Rajendranagar Assembly constituency: బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు.. టికెట్ రేసులో ఉన్న నేతలెవరు?

ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ అడుగులు ఎలా ఉండబోతున్నాయ్? విపక్షాల నుంచి టికెట్ రేసులో ఉన్న నేతలెవరు? ఈసారి.. రాజేంద్రనగర్‌లో కనిపించబోయే సీనేంటి?

Rajendranagar Assembly constituency – ground report ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ రాజకీయం.. రసవత్తరంగా మారింది. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో.. అధికార బీఆర్ఎస్ నేతల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. దాంతో.. గులాబీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీ కూడా రాజేంద్రనగర్‌లో గెలుపు జెండా ఎగరేసేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్‌లో నెలకొన్న గ్రూప్ పాలిటిక్సే.. తమకు కలిసొస్తాయని నమ్ముతున్నారు రెండు జాతీయ పార్టీల నాయకులు. అయితే.. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌ (Prakash Goud) అడుగులు ఎలా ఉండబోతున్నాయ్? విపక్షాల నుంచి టికెట్ రేసులో ఉన్న నేతలెవరు? ఈసారి.. రాజేంద్రనగర్‌లో కనిపించబోయే సీనేంటి?

ప్రకాశ్ గౌడ్ (Photo: Facebook)

గ్రేటర్ హైదరాబాద్‌లో.. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇక్కడే.. కేంద్ర వ్యవసాయ, అనుబంధ రంగాలకు చెందిన కీలక సంస్థలు కొలువుదీరాయ్. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో పాటు వెటర్నరీ యూనివర్సిటీ కూడా ఉన్నాయి. హైదరాబాద్ పాత బస్తీతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిసి ఉండే నియోజకవర్గం ఇది. గత ఎన్నికల్లో.. రాజేంద్రనగర్ పరిధిలో 4 లక్షల 40 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. ఈసారి.. ఆ సంఖ్య 5 లక్షలు దాటే అవకాశం ఉంది. ఒకప్పుడు.. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ (Chevella Assembly constituency) పరిధిలో ఉన్న ఈ ప్రాంతం.. 2009లో జరిగిన నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో.. రాజేంద్రనగర్ నియోజకవర్గంగా అవతరించింది. అప్పటి నుంచి.. ఇప్పటివరకు వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్. 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున గెలిచిన ప్రకాశ్ గౌడ్.. 2018 ఎన్నికల్లో మాత్రం గులాబీ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వరుసగా 3 సార్లు విజయం సాధించారంటే.. రాజేంద్రనగర్‌ సెగ్మెంట్‌పై ప్రకాశ్ గౌడ్ ఎంత పట్టు సాధించారో అర్థం చేసుకోవచ్చు.

కార్తీక్ రెడ్డి (Photo: Facebook)

మరో నాలుగైదు నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. అధికార పార్టీ నేతల్లోనే.. చాలా మంది రాజేంద్రనగర్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా.. టికెట్ రేసులో సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో పాటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి సబితా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి (Karthik Reddy) కనిపిస్తున్నారు. వీళ్లిద్దరూ.. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంపై పట్టు కోసం పావులు కదుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో.. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. రాజేంద్రనగర్ ప్రాంతం.. ఒకప్పటి చేవెళ్ల నియోజకవర్గంలోనిది కావడంతో.. మంత్రి సబితకు ఈ సెగ్మెంట్‌పై కొంత పట్టుంది. నియోజకవర్గానికి చెందిన నేతలంతా.. పార్టీలకు అతీతంగా.. పటోళ్ల ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటారు. ఈ పరిస్థితులను.. రాజకీయంగా మలచుకునే పనిలో సబిత తనయుడు కార్తీక్ రెడ్డి బిజీగా ఉన్నారు. నియోజకవర్గంలో.. తమ వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. చాన్స్ దొరికితే.. తన వర్గం నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఎమ్మెల్యే రేసులో తానూ ఉన్నాననే సంకేతాలిస్తున్నారు.

రంజిత్ రెడ్డి (Photo: Facebook)

మరోవైపు.. ఎంపీ రంజిత్ రెడ్డి కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో.. ఎక్కడ పోటీకి అవకాశం ఇచ్చినా.. తాను బరిలో దిగేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతాలిస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో కార్యకర్తలు.. ఏ చిన్న కార్యక్రమానికి ఆహ్వానించినా.. ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjith Reddy) వాలిపోతున్నారు. ఇక.. ఎంఐఎం ప్రభావం కూడా ఈ రెండు నియోజకవర్గాలపై ఉంటుంది. దాంతో.. ఆ పార్టీ మద్దతుదారులను కూడా ఎంపీ చేరదీస్తున్నారని సమాచారం. ఇక.. గులాబీ పార్టీతో.. ఎంఐఎంకు.. రాజకీయంగా అవగాహన ఉండటంతో.. అటు వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా.. ఇప్పటి నుంచే.. ముందు జాగ్రత్తగా.. ఎంపీ రంజిత్ పావులు కదుపుతున్నారనే చర్చ జరుగుతోంది.

Also Read: పెద్దపల్లి సెగ్మెంట్‌లో ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారు.. గెలిచే సత్తా ఉన్న లీడర్లు ఎవరు?

ఎంఐఎం ప్రభావం ఎక్కువే
రాజేంద్రనగర్‌లో.. బీఆర్ఎస్‌కు బలమైన క్యాడర్ ఉన్నా.. ఎంఐఎం ప్రభావం ఎక్కువే ఉంటుంది. అధికార పార్టీకి మిత్రపక్షంగానే ఉన్నా.. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థికి 46 వేలకు పైనే ఓట్లు వచ్చాయి. దాంతో.. ప్రధాన పార్టీలకు దీటుగా.. తాము ఉన్నామనే సంకేతాలిచ్చింది. అందువల్ల.. వచ్చే ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీ చేసే అవకాశాలున్నాయ్. బీఆర్ఎస్‌లో ఆశావహుల సంగతి ఎలా ఉన్నా.. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన ప్రకాశ్ గౌడ్.. మరోసారి టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. అధిష్టానం తనను కాదని.. కొత్త వారికి బీ-ఫాం ఇచ్చే అవకాశం లేదంటున్నారు. అంతేకాదు.. సిట్టింగ్‌లకే టికెట్లు కేటాయిస్తానని.. గులాబీ దళపతి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ గుర్తు చేస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరు
ఇక.. కాంగ్రెస్ నుంచి కూడా ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో పోటీ చేసిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ (Borra Gnaneshwar Mudhiraj)తో పాటు ముంగి జైపాల్ రెడ్డి (Mungi Jaipal Reddy).. హస్తం పార్టీ నుంచి టికెట్ రేసులో ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందనే అంచనాల్లో ఉన్నారు. గతంలో జ్ఞానేశ్వర్ ముదిరాజ్.. ప్రకాశ్ గౌడ్‌పై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బీసీ నేతగా.. నియోజకవర్గంపై పట్టున్న నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. మరో నేత జైపాల్ రెడ్డి.. రాజేంద్రనగర్‌లో నెలకొన్న పరిస్థితులు, సామాజికవర్గం నేపథ్యంలో.. పార్టీ తనకే అవకాశం ఇస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరి.. కొన్నాళ్లకే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఇప్పుడు.. హస్తం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. బీఆర్ఎస్‌లో ఉన్న గ్రూపులే.. తమకు కలిసొస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

తోకల శ్రీనివాస్ రెడ్డి (Photo: Twitter)

శ్రీనివాస్ రెడ్డికి బీజేపీ టిక్కెట్?
ఇక.. నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు ప్రధాన అనుచ‌రుడిగా కొనసాగిన తోకల శ్రీనివాస్ రెడ్డి (Thokala Srinivas Reddy).. ఎమ్మెల్యేతో విబేధించి బీజేపీలో చేరారు. తర్వాత.. కార్పొరేటర్‌గా గెలిచారు. ఇప్పుడు.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బీజేపీ నుంచి శ్రీనివాస్ రెడ్డి అభ్యర్థిత్వం దాదాపు ఖరారవుతుందనే వాదన.. కాషాయం శ్రేణుల్లో వినిపిస్తోంది. ఇందుకు.. కమలం పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న నేతలు పెద్దగా లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. అందువల్ల.. తోకల శ్రీనివాస్ రెడ్డికి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ దక్కడం ఖాయమని.. క్యాడర్‌లోచర్చ జరుగుతోంది. ఇక.. గత ఎన్నికల్లో ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసి.. 13 వేలకు పైనే ఓట్లు సాధించారు. దీనిని కూడా బీజేపీ నాయకత్వం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.

Also Read: కారు స్పీడ్‌కి బ్రేకులు పడతాయా.. దాస్యం వినయ్ భాస్కర్ గ్రాఫ్ ఎలా ఉంది?

అయితే.. అధికార పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటమే.. తమకు కలిసొస్తుందని.. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయ్. అయితే.. అధికార పార్టీ నుంచి ఎవరు బరిలో దిగినా.. వారితో పోటీ పడే స్థాయి నాయకులు.. విపక్ష పార్టీల్లో కనిపించడం లేదు. ఇదే.. బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో.. ఎంఐఎం.. అధికార పార్టీని కొంత కలవరపెడుతోందనే వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితుల మధ్య.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు