Andole Constituency: ఆందోల్ కోటలో పాగా వేసేదెవరు.. ప్రధాన పార్టీల్లో పెరిగిపోతున్నఆశావాహులు!

మూడు పార్టీల్లోనూ ఒకరికంటే ఎక్కువగా ఉన్న ఆశావహులతో ఆందోల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరిగింది.

Andole Assembly Constituency Ground Report

Andole Assembly Constituency: ఆందోల్ రాజకీయం ఎప్పుడూ రసవత్తరమే.. విస్తీర్ణంలో తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గం ఆందోల్. ఎన్నికల సమీపిస్తున్నకొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అధికార బీఆర్ఎస్‌తోపాటు, కాంగ్రెస్, బీజేపీల్లో ఆశావాహులు పెరిగిపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఎసరు పెట్టేలా బీఆర్‌ఎస్ నేతలు అసమ్మతి రాజకీయాలు నెరుపుతుండగా, ప్రతిపక్ష కాంగ్రెస్‌లోనూ ఈ గ్రూప్‌వార్ ఎక్కువగానే ఉంది. రెండు ప్రధాన పార్టీల్లోనూ ఆశావహులు ఎక్కువగా ఉండటంతో ఆందోల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ (Chanti Kranthi Kiran) మాత్రం తిరిగి గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రతిపక్షాలు కూడా అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ హోరాహోరీ పోరులో ఈ సారి కనిపించే సీనేంటి? ఆందోల్ కోటలో పాగా వేసే పార్టీ ఏది?

చంటి క్రాంతికిరణ్ (photo: facebook)

ఆందోల్ నియోజకవర్గం ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. కానీ, తెలంగాణ ఏర్పాటుతో ఇక్కడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. 1952లో నియోజకవర్గం ఏర్పడితే.. 1967లో ఎస్‌సీ రిజర్వుడుగా మారింది. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు, బీజేపీ రెండుసార్లు, ఓ సారి ఇండిపెండెంట్ గెలిచారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ అధికార బీఆర్‌ఎస్సే విజేతగా నిలిచింది. 2014లో ఆ పార్టీ తరఫున మాజీ మంత్రి బాబూమోహన్ గెలుపొందగా, 2018లో ఆయన బీజేపీకి జంప్ చేయడంతో జర్నలిస్ట్ క్రాంతి కిరణ్‌ను పోటీకి దింపింది బీఆర్‌ఎస్. ఆ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ విజయం సాధించడంతో క్రాంతికిరణ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1967లో ఎస్‌సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా మారిన ఆందోల్‌లో మాజీ మంత్రి సి.రాజనర్సింహ హవా నడిచింది. ఇక్కడి నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన రాజనర్సింహ మంత్రిగానూ సుధీర్ఘ కాలం పనిచేశారు. తర్వాత ఆయన తనయుడు దామోదర రాజనర్సింహ ఆరు సార్లు పోటీచేశారు. వరుసగా మూడుసార్లు పరాజయం పాలైనా పట్టు వదలకుండా నాలుగోసారి విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి గానూ పనిచేశారు. ఇక్కడి నుంచి టిడిపి తరఫున గెలిచిన సినీనటుడు బాబూమోహన్ కూడా చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు.

Also Read: మహేశ్వరం నియోజకవర్గంలో ఈసారి పోటీకి దిగేదెవరు.. త్రిముఖ పోరు తప్పదా?

ఈ నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 25 వేల 714 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళా ఓటర్లు లక్ష 13 వేల 646. లక్ష 12 వేల 68 పురుష ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గ పరిధిలో 9 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది. 1952 నుంచి 1985 వరకు తిరుగులేని విజయాలను సాధించింది కాంగ్రెస్. 1985లో తొలిసారిగా టిడిపి నుంచి మల్యాల రాజయ్య విజయం సాధించగా, ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 1998లో సినీనడుటు బాబూమోహన్ ఎంటరైన తర్వాత టిడిపి వరుసగా గెలిచింది. అప్పటి నుంచి కాంగ్రెస్ వర్సెస్ టిడిపిగా మారిన పోరు.. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా రూపాంతరం చెందింది.

ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో పాటు, కాంగ్రెస్, బిజెపి నుంచి ఆశావాహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఆందోల్ జడ్పీటీసీ సభ్యుడు రమేశ్ బీఆర్‌ఎస్ టిక్కెట్ ఆశిస్తున్నారు. అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు రమేశ్. చంటి క్రాంతికిరణ్ పై ఎమ్మెల్యేగా గెలిచిన కొద్దిరోజులకే భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానికత అంటూ పెద్ద సెంటిమెంట్ నడిపిన క్రాంతికి, స్థానిక నేతలకు అస్సలు పొసగడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జడ్పీటీసీ సభ్యుడు రమేశ్ తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని… మరోసారి బరిలో దిగేది.. గెలిచేది తానేననే ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే క్రాంతి.

దామోదర రాజనర్సింహ (photo: facebook)

గట్టిపోటీ ఇచ్చేలా కాంగ్రెస్ 
గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించినా ఈసారి కాంగ్రెస్ పార్టీ గట్టిపోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. వరుసగా తొమ్మిదేళ్లు అధికారానికి దూరంగా ఉండటంతో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే పంతంతో పనిచేస్తున్నారు హస్తం కార్యకర్తలు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండే అవకాశం స్పష్టంగా కన్పిస్తోంది. రెండు పార్టీలు నువ్వానేనా అన్నట్లు తలపడే వాతావరణం కనిపిస్తుంది. వరుస ఓటములతో కుంగిపోయిన మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఈ సారి గెలవకపోతే రాజకీయంగా మనుగడ ఉండదని భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని పకడ్బందీగా స్కెచ్ వేస్తున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప ఈ 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధి శూన్యమని విమర్శిస్తున్నారు దామోదర రాజనర్సింహ. అయితే దామోదర రాజనర్సింహకు కాకుండా ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని రేగోడ్ జడ్పీటీసీ సభ్యుడు యాదగిరి కోరుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలసి తన ఆసక్తిని తెలియజేశారు యాదగిరి. వరుసగా ఓటమిని చవి చూస్తున్న దామోదర్ రాజనర్సింహకు సీటు ఇస్తే కాంగ్రెస్ గెలిచే ఓ సీటును కోల్పోయినట్లేనని యాదగిరి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్లో ఈ గ్రూపు తగాదాలే బీఆర్‌ఎస్‌కు మేలుచేస్తాయని భయపడుతున్నారు కార్యకర్తలు.

బాబూమోహన్ (photo: facebook)

బీజేపీ తరఫున బాబూమోహన్
ఇక గతంలో ఇక్కడ ఎప్పుడూ బీజేపీ ప్రభావం చూపలేదు. టిడిపి హయాంలో మంత్రిగా… బిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సినీనటుడు బాబూమోహన్(Babu Mohan) ఈ సారి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. బీజేపీలోనూ ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కవగానే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన బాబూమోహన్ తిరిగి ఈ సారి పోటీచేయాలని సమాయత్తమవుతున్నారు. గతంలో కంటే పార్టీ బాగా పెరిగిందని, యువత ఈ సారి బిజెపికి అనుకూలంగా ఉందని.. అనూహ్య విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారు బాబూమోహన్. జడ్పీ మాజీ ఛైర్మన్ బాలయ్య కూడా బీజేపీ టిక్కెట్‌ను ఆశిస్తున్నారు.

Also Read: సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ ఈసారి జెండా ఎగరేస్తుందా?

ఆసక్తికరంగా ఆందోల్ రాజకీయం
ఇలా మూడు పార్టీల్లోనూ ఒకరికంటే ఎక్కువగా ఉన్న ఆశావహులతో ఆందోల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గత రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు జరిగింది. ఈ రెండు పార్టీల మధ్య కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడాయే ఉంటోంది. 2014లో కేవలం 3 వేల 291 ఓట్ల తేడాతో గెలిచిన బీఆర్‌ఎస్.. 2018లో మాత్రం 16 వేల 465 ఓట్ల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ రెండు ఎన్నికల్లోనూ బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. కానీ, ఈ సారి చెప్పుకోదగ్గ మార్పు వస్తుందని కమలం పార్టీ అంచనా వేస్తుంది. ప్రస్తుతానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ బలాబలాల్లో ఎటువంటి తేడాలు కనిపించడంలేదు. కానీ, గ్రూప్‌వార్ రెండు పార్టీల్లోనూ తీవ్రంగా ఉంది. 2018లో భారీ తేడాతో గెలిచినా ఓట్ల శాతంలో పెద్దగా మార్పులేదు. ఈ సారి కూడా కొద్ది ఓట్ల శాతమే పార్టీల తలరాతలు మార్చే చాన్స్ కనిపిస్తోంది. గ్రూప్ వార్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి క్యాడర్‌ను పూర్తిగా ఆకర్షించే నాయకుడే ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. రెండు పార్టీల్లోనూ నెలకొన్న గ్రూప్ వార్ ఎవరి ఓట్లకు గండికొడుతుందో.. ఎవరు ఎవరిని ఆకర్షిస్తారో తెలియని పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలను ఆసక్తికరంగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు