కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల చిచ్చు.. ఆగ్రహంతో ఊగిపోతున్న పార్టీ మారిన ఎమ్మెల్యేలు..!

పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్‌లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.

Gossip Garage : టార్గెట్ 26… ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు. బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మేము తలచుకుంటే గులాబీ గల్లంతే…. బడ్జెట్ సమావేశాలకు ముందే కారు ఖాళీ అవుతుందని చెప్పిన కాంగ్రెస్ నాయకులు… ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. 26 మంది ఎమ్మెల్యేలకు వల వేస్తే.. పట్టుమని పది మంది మాత్రమే కాంగ్రెస్ గాలానికి చిక్కారు. మరి మిగతా ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఆకర్ష్ మంత్రం ఫలించలేదా? దీనికి సమాధానం ఎవరు చెబుతారని చూస్తుంటే… ఎస్.. నేనున్నా అంటూ అసలు విషయం చెప్పేశారు సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… కాబోయే మంత్రిని…తలుచుకుంటే తానే సీఎం అంటూ చెప్పే కోమటిరెడ్డి… దీనిపై చెప్పిన లెక్కేంటి? ఆకర్ష్ ఎందుకు ముందుకు వెళ్లలేదు.

కలకలం రేపుతున్న రాజ్ గోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..
ప్రభుత్వం సుస్థిరత కోసమంటూ కాంగ్రెస్ చేపట్టిన ఎమ్మెల్యేల ఆకర్ష్‌కు బ్రేక్ పడింది. 26 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనే లక్ష్యంతో హస్తం పార్టీ పావులు కదపగా.. కేవలం 10 మంది దగ్గరే ఆపరేషన్ ఆకర్ష్ నిలిచిపోయింది. దీనికి కారణాలేంటి అన్న విషయమై రకరకాల చర్చ జరుగుతుండగా, కాంగ్రెస్ సీనియర్ నేత… మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. మీడియా చిట్‌చాట్ లో ఆయన ఆఫ్ ది రికార్డుగా చెప్పిన మాటలు…. అటు తిరిగి.. ఇటు తిరిగి బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు వరకు చేరాయి. దీంతో ఇదే టాపిక్‌ను హాట్‌ హాట్‌గా మార్చేశారు అడ్వకేట్ కం పొలిటీషియన్ రఘునందన్‌రావు.

కేవలం ఐదారు కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నారట..!
ఇంతకీ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యల సారాంశం ఏంటంటూ ఇటు కాంగ్రెస్.. అటు బీఆర్ఎస్, బీజేపీల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు తాము కేసీఆర్ ఇచ్చినంత మొత్తం ఇవ్వలేకపోయామని.. అందుకే ఎక్కువ మంది తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదంటూ లోగుట్టు బయటపెట్టేశారు రాజగోపాల్‌రెడ్డి. గతంలో కేసీఆర్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునేందుకు 15 నుంచి 20 కోట్ల రూపాయలు ఇచ్చేవారని… తమ పార్టీ వద్ద అంత డబ్బు లేనందున కేవలం ఐదారు కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని తేల్చేశారు. మీడియా చిట్‌చాట్ లో ఆఫ్ ద రికార్డుగా ఆయనీ వ్యాఖ్యలు చేయడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంట పుట్టిస్తున్న వ్యాఖ్యలు..
కానీ, రాజగోపాల్‌రెడ్డి మాటలు కాస్తా.. బీజేపీ ఫైర్‌ బ్రాండ్ రఘునందన్‌రావు వరకు వెళ్లడంతో ఆయన ఈ అంశంపై బహిరంగ విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు తెరతీసిందని.. అనైతికంగా వ్యవహరిస్తోందని దుమ్మెత్తిపోస్తున్నారు రఘునందన్‌రావు. ఈయన విమర్శలు ఇలా ఉంచితే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు.. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు మంట పుట్టిస్తున్నాయట.

కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తిగా లేరా? ప్యాకేజ్ ఓకే కాలేదా?
వాస్తవానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునే దిశగా… కాంగ్రెస్ పావులు కదిపిందంటున్నారు. బీఆర్ఎస్‌లోని చాలా మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలను మాత్రమే కలిగివున్న కాంగ్రెస్… బీఆర్ఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసింది. వీరిని హస్తం గూటికి తెచ్చి… జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి హైదరాబాద్ నగరంలో బలపడాలని భావించిందంటున్నారు. కానీ, జీహెచ్ఎంసీలో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన వారు ఎవరూ కాంగ్రెస్‌లో చేరడానికి ఆసక్తిగా లేరా? లేకపోతే రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్లు ప్యాకేజ్ ఓకే కాలేదా? అన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది.

పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్..
నిజానికి పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. ఉత్తర తెలంగాణకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలతోపాటు.. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, జీహెచ్ఎంసీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపింది. ఐతే ఉత్తర తెలంగాణ నుంచి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నగరంలోని రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య మాత్రమే కాంగ్రెస్ గూటికి చేరారు.

పార్టీ మారిన వారికి ప్యాకేజ్ ఇచ్చినట్లేనా?
మొత్తం పది మందిలో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు.. తర్వాత ఐదుగురు పార్టీ మారారు. ఐతే ఇలా పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పట్టు బడుతుండటం… న్యాయపోరాటం కూడా చేస్తుండటంతో బీఆర్ఎస్ఎల్పీ విలీనం చేసుకుని ఎమ్మెల్యేలను రక్షించుకోవాలని చూసింది కాంగ్రెస్ నాయకత్వం. ఐతే రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్లు ప్యాకేజ్ కుదరకే ఎమ్మెల్యేలు రాలేదంటే…. ఉన్నవారికి ప్యాకేజ్ ఇచ్చినట్లు అర్థం చేసుకోవాల్సి వుంటుందంటున్నారు. దీనివల్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కుడితిలో పడ్డ ఎలుకలా పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి..!
రాజగోపాల్‌రెడ్డి యథాలాపంగా వ్యాఖ్యానించినప్పటికీ… బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు… దీన్నో ఇష్యూ చేయాలని చూస్తుండటం తెలంగాణ రాజకీయాల్లో హీట్‌ పుట్టిస్తోంది. ఈ సరికొత్త వివాదానికి రాజగోపాల్‌రెడ్డి ఎలా ఫుల్‌స్టాప్ పెడతారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏదేమైనా కోమటిరెడ్డి వ్యాఖ్యలతో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందనే టాక్ నడుస్తోంది. అధికారంలో ఉన్న పార్టీలో చేరితే.. పనులు సవ్యంగా జరుగుతాయనుకుంటే.. పరిస్థితి ఇలా అయిపోయిందంటూ వారు కనిపించిన వారి వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తారా?
నియోజకవర్గం అభివృద్ధి కోసం పార్టీ మారామని తాము చెప్పుకుంటుంటే.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం 5, 10 కోట్లకు కొనుగోలు చేశామని చెప్పడంతో వారంతా ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. తాము అమ్ముడుపోయినట్లు కోమటిరెడ్డి మాట్లాడటంపై ఒకరిద్దరు పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీలో చేరాలనుకుంటున్న ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఈ వ్యాఖ్యలతో వెనుకడుగు వేస్తారేమోననే టాక్ కాంగ్రెస్‌లో నడుస్తోందట. ఏదేమైనా ఈ వ్యవహారానికి ఎలా ముగింపు పడుతుందో చూడాలి.

Also Read : కీలక పదవులను పెండింగ్‌లో పెట్టిన రేవంత్‌ ప్రభుత్వం.. కారణం అదేనా?

ట్రెండింగ్ వార్తలు