Rajamouli : రాజమౌళి నిజంగానే కోట్లు ఖర్చు చేస్తున్నాడా? ఆస్కార్ కోసమా? ఆస్కార్ ప్రమోషన్స్ కోసమా? ఇదిగోండి క్లారిటీ..

ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా పేరుప్రఖ్యాతలు,కలెక్షన్స్ సాధించడమే కాక అవార్డులు కూడా సాధిస్తుంది. ఏకంగా ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నిలిచి ఇండియా నుంచి నిలిచిన మొదటి పాటగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్కార్ లో నాటు నాటు నిలవడంతో..............

Rajamouli :  ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా పేరుప్రఖ్యాతలు,కలెక్షన్స్ సాధించడమే కాక అవార్డులు కూడా సాధిస్తుంది. ఏకంగా ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నిలిచి ఇండియా నుంచి నిలిచిన మొదటి పాటగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్కార్ లో నాటు నాటు నిలవడంతో RRR మరింత పాపులర్ అయింది విదేశాల్లో. గత కొన్ని రోజులుగా RRR యూనిట్ అమెరికాలోనే ఉంటూ సినిమాని మరింత ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నారు. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్, సెంథిల్ కుమార్, మరికొంతమంది చిత్రయూనిట్ అమెరికాలోనే ఉండి ఆస్కార్ అయ్యేవరకు సందడి చేయనున్నారు. అక్కడి మీడియాకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ RRR సినిమా గురించి, నాటు నాటు సాంగ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేస్తున్నారు.

RRR సినిమాపై అందరూ అభినందిస్తుంటే కొంతమంది మాత్రం సినిమా ప్రమోషన్స్ కి కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆస్కార్ కోసం డబ్బులు వెదజల్లుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి అంటే గిట్టని వాళ్ళు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా RRR ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చు చేసాడు అంటూ కామెంట్స్ చేయడంతో ఇది కాస్తా వివాదంలా మారింది. మన తెలుగు సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంటే ఇలా మాట్లాడతావా అంటూ పలువురు నెటిజన్లు ప్రముఖులు తమ్మారెడ్డిని విమర్శిస్తున్నారు. అయితే నిజంగానే రాజమౌళి అంతలా RRR ఆస్కార్ కోసం లేదా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఖర్చుపెడుతున్నాడా అని పలువురి మదిలో ప్రశ్నగా మారింది.

బాహుబలి సినిమాతో తెలుగు సినిమాని పాన్ ఇండియా సినిమా చేశాడు రాజమౌళి. ఇప్పుడు RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా RRR సినిమాని రాజమౌళి ముందుండి అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేస్తున్నారు. బాహుబలి సినిమా సమయంలో కొన్ని దేశాల నుంచి మంచి స్పందన వచ్చినా అక్కడకు వెళ్లి మరీ అంతగా ప్రమోట్ చేయలేదు. కానీ RRR విషయంలో అన్ని దేశాలకు వెళ్లి మరీ ప్రమోట్ చేస్తున్నారు. RRR సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుండటం, హాలీవుడ్ నుంచి ప్రశంసలు వస్తుండటంతో రాజమౌళి ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది అని గుర్తించారు. దీంతో సినిమా రిలీజయిన సమయంలో కేవలం ఇండియా అంతా ప్రమోట్ చేసి వదిలేసిన రాజమౌళి ఆ తర్వాత మళ్ళీ విదేశాల్లో కూడా ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యాక హాలీవుడ్ టెక్నీషియన్స్ నుంచి అభినందనలు రావడంతో హాలీవుడ్ లో కూడా తన ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఆరు నెలలు అమెరికాలోనే ఉంటూ రాజమౌళి తమ సినిమాని ప్రమోట్ చేశాడు.

ఇక్కడ ఇండియాలోనే RRR సినిమా రిలీజ్ ప్రమోషన్స్ కి 20 కోట్లు ఖర్చు చేసిన రాజమౌళి, మరి అమెరికాలో అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది కదా. అందుకు తగ్గట్టే హాలీవుడ్ లో RRR ప్రమోషన్స్ కి కోట్లు ఖర్చు చేయడం మొదలుపెట్టారు. RRR సినిమాకు, నాటు నాటు సాంగ్ కి అవార్డులు వస్తుండటం, హాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు, టెక్నీషియన్స్ నుంచి అభినందనలు వస్తుండటంతో దీన్ని ఇంకా ఎక్కడికో తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు రాజమౌళి. దీంతో సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికాలోనే ఉంటూ ఖర్చు పెట్టాడు. నిర్మాత DVV దానయ్య సినిమా రిలీజ్ అయిన తర్వాత పక్కకు తప్పుకున్నాడని, అందుకే హాలీవుడ్ ప్రమోషన్స్ లో ఎక్కడా దానయ్య కనపడలేదని, అందుకే రాజమౌళి తన డబ్బులతో ఖర్చు పెడుతున్నాడని టాలీవుడ్ లో టాక్ కూడా నడిచింది. అయితే కొన్ని ప్రమోషన్స్ లో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కనపడ్డారు. ఒకప్పుడు రాజమౌళిని నమ్మి బాహుబలి కోసం మొట్టమొదటి సారి తెలుగు సినిమాకి 200 కోట్లు పెట్టిన శోభు ఇప్పుడు మరోసారి రాజమౌళిని నమ్మి ఆస్కార్ వచ్చేంతవరకు ఈ ప్రమోషన్స్ మీద కూడా ఖర్చు చేయడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తుంది.

డబ్బులిస్తే ఆస్కార్ అవార్డు మాత్రం ఇవ్వరు. లోకల్ గా మనకి తెలిసిన వాళ్ళతో ఇప్పించుకునే అవార్డులు కాదు ఆస్కార్. ప్రపంచం అంతా ఈ అవార్డుల కోసం పోటీ పడుతుంది. అసలు ఎంట్రీ అయితే చాలు, నామినేట్ అయితే చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆస్కార్ కి ది అకాడమీ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థలో పలువురు సభ్యులు ఉంటారు. కనీసం ఎంట్రీకి వెళ్లాలన్నా, నామినేట్ అవ్వాలన్నా వీరంతా సినిమాలని చూడాలి. వీరికి మన సినిమాలని స్పెషల్ షోలు కూడా వేసి చూపించాలి. రాజమౌళి ఇదంతా ముందుండి చేయడంతో ఆస్కార్ కి పలు విభాగాల్లో నామినేట్ అవుతుందని ఆశపడ్డా ఒక్క బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు సాంగ్ నిలిచింది. దీంతో కూడా ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించారు RRR యూనిట్. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అని ఫిక్స్ అయి రాజమౌళి ఎలాగైనా నాటు నాటుకి ఆస్కార్ రావాలని మరింత ప్రమోషన్స్ చేస్తున్నాడు.

మన దగ్గర చాలామంది సినిమాలు తీస్తారు కానీ, సినిమాలకు అవార్డులు ఎలా ఇస్తారు? ఎందుకు ఇస్తారు? ఎలా అప్లై చేయాలి ఇవేమి తెలీదు. ఈ మాట ప్రముఖ దర్శకుడు VN ఆదిత్య కూడా నేషనల్ అవార్డుల సమయంలో చెప్పాడు. కానీ రాజమౌళి ఇవన్నీ తెలుసుకొని ప్రయాణం మొదలుపెట్టాడు. మలయాళంలో And the Oscar Goes To… అనే ఓ సినిమా ఉంది. టోవినో థామస్ హీరోగా నటించాడు. ఇందులో ఒక డైరెక్టర్ సినిమా తీస్తే దానికి మంచి పేరు వచ్చి నేషనల్ అవార్డు వస్తుంది, అలాగే ఆస్కార్ ఎంట్రీ కూడా దక్కుతుంది. అయితే ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లాలంటే హాలీవుడ్ లో సినిమాని ప్రివ్యూ వేయాలి, పలు షోలు వేయాలి, ఆస్కార్ మెంబర్స్ కి స్పెషల్ షోలు వేయాలి, వారికి లంచ్, డిన్నర్ లాంటివి ఏర్పాటు చేయాలి. వీటన్నిటికీ చాలా డబ్బు కావాల్సి వస్తుంది. అంత డబ్బు హీరో దగ్గర లేకపోవడంతో ప్రమోట్ చేయలేక మధ్యలోనే వెనక్కి తిరిగి వచ్చేస్తాడు.

అంటే కేవలం ప్రమోషన్స్ కి చాలా డబ్బు కావాలి. మన సినిమాకి మనం అవార్డు కొనుక్కోము. కానీ మన సినిమా బాగుంది, మనకి అవార్డు వస్తుంది అని నమ్మితే మన సినిమాని అందరికి రీచ్ అయ్యేలా చేయాలి. ఇప్పుడు అదే రాజమౌళి చేస్తున్నాడు. అందుకే RRR సినిమాని ఆస్కార్ అవార్డుల వేడుకకు 10 రోజుల ముందు మళ్ళీ అమెరికాలో రీ రిలీజ్ కూడా చేశాడు. హాలీవుడ్ ప్రేక్షకులంతా ఎగబడేలా చేశాడు ఈ సినిమాకి. టికెట్ల కోసం లైన్లో నిలబడేలా చేశాడు. అక్కడి మీడియాలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు రాజమౌళి. అమెరికాలోని ప్రఖ్యాత థియేటర్స్ లో స్పెషల్ షోలు వేస్తున్నాడు. అందరిలో బాగా కనిపించాలని డ్రెస్సులు కూడా స్పెషల్ గా డిజైన్ చేయిస్తున్నాడు. రాజమౌళి మాత్రమే కాక ఎన్టీఆర్, చరణ్ ని ముందు పెట్టి మరిన్ని ఇంటర్వ్యూలు ఇప్పిస్తున్నాడు హాలీవుడ్ లో. వీటితో పాటు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. హాలీవుడ్ ప్రేక్షకులే RRR సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాడు. ఇవన్నీ RRR, నాటు నాటు సాంగ్ బాగా ప్రమోట్ అవ్వాలి, ట్రెండ్ అవ్వాలని చేస్తున్నాడు రాజమౌళి. ఎంతలా ట్రెండ్ అవ్వాలంటే ఆస్కార్ టీం ఎవరికి అవార్డు ఇవ్వాలి అని ఆలోచిస్తే అందరికి నాటు నాటు గుర్తొచ్చేలా చేసేంతలా, ఎవరు మాట్లాడినా నాటు నాటు గురించే మాట్లాడేలా ప్రమోషన్స్ చేస్తున్నాడు. అందుకే దీనికోసం కోట్లు ఖర్చు పెడుతున్నాడు. అది 100 కోట్లు అయినా కావొచ్చు కానీ రాజమౌళి వెనుకాడట్లేదు. ఇది రాజమౌళి ఒక్కడే చేయడు, ఆస్కార్ కి నామినేట్ అయిన వాళ్లంతా కూడా ఇలాగే ప్రమోషన్స్ చేస్తారు. కాకపోతే మన రాజమౌళి కాబట్టి, మన తెలుగు సినిమా కాబట్టి, మన మీడియా రోజూ రాజమౌళి చేసే ప్రతి పనిని చూపిస్తుంది కాబట్టి మనకి ఇది చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ 90 శాతం ఆస్కార్ కి నామినేట్ అయిన సినిమాలన్నీ ఇలాగే తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటాయి.

కానీ ఎందుకు ఇంత? వంద కోట్లు ప్రమోషన్స్ కి ఖర్చు చేయాలా? ఒకవేళ ఆస్కార్ రాకపోతే? కేవలం ఒక్క విభాగంలోనే నామినేట్ అయింది , అది మిస్ అయితే? ఇవి కూడా చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్నలు. కానీ రాజమౌళి తక్కువోడు కాదు. RRR రిలీజ్ టైంలో నార్త్ సైడ్ ఈ సినిమాని ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అని ప్రమోట్ చేశాడు. ఎన్టీఆర్, చరణ్ నార్త్ లో ఎవరికీ సరిగ్గా తెలీదు RRR ముందు కానీ బాహుబలి సినిమాతో రాజమౌళి అందరికి తెలుసు. అందుకే ఇక్కడ హీరోల కంటే కూడా సినిమా ఎలివేట్ అవ్వాలని తన పేరు వేసి మార్కెట్ చేసి హిట్ కొట్టి కోట్ల కలెక్షన్స్ సాధించాడు.

Tammareddy Bharadwaja : RRR పై సంచలన కామెంట్స్ చేసిన తమ్మారెడ్డి.. కౌంటర్ ఇచ్చిన రాఘవేంద్రరావు, నాగబాబు..

ఇప్పుడు ఇదే రాజమౌళి చేస్తాడు మళ్ళీ. రాజమౌళి పెట్టె ఖర్చుకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఆస్కార్ వస్తే ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించినవాడవుతాడు. ఆస్కార్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనం అంచనా వేసుకోవచ్చు. ఒకవేళ ఆస్కార్ రాలేదా.. ఇదంతా నెక్స్ట్ సినిమాకు పెట్టుబడి. మనం గమనిస్తే ఇప్పటికే పలుమార్లు రాజమౌళి తన నెక్స్ట్ సినిమా గురించి కూడా హాలీవుడ్ ఇంటర్వ్యూలలో గొప్పగా చెప్పాడు. మహేష్ బాబుతో రాజమౌళి సినిమా అంటే మనం ఇక్కడ తోపు అని అంచనాలు పెట్టుకుంటున్నాం. కానీ రాజమౌళి ప్రపంచ మార్కెట్ మీద కన్నేశాడు. ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ RRR అని మహేష్ సినిమాకి వేస్తాడు. ఇప్పటికే పలు హాలీవుడ్ సంస్థలతో మహేష్ సినిమాకు వర్క్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు అంటే అర్ధం చేసుకోండి ఎంత పెద్ద సినిమా తీయబోతున్నాడో రాజమౌళి. దాని కోసమైనా ఈ ప్రమోషన్స్ అవసరం. రాజమౌళి నెక్స్ట్ సినిమాని ప్రపంచమంతా మార్కెట్ అయ్యేలా ఇప్పట్నుంచే ప్లాన్ చేస్తున్నాడు. వీటికి తోడు మన తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియచేశాడు. గతంలో మన ఇండియన్ సినిమాలు కొన్నిటి గురించి పలు దేశాల్లో మాట్లాడినా ఈ విధంగా ఎప్పుడూ లేదు. అందుకే ఇప్పుడు ఆస్కార్ ప్రమోషన్స్ పై పెట్టుబడి పెట్టి నెక్స్ట్ సినిమాని మరింత గ్రాండ్ గా రిలీజ్ చేస్తాడు రాజమౌళి. అంతే కాక వెళ్లిన ప్రతి చోట తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ ప్రమోషన్ తన నెక్స్ట్ సినిమాకే కాదు, తెలుగు సినిమా ఏదైనా హాలీవుడ్ లో రిలీజవ్వాలంటే రాజమౌళి ఇండస్ట్రీ అని చెప్పుకొని కూడా ప్రమోట్ చేసుకునేలా రాజమౌళి చేస్తున్నాడు.

RRR : ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చుపెట్టారు.. 8 సినిమాలు తీసి వాళ్ళ మొహాన కొడతాను.. RRR యూనిట్ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు..

200 కోట్లు ఇస్తే బాహుబలి లాంటి సినిమా తీసి దేశాన్ని మెప్పించాడు. 400 కోట్లు ఇస్తే RRR తీసి ప్రపంచాన్ని మెప్పించాడు. మరి నెక్స్ట్ సినిమాకు ఇంకెంత భారీ బడ్జెట్, భారీ సినిమా ఆలోచించుకోండి. అప్పుడు ప్రమోషన్స్ కూడా భారీగా ఉంటాయి. ఆ ప్రమోషన్స్ ఈజీ అవ్వాలంటే ఇప్పుడు చేసే ప్రమోషన్స్ ఉపయోగపడాలి. ఇప్పుడు రాజమౌళి చేసే ప్రమోషన్స్ తో రాజమౌళి అంటే అమెరికా, జపాన్, చైనా, కొరియా, ఇంగ్లాండ్.. ఇలా చాలా దేశాల్లో చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు తన పేరుని ఉపయోగించుకొని, ఈ ప్రమోషన్స్ ఇచ్చిన హైప్ ని ఇలాగే మెయింటైన్ చేస్తూ నెక్స్ట్ సినిమాకు కూడా వాడతాడు రాజమౌళి. అందుకే ఇప్పుడు ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టడానికి రెడీ అయి ముందుకెళ్తున్నాడు రాజమౌళి. ఆస్కార్ వస్తే చరిత్ర సృష్టిస్తాడు, రాకపోతే ఇంకో చరిత్ర సృష్టించడానికి ఇది ఒక ఆరంభం మాత్రమే….

ట్రెండింగ్ వార్తలు