Sri Lanka crisis: సోషల్ మీడియాపై నిషేధం విధించిన ప్రభుత్వం.. ఎప్పటి వరకంటే..?

శ్రీలంక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధం విధించినట్లు ఆదివారం ప్రకటించి. దీంతో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, య్యూటూబ్ సహా ..

Sri Lanka crisis : ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర ధరలు భారీగా పెరగడంతో ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు ఉదృతంగా కొనసాగుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం సాయంత్రం 6గంటల నుంచి 36గంటల పాటు అత్యవసర పరిస్థితి విధించింది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాపై నిషేధం విధించినట్లు ఆదివారం అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వాట్సాప్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, య్యూటూబ్ సహా ఇతర సామాజిక మాధ్యమాలు శనివారం అర్థరాత్రి దాటిన తరువాత నిలిచిపోయాయి. ఆందోళనలు అణచివేయడానికే శ్రీలంక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Srilanka Economic Crisis : గుడ్డు 35 రూపాయలు… పెట్రోల్ రూ.283….శ్రీలంక సంక్షోభం

శ్రీలంక కొద్దికాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. నిత్యావసర వస్తువులు దొరక్క ప్రజలు అల్లాడిపోతున్నారు. విదేశీ మారకద్రవ్యం కొరతతో చమురు దిగుమతులకు చెల్లింపులు జరలేని పరిస్థితుల మధ్య జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష భవనం ఎదుట గురువారం రాత్రి ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి పునరావృతం అవుతుండటంతో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత అధ్యక్షుడు గోటాబయ రాజపక్స దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ గెజిట్‌లో పేర్కొన్నారు.

Srilanka : భారత్ తీరాన్ని తాకిన లంక సంక్షోభం

మరోవైపు తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా చెలరేగుతున్న ఆందోళనలను కట్టడి చేసేందుకు శ్రీలంక ప్రభుత్వం భారత బలగాల సాయం తీసుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. భారత సైనికులు ఇప్పటికే కొలంబో చేరుకున్నారంటూ కొన్ని ఫొటోలు స్థానిక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, శ్రీలంక రక్షణశాఖ వీటిని కొట్టి పారేసింది. ఏడాది కిందట సంయుక్త భద్రతా విన్యాసాల నిమిత్తం భారత సైనికులు కొలంబో వచ్చారని, అప్పటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని రక్షణశాఖ కార్యదర్శి కమల్ గుణరత్నే మండిపడ్డారు. భారత బలగాలు శ్రీలంక వచ్చాయన్న కథనాలను భారత హైకమిషన్‌ కూడా కొట్టిపారేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తద్వారా దేశంలో ఆందోళనలు ఉదృతమయ్యేలా ప్రయత్నం చేస్తున్నారని భావించిన ప్రభుత్వం.. సోషల్ మీడియాపైనా నిషేధం విధిస్తూ నిర్ణయించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా ప్లాట్‌ఫారమ్‌లకు ప్రాధాన్యతను అక్కడి ప్రభుత్వం పరిమితం చేసింది. సోమవారం వరకు ఈ నిషేధం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు