Imran Khan : ‘పాకిస్థాన్ ముక్కలు కావడం ఖాయం..’ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు..

పాక్‌ ముక్కలు కావడం ఖాయం అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు దాయాది దేశ రాజకీయంలో సెగలు రేపుతున్నాయ్. దీని వెనక భారత్ కుట్ర ఉందని విషయం కక్కే ప్రయత్నం చేశారు ఇమ్రాన్‌.

Imran Khan  Pakistan  Divided Into Three Parts : ఆకాశం తాకుతోన్న నిత్యావసర ధరలు.. ఆకాశం పెక్కటిల్లేలా వినిపిస్తున్న వేర్పాటు నినాదాలు.. ఇదీ పాకిస్తాన్ పరిస్థితి ! ఎప్పుడేం జరుగుతుందో తెలియక.. ఏం చేయాలో అర్థం కాక.. అధికార పార్టీ నేతలే వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాక్‌ ముక్కలు కావడం ఖాయం అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు దాయాది దేశ రాజకీయంలో సెగలు రేపుతున్నాయ్. దీని వెనక భారత్ కుట్ర ఉందని విషయం కక్కే ప్రయత్నం చేశారు ఇమ్రాన్‌.

దాయాది దేశమైన పాకిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు అధ్వాన్నంగా మారుతున్నాయ్. ఆదాయం లేదు… అప్పు ఇచ్చే వాళ్లు లేరు. దీంతో శ్రీలంక పరిస్థితి దాదాపు దగ్గర్లో కనిపిస్తోంది. రోజురోజుకు పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అప్పులు కావాలంటూ.. ప్రపంచ దేశాల ముందు చేయిచాచేలా చేస్తోంది. ఇక అదే సమయంలో ఆ దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు.. మరింత ఆసక్తి రేపుతున్నాయ్. ఇక అటు మాజీ ప్రధాని ఇమ్రాన్‌ వ్యాఖ్యలతో.. పాకిస్తాన్‌ మూడు లేదా నాలుగు దేశాలుగా విడిపోతుందా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా జరగుతోంది.

పాకిస్తాన్‌ మూడు లేదా నాలుగు ముక్కలు కాబోతోందని.. పైగా అణ్వాయుధం లేని దేశంగా మిగిలిపోతుందన్న వ్యాఖ్యలతో జనాలను రెచ్చగొట్టేందుకు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడితో ఆగారా అంటే.. సెంటిమెంట్‌ కోసం భారత్‌ మీద విషం కక్కుతున్నారు. పాకిస్తాన్‌ నుంచి బలూచిస్తాన్‌ను వేరు చేసేందుకు ఇండియా కుట్రలు చేస్తుంటూ ఆరోపిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా బలూచిస్తాన్‌ వాసులు ప్రత్యేక గుర్తింపు కోసం పోరాటం చేస్తున్నారు. ఈ మధ్య అక్కడ మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. ప్రస్తుతం బలూచిస్తాన్ ప్రాంతంలో కర్ఫ్యూ విధించిన పరిస్థితి. ఇలాంటి సమయంలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు పాక్ రాజకీయంలో రచ్చ రేపుతున్నాయ్.

పాకిస్తాన్‌లో ఇప్పటికే ప్రత్యేక బలూచిస్తాన్ పేరుతో పోరాటం నడుస్తోంది. నిజానికి ఆ ప్రాంత… మన కశ్మీర్‌లాంటి సమస్యనే ఎదుర్కొంటోంది. బలూచ్ జనాలకు తెలియకుండా వారి మద్దతైనా తీసుకోకుండా… ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో కలిపేసుకున్నారు. స్వాతంత్ర్యం తర్వాత భారత్‌, పాక్ విడిపోయాయ్. మిగిలిన సంస్థానాలు ఎవరికి నచ్చిన దేశంలో వారు చేరిపోవచ్చని బ్రిటిష్ పాలకులు కొత్త సమస్యకు తెరతీశారు. మొదట్లో మన దగ్గర కశ్మీర్‌ ఎందులోనూ చేరనట్లే.. బలూచిస్తాన్ కూడా పాక్‌లో చేరడానికి ఇష్టపడలేదు. ఐతే ఆనాటి బలూచిస్తాన్ సంస్థానాధీశులతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా… పాక్ పాలకులు ఆ ప్రాంతాన్ని తమ భూభాగంలో కలుపుకున్నారు. దీంతో అప్పుడే అక్కడ వేర్పాటు బీజాలు నాటుకున్నాయ్. బలూచ్ ప్రాంతానికి సముద్రతీరంతో పాటు అత్యంత విలువైన భూగర్భ సంపద ఉంది. దానిపై కన్నేసిన పాక్ పాలకులు బలూచ్ వేర్పాటువాదాన్ని అణచివేస్తూ వస్తున్నారు. వారి స్వతంత్ర పోరాటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

బలూచిస్తాన్‌తో పాటు.. ఖైబర్‌ పక్తుంవా, సింధ్‌ ప్రాంతాల్లోనూ ఉద్రిక్త పరిస్తితులు కనిపిస్తున్నాయ్. అక్కడ కూడా వేర్పాటువాద ఉద్యమాలు ఊపందుకుంటున్నాయ్. ప్రస్తుతం ఆ రెండు ప్రాంతాల్లో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ఖైబర్‌ పక్తుంవా ప్రాంతం అఫ్ఘానిస్తాన్‌తో సరిహద్దు పంచుకుంటుంటే.. ఇరాన్‌ బోర్డర్‌లో బలూచిస్తాన్ ఉంటుంది. సింధు, పంజాబ్‌ ప్రాంతాలు ఇండియాతో సరిహద్దు పంచుకుంటున్నాయ్. దేశంలో బలహీనమైన ప్రభుత్వం ఉందని.. దీన్ని ఆసరాగా చేసుకొని, మూడు ప్రాంతాల్లో అశాంతిని రాజేసి.. పాకిస్తాన్‌ను మూడు ముక్కలు చేయాలని భారత్‌ వ్యూహాలు రచిస్తోందని ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలు చేస్తున్నారు. తన స్వార్థం కోసం జనాల్లో అశాంతి రేపడమే కాదు.. మైలేజ్‌ కోసం భారత్‌ మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ దిగజారుతున్నాడు ఇమ్రాన్.

రాజకీయం ఇలా రసవత్తరంగా మారుతుంటే.. ద్రవ్యోల్బణం కారణంగా పాక్‌లో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయ్. లీటర్ పామాయిల్ ధరను పాక్ సర్కార్‌ 213 రూపాయలు పెంచింది. దీంతో లీటర్‌ పామాయిల్ ధర 6వందలు దాటితే.. కిలో నెయ్యి 208 రూపాయలు పెంచడంతో.. 580 రూపాయలు దాటింది. ఇప్పటికే గ్యాస్ ధరలు, గోధుమ పిండి ధరలు ఆకాశానికి తాకాయ్. ఇక ఒకే రోజు లీటర్ పెట్రోల్‌పై 30 రూపాయలకు పైగా పెంచారు. దీంతో అంటించకుండానే మంట పుట్టిస్తోంది పెట్రోల్. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న పాకిస్థాన్… దివాలా ముప్పు నుంచి తప్పించుకోవడం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి, మిత్ర దేశాల సాయం కోరుతోంది. ఇలా అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా.. పాకిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్.

 

 

ట్రెండింగ్ వార్తలు