Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ రివ్యూ.. పెళ్లి కావాల్సిన ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా..

పెళ్లి కావాల్సిన వాళ్లంతా ఈ 'ఆ ఒక్కటి అడక్కు' సినిమా కచ్చితంగా చూడాల్సిందే.

Aa Okkati Adakku : ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ రివ్యూ.. పెళ్లి కావాల్సిన ప్రతిఒక్కరూ చూడాల్సిన సినిమా..

Allari Naresh Faria Abdullah Aa Okkati Adakku Movie Review and Rating

Aa Okkati Adakku Movie Review: ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్(Allari Naresh) ఇప్పుడు మళ్ళీ తన కామెడీ జానర్ లోకి వచ్చి ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా మల్లి అంకం దర్శకత్వంలో చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మాణంలో ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా తెరకెక్కింది. జెమీ లివర్, వెన్నెల కిషోర్, రవి కృష్ణ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా నేడు మే 3న ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది.

కథ విషయానికొస్తే.. గణ(అల్లరి నరేష్) ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఏజ్ పెరిగినా పెళ్లవ్వదు. ఇంట్లో తమ్ముడికి(రవికృష్ణ) ఆల్రెడీ తన మరదలితో(జెమీ లివర్) పెళ్లి అయిపోతుంది. వాళ్లకి ఓ పాప కూడా ఉంటుంది. ఓ సమయంలో అనుకోకుండా గణ వల్ల ఓ యాక్సిడెంట్ జరుగుతుంది. పెళ్లి కాని అబ్బాయిలకి ఉండే ఫ్రస్టేషన్ చుట్టుపక్కల వాళ్ళని మాటలు చూస్తూ ఉంటాడు గణ. ఎన్ని సంబంధాలు ట్రై చేసినా అన్ని వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఈ క్రమంలో ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో మాట్రిమోనీలో జాయిన్ అవుతాడు. హ్యాపీ మ్యాట్రిమోనీ అనే సంస్థలో డబ్బులు కట్టి స్కీమ్స్ ప్రకారం ట్రై చేస్తూ ఉంటాడు.

ఇలా మ్యాట్రిమోనీలో పెద్ద స్కీమ్ తీసుకున్నాక సిద్ధి(ఫరియా అబ్దుల్లా) కలుస్తుంది. అయితే గతంలోనే ఓ సంఘటనలో సిద్ధి అల్లరి నరేష్ కి వచ్చి హగ్, కిస్ ఇస్తుంది. దీంతో అప్పటి నుంచే ఆ అమ్మాయిని గుర్తు పెట్టుకుంటాడు. సిద్ధి కూడా పెళ్లి కోసం చూస్తుందని తెలియడంతో వేరే ఆప్షన్స్ వద్దు, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటాడు. కానీ సిద్ధి మాత్రం నాకు ఇంకా ఆప్షన్లు ఉన్నాయి మిమ్మల్ని వెయిటింగ్ లో పెడతాను అంటుంది. అదే సమయంలో గణ వాళ్ళ అమ్మకి హార్ట్ ఎటాక్ వచ్చి పెళ్లి చూసి చచ్చిపోవాలి అనే సెంటిమెంట్ తో మాట్లాడుతుంది. మరి గణ పెళ్లి అయిందా? సిద్ధి ఓకే చెప్పిందా? హ్యాపీ మ్యాట్రిమోనీ సంస్థ చేసే మోసం ఏంటి? సిద్ది ఇచ్చే ట్విస్ట్ ఏంటి? ఆ యాక్సిడెంట్ ఎవరికి జరిగింది? అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Sabari Movie Review : వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ మూవీ రివ్యూ.. కూతురి కోసం తల్లి పోరాటం..

సినిమా విశ్లేషణ.. ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న అల్లరి నరేష్ ఇటీవల సీరియస్ సినిమాలు చేయడం, ఇప్పుడు మళ్ళీ ఆ ఒక్కటి అడక్కు కామెడీ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రమోషన్స్ లో చెప్పిన కామెడీ సినిమాలో అంతగా కనపడదు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాల్లో కామెడీ మెరుపులు తప్ప సినిమాలో చాలా భాగం సీరియస్ పాయింట్ తోనే వెళ్తుంది. ఏజ్ పెరుగుతున్నా పెళ్లి కాని వాళ్ళ బాధలు, వాళ్ళు ఎదుర్కునే పరిస్థితులు, అలాంటి వాళ్ళ ఆశలతో వ్యాపారం చేసే మ్యాట్రిమోనీ సంస్థల గురించే ఈ సినిమా సాగుతుంది. మ్యాట్రిమోనీ సంస్థలు చేసే మోసాలు, వాటిని ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు, అబ్బాయిలు చేసే మోసాలు, వాటి వల్ల ఎఫెక్ట్ అయ్యే మనుషులు.. ఇవన్నీ సినిమాలో చూపించారు. ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్, సన్నివేశాలు బాగుంటాయి. పెళ్లి కాని వ్యక్తి మీద కామెడీతో చాలా సినిమాలు వచ్చినా మ్యాట్రిమోనీ మోసాలు లైన్ తీసుకొని సరికొత్తగా ప్రజెంట్ చేశారు.

నటీనటుల పర్ఫార్మెన్స్ : ఆల్రెడీ కామెడీలో కింగ్ అయిన అల్లరి నరేష్ ఈ సినిమాలో మరోసారి తన కామెడీతో మెప్పించాడు. జాతిరత్నాలుతో అందర్నీ ఇంప్రెస్ చేసిన ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో అల్లరి నరేష్ పక్కన కరెక్ట్ గా సెట్ అయింది. నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది. బాలీవుడ్ స్టార్ కమెడియన్ జానీ లివర్ కూతురు జెమీ లివర్ ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన యాక్టింగ్ తో నవ్వించింది. వెన్నెల కిషోర్, రవికృష్ణ, రాజా, హరితేజ.. వారి పాత్రల్లో మెప్పించారు. ఇక ఈ సినిమాలో చాలా మంది సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళని అక్కడక్కడా గెస్ట్ అప్పీరెన్స్ గా తీసుకొచ్చారు. రీతూ చౌదరి, అరియనా, హీరోయిన్ సిమ్రాన్ చౌదరి, ఇనాయ సుల్తానా, అక్సా ఖాన్.. ఇలా చాలా మంది అక్కడక్కడా మెరిపించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ బాగావుంది. బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటలు కూడా అంతంత మాత్రమే. కథ కొత్త పాయింట్ తీసుకొని కథనం కూడా కొత్తగా ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకుంటే బాగుండు అనిపిస్తుంది. దర్శకుడిగా మల్లి అంకం సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా మాత్రం బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది. చాలా మంది ఆర్టిస్టులు, చాలా లొకేషన్స్.. ఇలా భారీగానే తీశారు.

మొత్తంగా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమా పెళ్లి కాని వాళ్ళ గురించి, మ్యాట్రిమోనీ మోసాల గురించి కామెడిగానే చెప్తూ సీరియస్ గా మెసేజ్ ఇచ్చారు. పెళ్లి కావాల్సిన వాళ్లంతా ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. ఈ సినిమాకు రేటింగ్ 2.75 ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.