India’s GHI Score : ఆకలి సూచీలో పడిపోయిన భారత్ ర్యాంకు..మోదీకి అభినందనలు తెలిపిన కపిల్ సిబల్

గ్లోబల్‌ ​ హంగర్ ఇండెక్స్‌( ప్రపంచ ఆకలి సూచీ)లో భారత్‌ ర్యాంకు 101వ స్థానానికి పడిపోవడంపై ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్

India’s GHI Score  గ్లోబల్‌ ​ హంగర్ ఇండెక్స్‌( ప్రపంచ ఆకలి సూచీ)లో భారత్‌ ర్యాంకు 101వ స్థానానికి పడిపోవడంపై ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్..ప్రధాని మోదీపై ధ్వజమెత్తారు. అభినందనలు మోదీజీ అంటూ తనదైన స్టైల్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేదరికం, ఆకలి నిర్మూలన కంటే కూడా భారతదేశాన్ని గొప్ప ప్రపంచ శక్తిగా మార్చే పనిలోనే మోదీజీ ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. గ్లోబల్‌ ​ హంగర్ ఇండెక్స్‌ లో భారత్..బంగ్లాదేశ్,పాకిస్తాన్,నేపాల్ కన్నా వెనుకబడిందని సిబల్ పేర్కొన్నారు.

కాగా,గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ 2021 జాబితాలో మొత్తం 116 దేశాలకు గానూ భారత్‌ 101వ స్థానంలో నిలిచింది. న్యూ గినియా, అప్ఘానిస్తాన్‌, నైజీరియా వంటి దేశాల సరసన భారత్‌ చేరింది. మన దేశం తరువాతి స్థానాల్లో పాపువా న్యూ గినియా (102), ఆఫ్ఘనిస్తాన్‌, నైజీరియా (103), కాంగో (105), మోజాంబిక్‌, సియార్రా లియోన్‌ (106), తిమోర్‌ లెస్తే (108), హైతీ (109), లిబియా (110) వంటి దేశాలు ఉన్నాయి. ఈ జాబితాలో అట్టడుగున సోమాలియా ఉంది.

అయితే భారత్ కన్నా.. పాకిస్తాన్‌ (92), నేపాల్‌, బంగ్లాదేశ్‌ (76)లకు ఉత్తమ ర్యాంక్‌లు దక్కించుకున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏఢాది భారత్‌ మరింత దిగజారి పోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది మొత్తం 107 దేశాలకుగాను భారత్‌కు 94వ ర్యాంక్‌ లభించింది.

ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్…జాతీయ, ప్రాంతీయ, ప్రపంచ స్థాయిలో 2030 నాటికి ఆకలి బాధలు లేని సమాజం (జీరో హంగర్‌) దిశగా పురోగతిని కొలవడానికి కీలక అంశాలను గుర్తించడానికి ఈ జాబితా తయారు చేస్తుంది. ప్రస్తుత సూచీలను బట్టి 2030 నాటికి ఈ జాబితాలోని 47 దేశాలు ఆకలి లేని సమాజాన్ని సాధించడంలో వెనుకబడతాయని అంచనా వేశారు.

పోషకాహార లోపం, చిన్నారుల్లో వయసుకు తగిన బరువు లేకపోడం, చిన్నారుల్లో వయసుకు తగిన ఎత్తు లేకపోవడం, చిన్నారుల మరణాలు.. అనే నాలుగు సూచికల ఆధారంగా ఈ జాబితా రూపొందిస్తారు. 100 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయనే అంశంతో ర్యాంక్‌ కేటాయిస్తారు. 0 స్కోరు వస్తే ఆకలి లేదని అర్థం. 100 పాయింట్లు వస్తే ఆకలి సమస్య తీవ్రంగా ఉందని అర్థం. తీవ్రత ఆధారంగా ప్రతి దేశాన్ని తక్కువ నుంచి అత్యంత ఆందోళనకరం మధ్య వర్గీకరిస్తారు.

ALSO READ కేంద్రం అమ్మేసింది… టాటా కొనేసింది… మరి మా సంగతేంటి అంటున్న ఎయిరిండియా ఉద్యోగులు

ట్రెండింగ్ వార్తలు