Sanathnagar Constituency: టీడీపీ చీల్చే ఓట్లపైనే గెలుపు అవకాశాలు.. సనత్‌నగర్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

సనత్‌నగర్‌లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు.

Sanathnagar Constituency Ground Report

Sanathnagar Assembly Constituency: హైదరాబాద్ నియోజకవర్గంలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం సనత్‌నగర్. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ (Talasani Srinivas Yadav)  ప్రాతినిధ్యం వహిస్తున్న సనత్‌నగర్‌లో ఒకప్పుడు కాంగ్రెస్, టీడీపీ హవా నడిచేది. రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీ టిక్కెట్‌పైనే గెలిచిన తలసాని తర్వాత సనత్‌నగర్‌ను బీఆర్‌ఎస్ అడ్డాగా మార్చారు. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి కూడా సనత్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. హేమాహేమీల రాజకీయానికి కేరాఫ్ అయిన సనత్‌నగర్‌లో ఈ సారి కూడా పోటీ రసవత్తరంగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే తలసాని మరోసారి పోటీ చేయడం ఖాయమవగా, ఆయన ప్రత్యర్థిగా మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి (Marri Shashidhar Reddy) బీజేపీ తరఫున బరిలో దిగనున్నారు. ఉద్దండ నేతల మధ్య జరిగే యుద్ధంలో విజేతలు ఎవరు? ఈసారి సనత్‌నగర్‌లో కనిపించబోయే సీనేంటి?

Talasani Srinivas Yadav

హైదరాబాద్ నగరంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, సనత్‌నగర్ రాజకీయం మాత్రం ఎప్పుడూ హాట్‌హాట్‌గానే ఉంటుంది. ముఖ్యనేతలు ప్రాతినిధ్యం వహించిన సనత్‌నగర్‌లో గత రెండు ఎన్నికల్లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గెలిచారు. ఆయన ప్రత్యర్థిగా తలపడిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి గత రెండు సార్లు కాంగ్రెస్ తరఫున పోటీ చేయగా, ఈ సారి బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. 1972లో సనత్‌నగర్ నియోజకవర్గం ఏర్పాటైంది. తొలిసారి ఆదం కృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఆ తర్వాత 1978లో ఎస్.రాందాస్ విజయం సాధించగా, 1993లో కాట్రగడ్డ ప్రసూన ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు.

1985లో టీడీపీ నేత శ్రీపతి రాజేశ్వర రావు, 1989లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి విజయం సాధించారు. చెన్నారెడ్డి సనత్‌నగర్ ఎమ్మెల్యేగా ఉండగానే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 1992 తొలిసారి గెలిచిన మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి.. 1994లో ఎన్టీఆర్ ప్రభంజాన్ని తట్టుకుని రెండోసారి విజయ దుందుబి మోగించారు. ఇక 1999లో టీడీపీ ఈ సీటును గెలుకుంది. 2004, 2009ల్లో మర్రి శశిధర్ రెడ్డి వరుసగా గెలిచి తన పట్టు నిలుపుకున్నారు. ఐతే తెలంగాణ ఆవిర్భావంతో ఇక్కడ కాంగ్రెస్ పట్టుకోల్పోయింది. శశిధర్‌రెడ్డి కూడా ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు.

భౌగోళిక పరంగా ఈ నియోజకవర్గం విచిత్రంగా విస్తరించి ఉంటుంది. ఎర్రగడ్డ నుంచి పద్మారావునగర్ గాంధీ ఆసుపత్రి వరకు సనత్‌నగర్ నియోజకవర్గమే. సనత్ నగర్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, బల్కంపేట డివిజన్లు, బేగంపేట, రాంగోపాల్ పేట్ డివిజన్లలో కొంత భాగం, జనరల్ బజార్, మోండా మార్కెట్, బన్సీలాల్ పేట్ సనత్‌నగర్ పరిధిలో ఉన్నాయి. సికింద్రాబాద్ ప్రాంతంలో ఎక్కువ భాగం ఈ నియోజకవర్గంలో ఉండటంతో తలసాని పట్టు నిలుపుకుంటున్నారు. సీఎం నివాసం ప్రగతి భవన్ కూడా ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తోంది. అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్‌లో ఎక్కువ స్టడీ సెంటర్, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ వేర్ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతం ఎప్పుడూ కొత్తవారితో కళకళలాడుతోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా మారింది.

Also Read: శేరిలింగంపల్లిలో త్రిముఖ పోరు తప్పదా.. బరిలోకి టీడీపీ అభ్యర్థి?

ఎప్పుడూ హడావుడిగా ఉండే సనత్‌నగర్‌లో రాజకీయం కూడా రసవత్తరంగా మారింది. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి కచ్చితంగా గెలుస్తానన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తలసానిని నియోజకవర్గం మార్చితే ఆయన కుమారుడికి ఇక్కడ టికెట్ ఇవ్వాలనే కండీషన్ పెడుతున్నారు. ఈ నియోజకవర్గంలో తలసాని కుటుంబంలో ఎవరు నిలబడినా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు బీఆర్‌ఎస్ నేతలు. తెలంగాణ చరిత్రకు నిదర్శనమైన మెట్ల బావి, సనత్నగర్ నాలాపై బ్రిడ్జి, బస్తీల్లో రోడ్లు, ఐడీ హెచ్ కాలనీలో డబల్ బెడ్‌రూం ఇళ్లు, రాణిగంజ్లో లేక్ వ్యూ డబుల్ బెడ్‌రూం ఇళ్లు తలసాని చేసిన కృషికి గుర్తుగా చెబుతున్నారు. ఇక ఈ నియోజకవర్గంలో తరచూ జరిగే అగ్ని ప్రమాదాలు మంత్రికి మైనస్‌గా మారుతున్నాయి. రద్దీ ప్రాంతాల్లో ఉన్న హోటళ్లు, హాస్టళ్లు, లాడ్జిల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సమీప ప్రాంతాల జనాలకు ప్రమాదంగా మారింది. ఇదే మంత్రి తలసానికి మచ్చ తెచ్చే అంశాలుగా మారనున్నాయని అంటున్నారు పరిశీలకులు.

Marri Shashidhar Reddy

ఇక ఇక్కడి నుంచి నాలుగు సార్లు గెలిచిన మర్రి శశిధర్ రెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. గెలిచిన మొదటి సారే ఆయన్ను మంత్రి పదవి వరించింది. కొద్ది నెలల కిందట శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరారు. నాలుగుసార్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన శశిధర్‌రెడ్డి ఈ సారి బీజేపీ తరపున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసత్వం, గతంలో ఓడినా ప్రజలకు అందుబాటులో ఉండటం శశిధర్‌రెడ్డికి కలిసొచ్చే అంశాలు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండగా, ఫతేనగర్, బల్కంపేటల్లో రెండు ఫ్లైఓవర్లు నిర్మించారు. ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించారు. నగరంలో మొదటిసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజి నిర్మాణం శశిధర్‌రెడ్డి హయాంలోనే జరిగాయని చెబుతున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ తరఫున పోరాడిన శశిధర్‌రెడ్డి ఈసారి బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు.

Akula Vijaya

ఇక శశిధర్‌రెడ్డికి పోటీగా బీజేపీ మహిళా నేత ఆకుల విజయ (Akula Vijaya) కూడా సనత్‌నగర్ టిక్కెట్ ఆశిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలైన విజయ మహిళల కోటాలో తన అభ్యర్థిత్వం పరిశీలించాల్సిందిగా హైకమాండ్‌ను కోరుతున్నారు. ఐతే శశిధర్ సీనియార్టీ.. టిక్కెట్ ఇస్తామనే హామీతోనే ఆయన బీజేపీలో చేరారని అంటున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తలసానితో తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ కూడా సిద్ధమవుతోంది. సెటిలర్లు ఓట్లు, గతంలో ఇక్కడి నుంచి గెలుపొందడం.. 2014లో కూడా ఓటర్లు టీడీపీకే పట్టం కట్టడంతో సనత్‌నగర్‌పై ఆశలు పెంచుకుంటున్నారు పసుపు పార్టీ నేతలు. ఇక్కడి నుంచి గతంలో కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేయగా, ఈ సారి తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ టిక్కెట్ ఆశిస్తున్నారు.

Also Read: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ టికెట్ ఈసారి ఎవరికి.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎవరు?

Dr Ravinder Goud

మరోవైపు తమ కంచుకోటను ఈ సారి ఎలాగైనా గెలుచుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. ఐతే సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరిన తరువాత ఇక్కడ హస్తం పార్టీ పరిస్థితి తలకిందులైంది. ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం వెతుకులాడుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. ఆయన ఎప్పుడూ ఇటువైపు రాకపోవడంతో తాజాగా.. డాక్టర్ రవీందర్‌గౌడ్ (Dr Ravinder Goud) పేరు ప్రచారంలోకి వచ్చింది. ఈయన సరోజినీదేవీ కంటి ఆసుపత్రి సుపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు. రవీందర్‌గౌడ్ కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Also Read: కాంగ్రెస్‌కు కొరుకుడు పడని కూకట్‌పల్లి.. బీఆర్‌ఎస్ ఎవరికి చాన్స్ ఇస్తుందో?

ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి తలసానిపై పోటీకి కాంగ్రెస్, బీజేపీతోపాటు టీడీపీ కూడా రెడీ అవుతుండటంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ చతుర్ముక పోటీ జరిగే చాన్స్ ఉంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు. టీడీపీ చీల్చే ఓట్లే విజేతలను నిర్ణయించే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు అందుకు తగ్గట్లు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

ట్రెండింగ్ వార్తలు