Baak Movie Review : ‘బాక్'(అరణ్‌మనై 4) మూవీ రివ్యూ.. వామ్మో.. ఓ రేంజ్‌లో భయపెట్టారుగా..

మంచి హారర్ సినిమా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు బాక్ సినిమా థియేటర్లో చూడాల్సిందే.

Baak Movie Review : తమిళ్ లో సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమాల సిరీస్ అరణ్‌మనై(Aranmanai). కుష్బూ భర్త సుందర్(Sundar) దర్శకత్వంలో ఇప్పటివరకు వచ్చిన అరణ్‌మనై 1, 2, 3 పార్ట్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు అరణ్‌మనై 4 సినిమా వచ్చింది. కుష్బూ నిర్మాణంలో, కుష్బూ(Kushboo) భర్త సుందర్ మెయిన్ లీడ్ చేస్తూ ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన అరణ్‌మనై 4 సినిమా నేడు మే 3న తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయింది. తెలుగులో ఈ సినిమాని ‘బాక్’ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు.

కథ విషయానికొస్తే.. అస్సాంలో కొన్నేళ్ల క్రితం బాక్ అనే ఓ క్షుద్రశక్తి ఆత్మని బంధించి బ్రహ్మపుత్ర నదిలో దాస్తారు. బాక్ ఎవర్నైనా చంపి వాళ్ళ రూపంలోకి మారగలదు. ఓ పూజారి వల్ల అనుకోకుండా ఆ ఆత్మ బయటకి వచ్చి తన కూతుర్ని చంపడంతో ఆ ఆత్మని తన ఆధీనంలో బందీగా ఉంచుకొని ఆంద్రకి వస్తాడు పూజారి. శివ శంకర్(సుందర్) ఓ నిజాయితీ లాయర్. అతనికి చెల్లి శివాని(తమన్నా) అంటే ప్రేమ. కాని శివాని తను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోతుంది. శివశంకర్ తన అత్త(కోవై సరళ)తో కలిసి ఉంటాడు. ఓ పదేళ్ల తర్వాత శివాని సూసైడ్ చేసుకుందని, ఆమె భర్త చనిపోయాడని తెలియడంతో వాళ్ళ ఇంటికి వెళ్తారు.

శివాని కూతురు కోమాలో ఉంటుంది. కొడుకు బతికే ఉంటాడు. అయితే శివానిది సూసైడ్ కాదని శివ శంకర్ నమ్మడం, అక్కడ జరిగిన కొన్ని సంఘటనలతో ఎవరో తన చెల్లిని చంపారని ఆ కోణంలో వెతుకుతూ ఉంటాడు. మరోవైపు చనిపోయిన శివాని ఆత్మ తన పిల్లలకు రక్షణగా ఆ ఇంట్లో ఉంటుంది. మరోవైపు బంధించిన బాక్ ఆత్మ బయటకి వస్తుంది. వరుసగా కొంతమంది చనిపోతూ ఉంటారు. అసలు ఎందుకు చనిపోతున్నారు? శివాని, ఆమె భర్తని చంపింది ఎవరు? ఈ బాక్ కథేంటి? శివాని పిల్లలకు ఉన్న ప్రమాదం ఏంటి? వాళ్ళని శివ శంకర్ ఎలా కాపాడాడు అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ రివ్యూ.. పెళ్లి కావాల్సిన ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా..

సినిమా విశ్లేషణ : తమిళ్ లో గతంలో వచ్చిన అరణ్‌మనై మూడు సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ నాలుగో పార్ట్ బాక్ కూడా హారర్ కామెడీగా ప్రేక్షకులని మెప్పించింది. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అసలు కథలోకి తీసుకెళ్లి భయపెట్టడం మొదలుపెట్టారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ సీరియస్ గా కథని నడిపిస్తూ అక్కడక్కడా భయపెడుతూ మరో పక్క ఫుల్ గా నవ్విస్తారు కూడా. ఇటీవల వచ్చిన హారర్ కామెడీ సినిమాల్లో ఇది కూడా బెస్ట్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఆసక్తిగా సాగుతుంది. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. ఈ సినిమాలో VFX వర్క్ మాత్రం అదిరిపోతుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్ : సుందర్ మెయిన్ లీడ్ లో పర్వాలేదనిపించారు. తమన్నా మాత్రం తల్లి పాత్రలో అదరగొట్టింది. రాశీఖన్నా డాక్టర్ గా ఓకే అనిపిస్తుంది. శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ మాత్రం ఫుల్ గా నవ్విస్తారు. గరుడ రామ్ స్వామిజీ పాత్రలో మెప్పిస్తాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. క్లైమాక్స్ లో సిమ్రాన్, కుష్బూ తిరునాళ్లలో అమ్మవారి పాటకి డాన్స్ వేసి గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు.

సాంకేతిక అంశాలు.. ఈ సినిమా టెక్నికల్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ విజువల్స్ అదిరిపోయాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అసలు గ్రాఫిక్స్ అని ఎక్కడా అనుమానం రాకుండా ప్రతి షాట్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రీ క్లైమాక్స్ నుంచి వచ్చే VFX సీన్స్ అన్ని కూడా బాగుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. చాలా సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే భయపెట్టారు. కథ రెగ్యులర్ గా ఓ ఆత్మని కంట్రోల్ చేసే లాంటి కాన్సెప్ట్ అయినా దానికి తల్లిప్రేమ అంశాన్ని జోడించి కథనం బోర్ కొట్టకుండా బాగా రాసుకున్నారు. మరోసారి దర్శకుడిగా సుందర్ సక్సెస్ అయ్యారు.

మొత్తంగా ‘బాక్'(అరణ్‌మనై 4) సినిమాలో ఓ క్షుద్రశక్తికి, తల్లిప్రేమకి మధ్య జరిగే యుద్దాన్ని హారర్ కామెడీ రూపంలో భయపెట్టి నవ్వించి చెప్పారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు. మంచి హారర్ సినిమా ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు