలేరియా సోకుతుంది. ఈ జ్వరంలో చలి, వణుకు ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు తలనొప్పి కూడా కనిపిస్తుంటుంది. సరైన చికిత్స తీసుకోకపోతే మలేరియా కూడా ప్రాణాంతకమే అవుతుంది. ఎక్కువగా ఏజెన్సీ ఏరియాల్లో మలేరియా మరణాలు నమోదు అవుతుంటాయి. మలేరియా మూలంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది, మెదడు దెబ్బతినడం, శరీరంలోని అవయవాలు వైఫల్యానికి దారి తీసే పరిస్ధితి ఉంటుంది.
డెంగ్యూ జ్వరం; ఈ జ్వరం దోమ కుట్టదం ద్వారా వస్తుంది. 102 డిగ్రీలకు పైగా జ్వరం నమోదు అవుతుంది. తీవ్రమైన కీళ్లనొప్పులు, ఛాతి వెనుక భాగంలో నొప్పి, తల తిరగడం, మూర్చ, వణుకు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో నీటి శాతం కూడా తగ్గిపోతుంటుంది. రక్త కణాలు పడిపోతాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
వర్షాలు పడుతున్న సమయంలో వర్షానికి తడవడం,బయట ఫుడ్ తీసుకోవటం వంటివి చేయరాదు. అదేవిధంగా వర్షపు నీరు ఇంట్లో నిలువలేకుండా చూస్తే దోమలు వంటి వాటికి అస్కారంలేకుండా చూసుకోవచ్చు. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో మనం తాగే నీరు కాచి చల్లార్చిన తరువాత తీసుకోవాలి. మాంసాహార ప్రియులు వర్షకాలంలో దాని జోలికి వెళ్ళకుండా ఉండటమే మంచిది. తగిన జాగ్రత్తలు పాటిస్తే వర్షకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.