ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉపసంహరణ.. మైనారిటీలో హర్యానా సర్కారు

ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించడంతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది.

Haryana Political Crisis : లోక్‌స‌భ‌ ఎన్నికల వేళ హర్యానాలో బీజేపీకి షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో రాజకీయ రసకందాయంలో పడింది. బీజేపీ సర్కారు నుంచి తప్పుకుంటున్నట్టు ఎమ్మెల్యేలు సోమ్‌బీర్ సంగ్వాన్ (దాద్రి), రణ్‌ధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధర్మపాల్ గోండర్ (నీలోఖేరి) గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. రాశారు. రైతుల సమస్యలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించడంతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హర్యానా లోక్‌హిత్ పార్టీకి చెందిన గోపాల్ కందాతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నయన్‌పాల్ రావత్, రాకేశ్ దౌలతాబాద్ మద్దతుతో కలిపి బీజేపీ బలం 43 మాత్రమే. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన కనీస సంఖ్యాబలం 46.

అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్‌ నాయకత్వంలో జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత మార్చి నెలలో జేజేపీతో తెగదెంపులు చేసుకుని స్వతంత్రుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని కొనసాగిస్తోంది. అదే సమయంలో మనోహర్ లాల్ ఖట్టర్‌ తో రాజీనామా చేయించి..
కురుక్షేత్ర ఎంపీగా ఉన్న నయాబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి పీఠాన్ని కట్టబెట్టింది. ఖట్టర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కర్నాల్ లోక్‌స‌భ‌ నుంచి పోటీలో నిలిచారు.

కాగా, ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అప్పటి వరకు ప్రభుత్వం నిలబడాలంటే 46 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 30 మంది ఎమెల్యేలు ఉన్నారు. బీజేపీకి తాజాగా మద్దతు ఉపసంహరించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలున్న జేజేపీ మద్దతు ఎవరికి ఉంటుందనేది కీలకంగా మారింది.

Also Read: దక్షిణాదిపై పట్టు సాధించేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలు.. ఏమి చేస్తోందో తెలుసా?

పట్టిష్టంగా ఉన్నాం: సీఎం సైనీ
తమ ప్రభుత్వం కష్టాల్లో పడిందన్న వార్తలను ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ కొట్టిపారేశారు. సిర్సాలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందుల్లో లేదని, పటిష్టంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. కాగా, తమ ప్రభుత్వానికి అండగా నిలబడటానికి పలువురు నేతలు సిద్ధంగా ఉన్నారంటూ మాజీ సీఎం ఖట్టర్ సూచనప్రాయంగా వెల్లడించారు. తమతో ఎంత మంది టచ్‌లో ఉన్నారనేది త్వరలోనే తెలుస్తుందని, వారి నాయకులను చేజారిపోకుండా చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

Also Read: అధికారం కోసం దేశాన్ని విభజించేందుకు కూడా సిద్ధంగా ఉంది- కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఫైర్

గవర్నర్‌కు లేఖ రాస్తాం: కాంగ్రెస్
మైనారిటీలో పడిన సైనీ ప్రభుత్వాన్ని రద్దు రద్దు చేయాలని గవర్నర్‌కు లేఖ రాస్తామని హర్యానా కాంగ్రెస్ తెలిపింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ప్రకటించాలని కోరతామని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు