ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ముగ్గురు బలమైన నేతలు పార్టీలో కొనసాగడం వల్ల... పైకి అంతా ఒకే అన్నట్లు కనిపిస్తున్నా... లోలోన మండుతున్న అగ్నిపర్వతంలా నేతలు రగిలిపోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

Gossip Garage : ఒకే వరలో రెండు కత్తులు ఇముడుతాయా? అంటే పటాన్‌చెరు పాలిటిక్స్‌పై ఓ లుక్కేయాల్సిందే… ఇక్కడ ఒకటి రెండు కాదు.. మూడు కత్తులు ఒకే ఒరలో చేరాయి… అదేనండి ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులు ఒకే గూటికి చేరారన్నమాట.. ఒకరితో ఒకరు పోటీ పడి రాజకీయంగా పైచేయి సాధించాలని చూసిన ఆ ముగ్గురు నేతలు… చేయీ.. చేయీ కలపడం రాజకీయంగా ఇంట్రస్టింగే.. కానీ, ఆ నేతలు మనుసులు కలిశాయంటారా? ఒకరంటే ఒకరికి గిట్టని నేపథ్యమున్న ముగ్గురు లీడర్లు ఎలా సర్దుకుపోతున్నారు?

పటాన్‌చెరుపై కాంగ్రెస్ స్పెషల్‌ ఆపరేషన్‌..
తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాల్లో వెరీ వెరీ ఇంట్రస్టింగ్‌గా మారింది పటాన్‌చెరు నియోజకవర్గం. హైదరాబాద్‌ నగరానికి ఆనుకుని ఉండే పటాన్‌చెరు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గం. మినీ భారత్‌గా భావించే పటాన్‌చెరులో పట్టుకోసం అధికార కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ… నువ్వానేనా అన్నట్లు తలపడ్డాయి. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను ఆదరించిన పటాన్‌చెరు ఓటర్లు… లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీకి జైకొట్టారు… ఈ పరిస్థితులు రాష్ట్రంలో అధికారం చలాయిస్తున్న కాంగ్రెస్‌కు ఏమాత్రం రుచించలేదంటున్నారు. దీంతో పటాన్‌చెరుపై స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టింది హస్తం పార్టీ…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడంలో సక్సెస్..
అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే పటాన్‌చెరుపై స్పెషల్‌ స్కెచ్‌ వేసినా… నియోజకవర్గంలో స్ట్రాంగ్‌గా ఉన్నా బీఆర్‌ఎస్‌ మాజీ లీడర్‌.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అడ్డుపడటం వల్ల కాంగ్రెస్‌ ప్లాన్స్‌ ఏవీ వర్కౌట్‌ కాలేదు. దీంతో కాంగ్రెస్‌ తన ఎదుగుదలకు అడ్డుగా ఉన్న ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపైనే వల వేసింది. స్థానిక ఎన్నికల్లోగా పటాన్‌చెరులో కాంగ్రెస్‌ బలోపేతమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ అధిష్టానం… బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను చేర్చుకోవడంలో సక్సెస్‌ అయింది… ఐతే ఇక్కడే కొత్త చిక్కులు మొదలైనట్లు చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

ప్రత్యర్థులుగా ఇన్నాళ్లు పోరాడిన ఆ ఇద్దరి నేతల పరిస్థితి ఏంటి?
పటాన్‌చెరులో కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌తో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా… ఆయనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఇన్నాళ్లు పోరాడిన ఇద్దరి నేతల పరిస్థితి ఏంటన్న చర్చ ప్రారంభమైందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ నుంచి కాట శ్రీనివాస్‌గౌడ్‌ పోటీ చేశారు. ఈయన ఎప్పటి నుంచో కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే చేరికతో ఆయన భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఓట్లు చీలి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలుపు..
ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు కూడా ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే ఉన్నారు. వాస్తవానికి నీలం మధు అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చారు. టికెట్‌ హామీతో ఆయన పార్టీలో చేరగా, కాంగ్రెస్‌ ముందుగా నీలం మధుకే టికెట్‌ ఇచ్చింది. ఐతే మధు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్‌గౌడ్‌ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈయనకు మద్దతుగా రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ నిలవడంతో మధుకు ప్రకటించిన టికెట్‌ వెనక్కి తీసుకుంది కాంగ్రెస్‌. దీంతో కాంగ్రెస్‌ తనకు ద్రోహం చేసిందని బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేశారు నీలం మధు. ఇలా ముగ్గురు పోటీ పడటంతో ఓట్లు చీలి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన మహిపాల్‌రెడ్డి విజయం సాధించారు.

పటాన్ చెరు కాంగ్రెస్ లో మూడో వర్గం…
ఇక ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో నీలం మధును కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి మెదక్‌ లోక్‌సభ టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన మధు.. స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆయన ఓటమికి పటాన్‌చెరులో కాంగ్రెస్‌ శ్రేణులు కూడా కారణమనే అభిప్రాయం ఉంది. ఓ వర్గం పనిచేయకపోవడం వల్లే నీలం మధుకు సొంత నియోజకవర్గంలో ఆధిక్యం రాలేదంటున్నారు. దీంతో నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య సహకారం లేకపోవడంతోనే ఓటమి చెందినట్లు గుర్తించింది కాంగ్రెస్‌. మరోవైపు రాష్ట్రస్థాయి అవసరాలు, ఇతర కారణాల వల్ల ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిని చేర్చుకుంది. దీంతో ఇన్నాళ్లు రెండు వర్గాలుగా ఉన్న పటాన్‌చెరు కాంగ్రెస్‌లో ఇప్పుడు మూడో వర్గం తయారైందంటున్నారు.

మహిపాల్ రెడ్డితో ఆ ఇద్దరు సఖ్యతగా ఉంటారా?
ఇలా ముగ్గురు ప్రత్యర్థులు ఓకే పార్టీలో చేరడం… ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పటి నుంచే ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి.. నీలం మధుకి పొసిగేది కాదు. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరూ కాంగ్రెస్‌లో సఖ్యతతో వ్యవహరిస్తారా? అనేది సందేహస్పందంగా మారిందంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ సీనియర్ నేత కాటా శ్రీనివాస్‌ తోనూ ఎమ్మెల్యేకు సయోధ్య కుదిరినట్లు కనిపించడం లేదంటున్నారు. ఇటీవల రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరవ్వగా, నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ డుమ్మా కొట్టారు. ఇక అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే పార్టీలో చేరినప్పుడు కూడా కాటా శ్రీనివాస్ గౌడ్ వెళ్లలేదు. ఐతే ఇదే సమయంలో ఇన్నాళ్లు బద్ధ శత్రువులుగా వ్యవహరించిన నీలం మధు, మహిపాల్ రెడ్డి ఒకే వేదికపై కనిపించడంతో కాంగ్రెస్‌ శ్రేణులు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నాయి.

మండుతున్న అగ్నిపర్వతంలా రగిలిపోతున్న నేతలు..
మొత్తానికి పటాన్‌చెరు కాంగ్రెస్‌లో అయోమయ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముగ్గురు బలమైన నేతలు పార్టీలో కొనసాగడం వల్ల… పైకి అంతా ఒకే అన్నట్లు కనిపిస్తున్నా… లోలోన మండుతున్న అగ్నిపర్వతంలా నేతలు రగిలిపోతున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ ముగ్గురు నేతల మధ్య అధిష్టానం ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఆసక్తిరేపుతోంది.

Also Read : షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?