Maheshwaram Constituency: మహేశ్వరం నియోజకవర్గంలో ఈసారి పోటీకి దిగేదెవరు.. త్రిముఖ పోరు తప్పదా?

రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మంత్రి సబితను.. చేవెళ్ల ఎంపీగా బరిలో నిలిపే అంశాన్ని గులాబీ పార్టీ పరిశీలిస్తోందనే చర్చ సాగుతోంది. ఇక.. కాంగ్రెస్, బీజేపీల్లోనూ.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉండటంతో.. ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక్తిగా రేపుతోంది.

Maheshwaram Assembly Constituency Ground Report

Maheshwaram Assembly Constituency: రంగారెడ్డి జిల్లా (Rangareddy District)లో హాట్ సీటుగా ఉన్న మహేశ్వరంలో.. లోకల్ పాలిటిక్స్(Local Politics) ఫుల్ హీట్ మీదున్నాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు.. నువ్వా-నేనా అన్నట్లుగా నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)కి.. సొంత పార్టీలోనే వర్గ పోరు తలనొప్పిగా మారింది. తీగల కృష్ణారెడ్డి (Teegala Krishna Reddy) లాంటి నేతలు కూడా టికెట్ రేసులో ఉండటంతో.. రాజకీయం మరింత వేడెక్కింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీల నుంచి కూడా ఆశావహులు ఎక్కువే ఉన్నారు. దాంతో.. రోజురోజుకు మహేశ్వరం రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మరి.. వీటన్నింటిని దాటుకొని.. వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగేదెవరు? మహేశ్వరంలో ఈసారి గులాబీ జెండా ఎగిరే చాన్స్ ఉందా? ఓవరాల్‌గా.. అక్కడ ఎలాంటి పొలిటికల్ సీన్ (Political Scene) కనిపించబోతోంది?

కొంత గ్రామీణం.. కొంత పట్టణం.. ఇంకొంత నగరం.. ఇలా.. 3 రకాల ప్రాంతాలు కలిసుండే నియోజకవర్గం.. మహేశ్వరం. రియల్ ఎస్టేట్ జోరుతో.. ఈ సెగ్మెంట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయ్. సాఫ్ట్ వేర్ కంపెనీలు, ఫార్మా సిటీ, ఫ్యాబ్ సిటీ, అమెజాన్ డాటా సెంటర్, సమీపంలోనే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుతో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు.. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయ్. 2009లో మహేశ్వరం నియోజకవర్గం ఏర్పడింది. దీని పరిధిలో.. కందుకూరు, మహేశ్వరం మండలాలతో పాటు తుక్కుగూడ మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సరూర్‌నగర్ ప్రాంతం కొంత కలిసి ఉంటుంది. వీటిలో.. కందుకూరు మండలం గ్రామీణ ప్రాంతంగా ఉంటుంది.

సబితా ఇంద్రారెడ్డి (photo: facebook)

ఇక.. మహేశ్వరం పరిధిలో 3 లక్షల 80 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సంఖ్య 4 లక్షలు దాటే అవకాశం ఉంది. మహేశ్వరం నియోజకవర్గానికి ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత.. 2014 ఎన్నికల్లో హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి.. టీడీపీ తరఫున గెలిచి.. తర్వాత గులాబీ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.. మహేశ్వరంపై తన పట్టు నిలుపుకున్నారు సబితా ఇంద్రారెడ్డి. తర్వాత.. ఆవిడ బీఆర్ఎస్‌లో చేరడం, సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా చోటు దక్కించుకోవడం జరిగాయి.

తీగల కృష్ణారెడ్డి (photo: twitter)

మహేశ్వరం.. మంత్రి సబిత సొంత నియోజకవర్గం కాకపోయినా.. ఆవిడ ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఆమెకు ప్రస్తుతం మహేశ్వరంలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి, మంత్రి సబితకు అస్సలు పొసగడం లేదు. సబిత తనయుడు కార్తీక్ రెడ్డి భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని.. సొంత పార్టీ నేతలు తీగల కృష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి బహిరంగ విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబంలో ఒకరికి టికెట్ ఇవ్వాలని.. బీఆర్ఎస్ పెద్దల ముందు ప్రతిపాదనలు ఉంచుతున్నారు. తనకు కాకపోయినా.. కోడలు అనితా రెడ్డికై (Teegala Anitha Reddy) నా.. అవకాశం ఇవ్వాలనే సంకేతాలిస్తున్నారు. ఆవిడ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. మరోవైపు.. 2014లో గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త మనోహర్ రెడ్డి.. నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. సొంతంగా పెద్ద ఎత్తున సామాజిక, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నారు.

చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, రేవంత్‌ రెడ్డి (photo: facebook)

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మహేశ్వరంలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కానీ.. వాళ్లిద్దరూ.. గెలిచాక అధికార బీఆర్ఎస్ గూటికి చేరారు. ఇప్పుడు కూడా మంత్రి సబిత బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నా.. మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. ప్రధానంగా ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉన్నారు. బడంగ్ పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి (Chigirintha Parijatha Narsimha Reddy)కి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామన్న హామీతోనే.. బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరారనే ప్రచారం సాగుతోంది. సరూర్‌నగర్‌కు చెందిన దేప భాస్కర్ రెడ్డి (Depa Bhaskar Reddy) కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌తో తనకున్న సన్నిహిత సంబంధాలు కలిసొస్తాయని అనుచరులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

అందెల శ్రీరాములు యాదవ్‌ (photo: facebook)

మహేశ్వరంలో బీజేపీ కూడా కొంత బలంగానే కనిపిస్తోంది. ఇప్పటికే.. తుక్కుగూడ మున్సిపాలిటీ పీఠాన్ని కమలం పార్టీ దక్కించుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో సరూర్‌ నగర్ డివిజన్‌ని కూడా బీజేపీ కైవసం చేసుకుంది. దాంతో.. రాబోయే ఎన్నికలపై బీజేపీ నేతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన అందెల శ్రీరాములు యాదవ్‌ (Andela Sriramulu Yadav)తో పాటు మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శ్రీరాములు యాదవ్ ఎప్పటి నుంచో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. ఇటీవలే వీరేందర్ (Tulla Veerender Goud) కూడా యాక్టివ్ అయ్యారు. అయితే.. గత ఎన్నికల్లో ఆయన ఉప్పల్ నుంచి పోటీ చేయడంతో.. ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

వీరేందర్ గౌడ్ (photo: facebook)

తాజా పరిస్థితులను చూస్తే.. మహేశ్వరంలో త్రిముఖ పోరు తప్పదనే చర్చ నడుస్తోంది. అన్ని అస్త్రాలతో అధికార పార్టీ రేసులో ముందున్నా.. ఎన్నికల నాటికి లోకల్ ఫ్యాక్టర్ ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందోనన్న ఆందోళన వెంటాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్ప.. మిగతా నాయకులంతా మహేశ్వరం నియోజకవర్గానికే చెందినవారు కావడం లోకల్‌గా హాట్ టాపిక్‌గా మారింది. దాంతో.. ఆవిడ మహేశ్వరం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. రాజకీయంగా పావులు కదుపుతున్నారు. అయితే.. మళ్లీ సబితకే టికెట్ ఇస్తారా? గ్రూపు తగాదాలతో.. కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారా? అన్నది ఆసక్తిగా మారింది.

Also Read: రాజేంద్రనగర్‌లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు.. టికెట్ రేసులో ఉన్న నేతలెవరు?

రంజిత్ రెడ్డి (photo: twitter)

చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా మహేశ్వరం గానీ, రాజేంద్రనగర్ నుంచి గానీ పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. నియోజకవర్గంలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టాలంటే.. కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారనే వాదన వినిపిస్తోంది. రంజిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే.. మంత్రి సబితను.. చేవెళ్ల ఎంపీగా బరిలో నిలిపే అంశాన్ని గులాబీ పార్టీ పరిశీలిస్తోందనే చర్చ సాగుతోంది. ఇక.. కాంగ్రెస్, బీజేపీల్లోనూ.. ఆశావహుల లిస్ట్ పెద్దదిగానే ఉండటంతో.. ఎవరిని బరిలో దించుతారన్నది కూడా ఆసక్తిగా రేపుతోంది. మొత్తంగా.. ఈసారి మహేశ్వరంలో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఇంట్రస్టింగ్‌ మారింది.

ట్రెండింగ్ వార్తలు