Shimla Building : భారీవర్షాల దెబ్బకు.. చూస్తుండగానే కుప్పకూలిన భారీ భవనం.. వీడియో!

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో శనివారం మధ్యాహ్నం నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.

Shimla Building : హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో శనివారం (జూలై 9) మధ్యాహ్నం నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. చోపాల్ మార్కెట్‌లో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఈ భారీ భవనం కుప్పకూలింది. అయితే, భవనం కూలిపోకముందే ఖాళీ చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. UCO బ్యాంక్ శాఖ కూడా అదే భవనంలో ఉంది. ఒక దాబా, ఒక బార్, కొన్ని ఇతర వ్యాపార సంస్థలు కూలిన భవనంలో ఉన్నాయి.

రెండో శనివారం కావడంతో భవనంలో ఎవరూ లేరని, బ్యాంకుకు సెలవు ఉండటంతో ఘటన జరిగిన సమయంలో బ్యాంకులో పనిచేస్తున్న ఏడుగురు ఉద్యోగుల్లో ఎవరూ లేరని చీఫ్ మేనేజర్ రమేష్ దద్వాల్ తెలిపారు. సిమ్లాలోని UCO బ్యాంక్ జోనల్ బ్రాంచ్ ఉంది. అక్కడ పోస్ట్ చేసిన ఒక ఉద్యోగి అందించిన సమాచారం ప్రకారం.. గ్రౌండ్ ఫ్లోర్‌లోని బార్‌లో కూర్చున్న కొంతమంది కిటికీ అద్దాలు అకస్మాత్తుగా పగుళ్లు రావడం గమనించారు. అయితే ఏదో ప్రమాదాన్ని గ్రహించిన వారు వెంటనే భవనం నుంచి బయటకు పరుగులు తీశారని చెప్పారు. బార్, దాబాలో కూర్చున్న ఇతర వ్యక్తులను అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు. నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్ని జలమయమవుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని కులు జిల్లాలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ఏడుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మలానా పవర్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న 25 మందికి పైగా ఉద్యోగులను వరదల నుంచి రక్షించినట్లు అధికారులు వెల్లడించారు.

మణికరణ్ జిల్లాలో భారీ వ‌ర్షం కార‌ణంగా సంభవించిన ఆకస్మిక వరదలలో నలుగురు కొట్టుకుపోయారు. పార్వతి నదిపై వంతెన దెబ్బతిన్నది. భారీ వర్షాలతో కులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులు నీట మునిగిపోయార‌ని అధికారులు తెలిపారు. భారీగా వ‌ర‌ద నీరు వస్తుండటంతో లార్జీ, పండోహ్ డ్యామ్‌ల గేట్లు తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపడుతున్నారు.

Read Also : Rain Warning : తెలంగాణ జిల్లాలకు రెయిన్‌ వార్నింగ్‌..భారీ నుంచి అతి భారీ వర్షాలు

ట్రెండింగ్ వార్తలు