దేశవ్యాప్తంగా స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా కేంద్రాల నుంచి ఇక వీధి కుక్కలను తీసుకెళ్లాలి.. అంతేకాదు..: సుప్రీంకోర్టు ఆదేశాలు
ఆయా ప్రాంగణాల్లో ఉన్న అన్ని కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేయించి, వ్యాక్సిన్ వేయించాలని కూడా చెప్పింది.
Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, క్రీడా సముదాయాలు, బస్ డిపోలు, రైల్వే స్టేషన్ల నుంచి వీధి కుక్కలను తీసుకెళ్లాలని చెప్పింది.
ఆయా ప్రాంగణాల్లో ఉన్న అన్ని కుక్కలను పట్టుకుని శస్త్రచికిత్స చేయించి, వ్యాక్సిన్ వేయించాలని చెప్పింది. శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెట్టరాదని స్పష్టం చేసింది. ఎందుకంటే, శస్త్రచికిత్స తర్వాత వాటిని అదే ప్రదేశాల్లో విడిచిపెడితే సుప్రీంకోర్టు ఇస్తున్న ఆదేశాల ఉద్దేశం వ్యర్థమవుతుందని చెప్పింది.
వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజా భద్రతకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియాతో కూడిన బెంచ్ వీధి కుక్కల కాట్ల కేసులపై విచారణ జరుపుతూ ఈ ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల కేసులో పూర్తి తీర్పు త్వరలోనే వెలువడనుంది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రెండు వారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, వైద్య సంస్థలు, ప్రజా రవాణా కేంద్రాలు, క్రీడా మైదానాలను గుర్తించాలని, 8 వారాల్లో వాటిని ఫెన్సింగ్‌లతో కాపాడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతి ప్రాంగణానికి పర్యవేక్షణ బాధ్యత కలిగిన అధికారి ఉండాలని, స్థానిక మున్సిపల్ సంస్థలు, పంచాయతీలు మూడు నెలలపాటు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని తెలిపింది.
Also Read: ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు.. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన
అలాగే, భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) సహా ఇతర రహదారి సంస్థలు రోడ్లపై ఉండే ఇతర పశువులను తీసుకెళ్లి షెల్టర్లలో ఉంచాలని కోర్టు మరోసారి ఆదేశించింది.
బెంచ్‌కు సాయం చేస్తున్న అమికస్ క్యూరీ గౌరవ్ అగర్వాల్ సూచనలు తీర్పులో చేర్చనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఇటీవలి విచారణల్లో సుప్రీంకోర్టు జంతు జనన నియంత్రణ నిబంధనలు (ఏబీసీ నియమాలు 2023) అమలులో నిర్లక్ష్యాన్ని విమర్శించింది.
ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాలు, సంస్థల్లో వీధి కుక్కలకు ఆహారం పెడుతున్నారని నివేదికలు రావడంతో నవంబర్ 3న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తాము కొత్త ఆదేశాలు ఇవ్వబోతున్నామని బెంచ్ పేర్కొంది.
ఆ విచారణకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఢిల్లీ మున్సిపల్ సంస్థ మాత్రమే నివేదికలు సమర్పించాయి.
పిల్లలపై కుక్కల దాడుల పెరుగుదల నేపథ్యంలో ఈ కేసులో సుప్రీంకోర్టు జూలై నుంచి విచారణ చేపట్టింది. అక్టోబర్ 31న కొన్ని రాష్ట్రాలు తమ ప్రధాన కార్యదర్శుల హాజరు మినహాయింపును కోరగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆగస్టులో రాష్ట్రాలకు మూడు నెలల గడువు ఇచ్చినా నివేదికలు సమర్పించకపోవడంతో కోర్టు ఈ సారి కఠిన వైఖరి తీసుకుంది.
మానవతా దృక్పథం, ప్రజా భద్రత మధ్య సమతుల్యత అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇటీవలి ఘటనల దృష్ట్యా ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో కఠిన నియంత్రణ అవసరమని స్పష్టం చేసింది. కంప్లయెన్స్ నివేదికలు (కోర్టు ఆదేశాలు ఎలా అమలయ్యాయో తెలిపే అధికారిక నివేదిక) సమర్పించిన తర్వాత కేసు మళ్లీ విచారణకు రానుంది.
