Serilingampally Constituency: శేరిలింగంపల్లిలో త్రిముఖ పోరు తప్పదా.. బరిలోకి టీడీపీ అభ్యర్థి?

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా మారితే రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కూడా మారే చాన్స్ క‌నిపిస్తోంది.

Serilingampally Assembly Constituency Ground Report

Serilingampally Assembly Constituency: హైద‌రాబాద్‌లో చార్మినార్ (Charminar) ఎంత ఫేమస్సో హైటెక్ సిటీ కూడా అంతే ఫేమస్సు.. దేశవిదేశాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన హైటెక్ సిటీ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఆకాశ హర్మాలు లాంటి భవనాలు.. అధునాతన హంగు ఆర్భాటాలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం కేరాఫ్‌గా మారింది. ఒక విధంగా ఇక్కడ రాజకీయం కన్నా.. శరవేగంగా జరిగే అభివృద్ధేపైనే ఎక్కువ చర్చ జరుగుతుంటుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా శేరిలింగంపల్లి అభివృద్ధి మాత్రం ఆగదు.. అందుకే ఇక్కడి నుంచి పోటీకి నేతలు ఉవ్విళ్లూరుతుంటారు. టిక్కెట్ కోసం పోటాపోటీగా ప్రయత్నిస్తుంటారు. అభివృద్ధికి చిరునామాగా చెప్పే శేరిలింగంపల్లిలో ఈ సారి కనిపించబోయే సీనేంటి?

శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం 2009లో ఆవిర్భవించింది. ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న మియాపూర్ (Miyapur), చందాన‌గ‌ర్, బాలాన‌గ‌ర్, కూక‌ట్ ప‌ల్లి (Kukatpally), వివేకానంద న‌గ‌ర్, బిహెచ్ఇఎల్, హ‌ఫీజ్ పేట‌, కొండాపూర్, గ‌చ్చిబౌలి, రాయ‌దుర్గం (Raidurg) ప్రాంతాలను కలిపి కొత్తగా ఏర్పాటు చేశారు శేరిలింగంపల్లి నియోజకవర్గం. ఇప్పటివరకు మూడుసార్లు ఎన్నికలు జరగ్గా.. మూడు పార్టీలు గెలిచాయి. అయితే 2014లో టీడీపీ తరఫున గెలిచిన అరికపూడి గాంధీ (Arekapudi Gandhi) ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి.. 2018లో గులాబీ పార్టీ తరపున ఎన్నికయ్యారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గాంధీ మరోసారి పోటీకి రెడీ అవుతున్నారు.

Arekapudi Gandhi

ప్రస్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేత‌లు నువ్వానేనా అన్నట్లు పోటీ ప‌డుతున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంగా ఉన్న శేరిలింగంపల్లి హైటెక్ సిటీ ఏర్పాటుతో అధునాత హంగులతో అభివృద్ధి పథాన దూసుకుపోతోంది. హైద‌రాబాద్ అంటేనే ఈ ప్రాంతమే అంద‌రికీ గుర్తుకువ‌చ్చేలా మారిపోయింది శేరిలింగంపల్లి నియోజకవర్గం. ఐతే ఇదే ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోని మురికివాడలూ కనిపిస్తున్నాయి.

గత ఎన్నిక‌ల్లో ఆరు ల‌క్ష ఓట‌ర్లు ఉండగా, ఈ సారి ఓటర్లు గణనీయంగా పెరిగే అవ‌కాశం కనిపిస్తోంది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు.. ఐటీ అనుబంధ రంగాల్లో స్థిరపడిన వారితో శేరిలింగంపల్లికి ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. వీరంతా శాశ్వతంగా స్థిరపడిపోవడంతో ఓటర్ల సంఖ్య ప్రతిసారి అనూహ్యంగా పెరుగుతోంది. హైటెక్ సిటీలో దాదాపు 90 శాతం ఈ నియోజ‌క‌వ‌ర్గం పరిధిలోనే ఉండటంతో ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది. శాస‌న‌స‌భ్యులు అడిగినా.. అడ‌గ‌క పోయినా.. నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి ప్రభుత్వ ప్రాధాన్య అంశంగా మారిపోయింది.

ఐతే జనాల రద్దీ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్ స‌మ‌స్య రోజురోజుకు ఎక్కువవుతోంది. ఈ స‌మ‌స్య ప‌రిష్కానికి కొత్త ర‌హ‌దారులు, ఫ్లైఓవర్‌లను నిర్మిస్తోంది ప్రభుత్వం. కానీ, ప్రధాన ర‌హ‌దారిపై ఉన్న రైల్వే ట్రాక్ మాత్రం సమన్యను యథాతథంగా ఉంచుతోంది. ఇక్కడ ఎప్పుడో నిర్మించిన అండ‌ర్ పాస్ బ్రిడ్జ్ వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. అండర్‌పాస్‌ను మరింత విస్తరిస్తేనే స‌మ‌స్యకు శాశ్వత ప‌రిష్కారం లభిస్తోందని అంటున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటంతో కాస్త ఆలస్యమవుతోందని అంటున్నారు నాయకులు.

Also Read: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా.. నరేందర్ రెడ్డే మళ్లీ సత్తా చాటతారా?

ప్రభుత్వ ప్రాధాన్య నియోజకవర్గంగా మారిన శేరిలింగంపల్లిలో పోటీకి ప్రధాన పార్టీల్లో తీవ్ర డిమాండ్ ఉంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆశావహులు ఎక్కువగా ఉండటంతో టిక్కెట్ దక్కించుకోవడమే ప్రధానంగా మారింది. ఈ పరిస్థితి అన్ని పార్టీల లోనూ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అరిక‌పూడి గాంధీ ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉండగా, ఆయనకు పోటీగా మరో నేత టిక్కెట్ ఆశిస్తున్నారు. ఓ సారి తెలుగుదేశం పార్టీ నుంచి మ‌రోసారి గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గాంధీ, మూడోసారి పోటీ చేయాలని అనుకుంటున్నారు. త‌న‌కే టికెట్ ఖాయ‌మ‌న్న ధీమాతో ఉన్నారు గాంధీ. తన హయాంలో జరిగిన అభివృద్ధితోనే మ‌రోసారి విజ‌యం సాధిస్తాన‌ని అంటున్నారు. ఐతే 2018 ఎన్నిక‌ల్లో గెలిచిన గాంధీని విప్‌గా నియమించారు సీఎం కేసీఆర్. ఐతే మంత్రి ప‌ద‌వి ద‌క్కలేద‌న్న అసంతృప్తితో విప్ పదవిని చాలా రోజులు తీసుకోలేదు గాంధీ. దీంతో ఎమ్మెల్యే గాంధీ, సీఎం కేసీఆర్‌కు మధ్య గ్యాప్ పెరిగిందని చెబుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ క్యాడ‌ర్‌ను పటిష్ట పరచలేదన్న అసంతృప్తి కూడా ఎమ్మెల్యేపై ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్యే అనుచరులు భూవివాదాల్లో చ‌క్రం తిప్పుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు మైనస్‌గా మారుతున్నాయి. అయితే ఇవన్నీ ప్రత్యర్థుల ఆరోపణలేకాని వాస్తవాలు లేవంటున్నారు ఎమ్మెల్యే. మళ్లీ విజయం తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Bandi Ramesh

మూడోసారి టిక్కెట్ తనదేనని ఎమ్మెల్యే గాంధీ ధీమాగా ఉన్నా.. సీనియ‌ర్ నేత, బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యద‌ర్శి బండి ర‌మేష్ (Bandi Ramesh) కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సారి త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని అధిష్టానాన్ని కోరుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నా తానే సీనియ‌ర్ నాయకుడినని చెబుతున్నారు రమేశ్. అంతేకాదు ఎమ్మెల్యే వ్యతిరేక వ‌ర్గాన్ని కూడగడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఇద్దరు కార్పొరేట‌ర్‌లకు తప్ప ఎమ్మెల్యేకు మరెవరితోనూ స‌త్సంబంధాలు లేవ‌న్న ప్రచారం జ‌రుగుతోంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నేతల మ‌ద్దతుతో బ‌రిలో దిగాల‌ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు రమేశ్. ఈ మధ్యే సొంతంగా ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ టిక్కెట్ ఇస్తే తప్పక గెలుస్తానని చెబుతున్నారు రమేశ్.

Jeripeti Jaipal

కాంగ్రెస్ పార్టీలో కూడా దాదాపు ఇదే ప‌రిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జెర్రిపాటి జైపాల్, (Jeripeti Jaipal) మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి సన్నిహితుడు ర‌ఘు యాద‌వ్ టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. 2009 ఎన్నిక‌ల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌డంతో ఈ సారి ఆశలు పెట్టుకుంటున్నారు హస్తం నేతలు. బలమైన నాయకుడిని బరిలోకి దించితే విజయం ఖాయమంటున్నారు. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతఅభివృద్ధి కంటే భూ కబ్జాలకే ఎమ్మెల్యే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. త‌న‌కే పోటీ చేసే అవ‌కాశం ద‌క్కుతుందంటున్నారు జైపాల్.

Gajjala Yoganand

ఇక బీజేపీలో ప‌రిస్థితి భిన్నంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన యోగానంద్ (Gajjala Yoganand) ఈ ఎన్నిక‌ల్లో కూడా పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే త‌న‌యుడు ర‌వి యాద‌వ్ టికెట్ హామీతోనే బీజేపీలో చేరిన‌ట్లు చెప్పుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీలో జరిగిన మార్పులు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. బండి సంజ‌య్ అధ్యక్షుడిగా ఉన్న స‌మ‌యంలో ర‌వి యాద‌వ్ (Ravi Yadav) బీజేపీ గూటికి చేరారు. ఇప్పుడు కిష‌న్ రెడ్డి అధ్యక్షుడిగా రావ‌డంతో ఆర్ఎస్ఎస్ తో స‌త్సంబంధాలున్న యోగానంద్‌కే టికెట్ దక్కే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఈ విశ్లేషణలతో యోగానంద్, రవి యాదవ్ వర్గాలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇద్దరి అనుచరులు ఆ మధ్య బాహాబాహీకి దిగడం.. పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో తెలియజేస్తోంది. ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన మువ్వ సత్యనారాయణ కూడా పోటీకి సై అంటున్నారు. ఈ ముగ్గురిలో టిక్కెట్ ఎవరికి ఇస్తుందో.. ఎవరు ఎవరికి పోటీగా నిలుస్తారో ఇంట్రస్టింగ్ మారింది.

Also Read: మంచిర్యాల బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై ఐదుగురి కన్ను.. దూకుడు చూపిస్తున్న కాంగ్రెస్, బీజేపీ

తెలుగుదేశం పార్టీకి కూడా నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ణ‌నీయ‌మైన ఓటు బ్యాంకు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2018 ఎన్నిక‌ల్లో నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గానికి చెందిన ఓ పారిశ్రామిక వేత్త పోటీ చేసి ల‌క్ష ఓట్లను సాధించారు. బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలుగా మారితే రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు కూడా మారే చాన్స్ క‌నిపిస్తోంది. ఇలా హోరాహోరీగా కనిపిస్తున్న శేరిలింగంపల్లిలో త్రిముఖ పోరు త‌ప్పద‌న్న సంకేతాలే కనిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు