కీలక పదవులను పెండింగ్‌లో పెట్టిన రేవంత్‌ ప్రభుత్వం.. కారణం అదేనా?

ఇప్పటికే 8 నెలల సమయం ముగిసిందని.. ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతోనే పార్టీ కాలక్షేపం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.

కీలక పదవులను పెండింగ్‌లో పెట్టిన రేవంత్‌ ప్రభుత్వం.. కారణం అదేనా?

Gossip Garage : తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల కోసం మరికొన్నాళ్లు నిరీక్షించాల్సిందేనా..! మంత్రివర్గ విస్తరణ, పీసీపీ సారథి నియామకాన్ని నిరవధిక వాయిదా వేసిన కాంగ్రెస్‌ అధిష్టానం… కీలకమైన డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ విప్‌ పదవులను ఎందుకు భర్తీ చేయడం లేదు. ఆయా పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు మరికొన్నాళ్లు వేచి చూడాల్సిందేనా? డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ పదవులకూ మంత్రివర్గ విస్తరణకు లింకుపెట్టడమే.. ఆ పోస్టులూ భర్తీ అవ్వలేదా? తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఏమంటున్నారు. ఆశావహుల పరిస్థితి ఏంటి?

విలువైన సమయం కోల్పోతున్నామని సీనియర్ల ఆవేదన..
తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావస్తోంది. పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీలో పదవుల కోసం చాలా మంది నాయకులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అందుకే నామినేటెడ్‌ పోస్టులను కూడా ఎన్నడూ లేనట్లు వేగంగా భర్తీ చేసింది సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌. ఐతే… కొన్ని విషయాల్లో స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం… ముఖ్యమైన అంశాలపై ఎడతెగని జాప్యం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రమంత్రి మండలిలో 18 మందికి అవకాశం ఉండగా, ప్రస్తుతం సీఎంతోసహా 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరుగురికి చాన్స్‌ ఉన్నా… మంత్రివర్గాన్ని విస్తరించకుండా పెండింగ్‌లో పెట్టారు. ఇక మంత్రి మండలి విస్తరణనే కారణంగా చూపి పీసీసీ చీఫ్‌ను నియమించలేదు. మరోవైపు అసెంబ్లీలో కీలకమైన డిప్యూటీ స్పీకర్‌, చీఫ్‌ పదవులను కూడా భర్తీ చేయకపోవడంతో విలువైన సమయం కోల్పోతున్నామని సీనియర్‌ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ రెండు పదవులపై ఎమ్మెల్యేల ఆశలు..
పదేళ్ల తర్వాత ఎంతో కష్టపడి అధికారం సాధిస్తే… అధిష్టానం జాప్యం చేయడం వల్ల ఆ అధికారాన్ని అనుభవించలేకపోతున్నామని ఎక్కువ మంది నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ స్పీకర్‌, చీఫ్ విప్‌ లేకుండానే రెండు అసెంబ్లీ సెషన్లు ముగియడం కూడా వారి అసంతృప్తికి కారణమవుతోంది. ఈ రెండు పదవులపై చాలా మంది ఎమ్మెల్యేలు ఆశలు పెట్టుకున్నారు. ఐతే సీఎం రేవంత్‌రెడ్డి కానీ, పార్టీ హైకమాండ్‌ కానీ ఈ విషయంపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదని వాపోతున్నారు ఆశావహులు. ఈ రెండు పోస్టులను మంత్రి మండలి విస్తరణకు లింకు చేసి పెండింగ్‌లో పెట్టడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీనియర్‌ నేతలు.

పదవులు 6.. రేసులో 12 మంది..
ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణలో ఆరుగురికి అవకాశం ఉంది. కానీ ఆశావహులు మాత్రం డజను మంది ఉన్నారు. మంత్రివర్గ విస్తరణకు ప్రధానంగా సామాజిక సమీకరణాలు అడ్దొస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం క్యాబినెట్‌లో లంబాడ సామాజికవర్గానికి అవకాశం దక్కలేదు. లంబాడ సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పోటీ పడుతున్నారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒకరికి అవకాశం ఇస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగా రెడ్డి జిల్లాలకు కూడా అవకాశం దక్కలేదు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి వంటి సీనియర్‌లు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు, ఉమ్మడి నల్లగొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేసులో ఉన్నారు.

సీనియర్లకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు..
మంత్రివర్గంలో అవకాశం దక్కని నేతలకు రాజ్యాంగ బద్ధమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్‌గా అవకాశం ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్‌. కొందరు సీనియర్లకు, ముఖ్యంగా అవగాహన ఉన్న నేతలకు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పోస్టులను ఇవ్వాలని చూస్తుందట. రంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ మల్ రెడ్డి రంగా రెడ్డి, రామ్మోహన్ రెడ్డిల్లో ఒకరికి మంత్రి పదవి, ఇంకొకరి డిప్యూటీ స్పీకర్‌ లేదా చీఫ్‌ విప్‌ ఇవ్వాలనే ప్రతిపాదన ఉందంటున్నారు. అదేవిధంగా లంబాడ సామజికవర్గం నుంచి మంత్రి వర్గంలో స్థానం ఆశిస్తున్న బాలూ నాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌ చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదన పరిశీలిస్తోందంటున్నారు. మరోవైపు సామాజిక సమీకరణలు కుదరకపోతే సీనియర్ నేతలు ప్రేమ్‌సాగర్ రావు, సుదర్శన్ రెడ్డిలలో ఒకరికి ఈ రెండు పోస్టుల్లో ఏదో ఒకటి కట్టబెట్టాలని చూస్తోందంటున్నారు.

మొత్తానికి పదవుల భర్తీకి పేర్ల పరిశీలనతోనే పార్టీ కాలక్షేపం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు. ఇప్పటికే 8 నెలల సమయం ముగిసిందని.. ఇంకా ఆలస్యం చేయడం వల్ల పార్టీకి నష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు