North Election Campaign : అందరి చూపు అటువైపే.. అన్నీ ఉత్తర భారత్‌లోని స్థానాలకే ఎన్నికలు!

మిగిలిన స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 20న ఐదో విడత, 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

Loksabha Election Campaign In North India _ From June 1 Seventh Phase Elections

North Election Campaign : నాలుగు విడతల్లో 23 రాష్ట్రాల్లో 379 స్థానాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. మిగిలిన స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 20న ఐదో విడత, 25న ఆరో విడత, జూన్ 1న ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఇవన్నీ ఉత్తర భారత్‌లోని స్థానాలే. మూడు విడతల ఎన్నికల్లో ప్రతిష్టాత్మక స్థానాలుండడంతో నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 20న ఐదోవిడత ఎన్నికలు జరగనున్నాయి. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. యూపీలో 14 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటిలో కాంగ్రెస్‌ కీలకంగా భావించే రాయబరేలి, అమేథి ఉన్నాయి. రాయబరేలిలో రాహుల్ గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చివరి జాబితాలో రాహుల్ ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.

ఎక్కువ సీట్లే లక్ష్యంగా బీజేపీ ప్రచారం :
అమేథి నుంచి గాంధీ కుటుంబం నమ్మిన బంటు కిశోరీలాల్ శర్మ బరిలో ఉన్నారు. రాహుల్, కేఎల్ శర్మ గెలుపుతో యూపీలో తిరిగి పూర్వవైభవం పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం కాంగ్రెస్‌కు కీలకమైన ఈ రెండు స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేసేందుకు సకలశక్తులనూ మోహరిస్తోంది. హిందూ-ముస్లిం రాజకీయ ప్రభావం అధికంగా ఉంటుందని భావించే ఉత్తరప్రదేశ్‌లో గత ఎన్నికల్లోలానే వీలయినన్ని ఎక్కువ సీట్లు పొందాలన్నది బీజేపీ ఉద్దేశం. అందుకే యూపీ ప్రచారంలో ప్రధాని ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమయింది. వారణాసిలో నామినేషన్ సమయంలోనూ ఈ అంశంపైనే ప్రధాని ఎక్కువగా దృష్టిపెట్టారు. ఆరో విడత లోక్‌సభ ఎన్నికలు ఈ నెల 25న 57 స్థానాలకు జరుగుతాయి. ఏడు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న ఏడోవిడతలో ఎన్నికలు జరుగుతాయి.

గత రెండు లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే.. ఈ సారి మతం చుట్టూ ఎన్నికల ప్రచారం ఎక్కువగా సాగుతోంది. హిందూ-ముస్లిం రాజకీయంపై ప్రధాని ఆరోపణలు, కాంగ్రెస్, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు ఇస్తున్న కౌంటర్లు ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలపై కాకుండా CAA, అయోధ్య రామమందిరం, మత పరమైన రిజర్వేషన్లు, మతప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపు వంటివి ప్రచారాస్త్రాలుగా మారడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలకాకముందే బీజేపీ గెలుపుపై ధీమాగా ఉంది. వరుసగా మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని చెబుతున్న ప్రధాని..మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే చేయాల్సిన పనులపై వందరోజుల బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు. కూటమిగా 400, సొంతంగా 370 గెలవాలన్నది లక్ష్యంగా బీజేపీ ప్రకటించుకుంది. మరోవైపు కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థాయిలో బీజేపీకి సీట్లు రావని ప్రచారం చేస్తున్నారు. ఎండలతో పాటు ఇతర ఏ కారణాలు ప్రభావం చూపాయో తెలియదు కానీ..మొదటి, రెండు, మూడు విడతల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదయింది. నాలుగో విడతలో మాత్రం పరిస్థితి మెరుగుపడింది. ఐదు, ఆరు, ఏడు విడతల్లో వీలయినంత ఎక్కువమంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చేలా చేసేందుకు నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.

ఎన్నికల హామీలతో కాంగ్రెస్ ప్రచారం :
ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే.. ప్రతి మహిళ ఎకౌంట్లో నెలకు 8వేల 500 జమచేస్తామని ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. ఇది మహిళా సాధికారికతకు దారితీస్తుందని అంటున్నారు. మరోవైపు NDA తరఫున ప్రధాని అభ్యర్థిగా మూడోసారి మోదీనే ఉండగా.. అరవింద్ కేజ్రీవాల్‌ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. NDA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే మోదీ ప్రధానిగా ఎక్కువకాలం ఉండరని, అమిత్ షాను ప్రధానిని చేస్తారని, బీజేపీ రాజకీయాల నుంచి యోగీ ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు కొందరు కీలక నేతలు కనుమరుగవుతారని ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమిలో మొదట కొనసాగి.. తర్వాత ఒంటరిగా పోటీకి దిగిన మమతాబెనర్జీ..ఎన్నికల్లో కూటమి గెలిస్తే బయటినుంచి మద్దతిస్తామంటున్నారు.

అసలు ప్రధాని అభ్యర్థి అన్నదే ప్రశ్న:
400 స్థానాల గురించి బీజేపీ మాట్లాడుతోందని.. అసలు బీజేపీ సొంతంగా 200 స్థానాలు గెలిచే పరిస్థితి కూడా లేదని ఎన్నికల ప్రచారాల్లో రాహుల్ పదే పదే చెబుతున్నారు. ఈ సంగతి పక్కనపెడితే.. ఒకవేళ ఇండియా కూటమి ఎక్కువ సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్థితే వస్తే.. అసలు ప్రధాని అభ్యర్థి అన్నది ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే బీజేపీ నేతృత్వంలోని NDA కూటమితో ఇండియా కూటమి ఢీకొట్టడంపై కాషాయదళంతో పాటు మిత్రపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే 2014, 2019లో ఘోర ఓటమి పాలయిన కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడిందా..మరింత దిగజారిందా అన్నది ఫలితాల తర్వాత తేలనుంది.

Read Also : సై అంటే సై.. ఉత్తర భారతంలో తారస్థాయికి ఎన్నికల ప్రచారం, ప్రధాన ప్రచార అస్త్రాలివే..

ట్రెండింగ్ వార్తలు