Sabari Movie Review : వరలక్ష్మి శరత్ కుమార్ ‘శబరి’ మూవీ రివ్యూ.. కూతురి కోసం తల్లి పోరాటం..
వరలక్ష్మి లేడీ ఓరియెంటెడ్ గా ‘శబరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

Varalaxmi Sarathkumar Suspense Thriller Sabari Movie Review and Rating
Sabari Movie Review : ఇప్పటికే తెలుగులో పలు సినిమాల్లో కీలక పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). ఇప్పుడు వరలక్ష్మి లేడీ ఓరియెంటెడ్ గా ‘శబరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శబరి సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో నేడు మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే..
సంజన(వరలక్ష్మి శరత్ కుమార్) తన భర్త అరవింద్(గణేష్ వెంకట్ రామన్)ని వదిలేసి కూతురు(బేబీ నివేక్ష)తో సింగిల్ గా బతుకుతుంటుంది. ముంబై నుంచి విశాఖపట్నం వచ్చి ఫ్రెండ్ వద్ద ఉంటూ జాబ్ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో తన కాలేజీ ఫ్రెండ్ లాయర్ రాహుల్(శశాంక్)ని కలుస్తుంది. అతని సహాయంతో ఓ కార్పొరేట్ కంపెనీలో జుంబా డాన్స్ ట్రైనర్ గా జాయిన్ అవుతుంది. ఆ జాబ్ చేస్తూ సిటీకి దూరంగా ఫారెస్ట్ లాంటి ఏరియాలో ఇల్లు తీసుకొని ఉంటుంది. సంజనకు తనని, తన కూతురుని సూర్య(మైమ్ గోపి) అనే క్రిమినల్ వెంబడిస్తున్నట్టు, చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అతన్నుంచి తప్పించుకోవాలని ట్రై చేసే క్రమంలో సంజన గాయాలపాలవుతుంది. పోలీసులకు ఈ విషయం చెప్పగా వాళ్ళు విచారణ చేస్తే సూర్య ఆల్రెడీ చనిపోయాడని తెలుస్తుంది. మరోవైపు తన భర్త అరవింద్ కూతురిని తనకు ఇవ్వాలని కోర్టుకు వెళ్తాడు. అసలు సంజన అరవింద్ ని ఎందుకు వదిలేసింది? సంజనని చంపడానికి వెంబడిస్తున్న సూర్య ఎవరు? కూతురుని కాపాడుకోడానికి సంజన ఏం చేసింది? సంజన గతం ఏంటి? రియాకి సూర్యకి సంబంధం ఏంటి? లాయర్ రాహుల్ సంజనకు ఎలాంటి సాయం చేశాడు అనేవి తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Prasanna Vadanam : ‘ప్రసన్న వదనం’ మూవీ రివ్యూ.. సుహాస్ మళ్ళీ హిట్ కొట్టాడా..?
సినిమా విశ్లేషణ..
సినిమా ప్రారంభంలోనే ఓ మానసిక రోగుల ఆశ్రమం నుంచి ఓ వ్యక్తి తప్పించుకొని ఇద్దరిని చంపి తల్లి కూతురు కోసం వెతుకుతున్నట్టు చూపించి ఆసక్తి కలిగించారు. ఫస్ట్ హాఫ్ లో కథని మొదలుపెట్టడానికి, పాత్రల పరిచయానికి కొంచెం ఎక్కువ టైం తీసుకోవడంతో మొదట్లో సాగతీతగా ఉంటుంది. సంజన ఎందుకు తన భర్తకి దూరంగా ఉంటుంది అనేది సస్పెన్స్ మైంటైన్ చేయగలిగారు. జాబ్ కోసం తిరిగే సన్నివేశాలు కూడా ఎక్కువసేపు చూపించారు. సినిమాలో మళ్ళీ సూర్య పాత్ర ఎంట్రీ నుంచి ఆసక్తిగా సాగుతుంది. సంజన సిటీకి దూరంగా ఫారెస్ట్ లో ఇల్లు తీసుకొని ఎందుకు ఉండాలో కథ పరంగా అవసరం లేకపోయినా హారర్ ఎలిమెంట్ కోసం మాత్రమే తీసుకున్నట్టు అనిపిస్తుంది. సంజన గతానికి చెందిన సీన్స్ కొంచెం రొటీన్ గా అనిపిస్తాయి. సంజన – సూర్య సీన్స్ ఇంట్రెస్ట్ గా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సాగుతుంది. కొన్ని సన్నివేశాలతో మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమా గుర్తొస్తుంది. సెకండ్ హాఫ్ లో ఓ రెండు ట్విస్ట్ లు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తాయి. శబరి సినిమాలో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్ ఉన్నా డైరెక్టర్ కొంచెం తడబడ్డట్టు అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం గ్రిప్పింగ్ గా రాసి ఉంటే బాగుండు అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్..
వరలక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో కూడా తల్లిగా ఎమోషన్ సీన్స్ లో, యాక్షన్ సీన్స్ లో అదరగొట్టింది. సింగిల్ మదర్ గా కూతురు కోసం తపన పడే మహిళగా మెప్పించింది. మైమ్ గోపి భయపెట్టగలిగాడు. గణేష్ వెంకట్రామన్ రెండు షేడ్స్ లో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ బేబీ నివేక్ష క్యూట్ గా నటించింది. లాయర్ గా శశాంక్, పోలీసాఫీసర్ గా మధుసూదన్, కామెడీతో భద్రం.. పర్వాలేదనిపించారు.
సాంకేతిక అంశాలు..
సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. గోపిసుందర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సస్పెన్స్ థ్రిల్లర్ కి తగ్గట్టు బాగున్నా పాటలు మాత్రం ఓకే అనిపిస్తాయి. తల్లి – కూతుళ్ళ అనుబంధంతో ఉన్న రెండు పాటలు మాత్రం పరవాలేదు. ఎడిటింగ్ పరంగా సినిమాని ఇంకొంచెం తగ్గిస్తే బాగుండేది. కథ కొత్తగా రాసుకున్న కథనం ఇంకొంచెం మారిస్తే బాగుండు అనిపిస్తుంది,. దర్శకుడిగా అనిల్ పర్వాలేదనిపించారు. ఇక సినిమాకి నిర్మాణ పరంగా మాత్రం కొత్త నిర్మాత ఎక్కడా తగ్గకుండా ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘శబరి’ సినిమా కూతురి కోసం తల్లి చేసే పోరాటాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ గా చూపించారు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కి వెళ్తే ఆ ఆ సస్పెన్స్ ఫీల్ అవ్వొచ్చు. ఈ సినిమాకి 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.