IND vs PAK : తటస్థ వేదికల్లో భారత్, పాక్ టీ20 సిరీస్.. పీసీబీ కీలక వ్యాఖ్యలు..
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉండే క్రేజే వేరు.
- Thota Vamshi Kumar
- Published On : July 23, 2024 / 03:32 PM IST
No proposal for offshore T20I series against India PCB
India vs Pakistan : భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లకు ఉండే క్రేజే వేరు. అయితే.. కొన్ని కారణాల వల్ల 2012 తరువాత ఇరు దేశాల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. ఈ క్రమంలో తటస్థ వేదికలపై భారత్‌తో సిరీస్‌లు నిర్వహించే అవకాశాలపై బీసీసీఐ అధికారులతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ చర్చలు జరిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై పీసీబీ స్పందించింది. అందులో ఎంత మాత్రం నిజం లేదందీ.
పాకిస్తాన్ వెలుపల టీమ్ఇండియాతో టీ20 సిరీస్ ఆడేందుకు ఎలాంటి ప్రతిపాదనను తాము చేయలేదని పీసీబీ తెలిపింది. ప్రస్తుతం తమ దృష్టి అంతా ఛాంపియన్స్ ట్రోఫీ పైనే ఉందని చెప్పింది. ఈ టోర్నీని సజావుగా నిర్వహించడంపైనే ఉందంది. పాక్ జట్టుకు తీరిక లేని అంతర్జాతీయ మ్యాచుల షెడ్యూల్ కూడా ఉంది. అందుకనే భారత్‌తో దైపాక్షిక సిరీస్‌ల గురించి ఆలోచించడం లేదంది.
IND vs SL : భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక జట్టు ఇదే.. అసలంక సారథ్యంలో
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి. కాగా.. ఈ టోర్నీకి సంబంధించిన డ్రాప్ట్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీకి పీసీబీ అందజేసింది. అయితే.. ఈ టోర్నీలో టీమ్ఇండియా పాల్గొంటుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తేనే భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లనుంది.
ఇటీవల కొలంబో వేదికగా జరిగిన ఐసీసీ సమావేశంలో దీనిపై చర్చ జరుగుతాదని ఎంతో మంది భావించారు. కానీ.. దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని ఈ సమావేశంలో పాల్గొన్న ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు.
