Bigg Boss : బిగ్‌బాస్ షోపై పోలీసులకు ఫిర్యాదు.. ఆ జంట హౌస్‌లో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని..
తాజాగా హిందీలో నడుస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 పై మహారాష్ట్ర శివసేన షిండే వర్గానికి చెందిన మనీషా కయాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Saketh U
- Published On : July 23, 2024 / 07:19 AM IST
Police Complaint filed on Hindi Bigg Boss OTT Season 3 due to Arman Malik Krithika Malik
Bigg Boss : ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 నడుస్తుంది. అనిల్ కపూర్ హోస్ట్ గా ఈ షో సాగుతుంది. ఇప్పటికే రెండు వారాలు దాటేసింది ఈ షో మొదలుపెట్టి. అయితే ముందు నుంచి బిగ్ బాస్ పై చాలామందిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి కంటెస్టెంట్స్ రొమాంటిక్ సీన్స్ చూపిస్తున్నారని, వైలెన్స్ ని పెంచే టాస్కులు చేయిస్తున్నారని, పిల్లలపై ఈ షో తీవ్ర ప్రభావం చూపిస్తుందని చాలామంది విమర్శలు చేస్తున్నారు.
గతంలో అనేకసార్లు వివిధ భాషల్లో బిగ్ బాస్ షోపై పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా హిందీలో నడుస్తున్న బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 పై మహారాష్ట్ర శివసేన షిండే వర్గానికి చెందిన మనీషా కయాండే పోలీసులకు ఫిర్యాదు చేసింది. మనీషా కయాండే ముంబయి నగర పోలీస్ కమిషనర్‌ని కలిసి బిగ్‌బాస్ షోపై ఫిర్యాదు చేసింది.
జులై 18న టెలికాస్ట్ చేసిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్ లో అర్మాన్ మాలిక్, కృతికా మాలిక్ జంట బెడ్‌రూమ్‌లో శ్రుతిమించి ప్రవర్తించిందని, దానిని బిగ్ బాస్ టెలికాస్ట్ చేసిందని ఫిర్యాదు చేసింది. ఈ షోలో పలువురు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, షో నిర్వాహకులు పట్టించుకోకుండా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారని, పిల్లలు కూడా ఈ షో చూస్తారని, ఇలాంటి అసభ్యకరమైన సీన్స్ వారిపై ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ షోని వెంటనే నిలిపేసేలా చర్యలు తీసుకోవాలని, సైబర్ క్రైమ్ చట్టాల కింద కేసు నమోదు చేయాలని మనీషా పోలీసులని డిమాండ్ చేసారు.
