Best Govt Saving Schemes : బ్యాంకు FDల కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చే ప్రభుత్వ పథకాలివే.. ఎందులో వడ్డీ ఎంతంటే?
Best Government Saving Schemes : పెట్టుబడి అనగానే చాలా మంది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) వైపు చూస్తుంటారు. అయితే, FDల కన్నా ఎక్కువ వడ్డీ రేట్లను అందించే అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. మంచి రాబడిని అందించే ప్రభుత్వ పథకాల గురించి ఇప్పుడు చూద్దాం..
Best Government Saving Schemes
- 2026లో బ్యాంకు FDలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారా?
- బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజట్ల కన్నా అద్భుతమైన ప్రభుత్వ పథకాలు
- ఇతర FD పథకాల్లో వచ్చే రాబడి కన్నా ఎక్కువ మొత్తంలో రాబడి
- ఏ ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే?
Best Government Saving Schemes : పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? ఎందులో పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడి తక్కువ రిస్క్ ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? మీకోసం అద్భుతమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలావరకూ బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజట్లు చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందని భావిస్తుంటారు. కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు)పై ఇన్వెస్ట్ చేస్తుంటారు.
కానీ, వాస్తవంగా పరిశీలిస్తే.. బ్యాంకు FDలపై వడ్డీ రేట్లు అంత ఆకర్షణీయంగా లేవు. చాలా మంది తక్కువ సమయంలో అధిక లాభాల కోసం తమ డబ్బును ఇతర రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో పెడతారు. అలా కాకుండా మీరు బ్యాంకు FDల కన్నా ఎక్కువ రాబడిని అందించే ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. మీ డబ్బుకు వంద శాతం భద్రత ఉంటుంది. ఇంతకీ ఏయే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
సుకన్య సమృద్ధి యోజన :
సుకన్య సమృద్ధి యోజన పథకం అనేది ఆడపిల్లల భవిష్యత్తు కోసం అందించే ప్రభుత్వ పథకాలలో ఒకటి. ఈ పథకం కింద మీ కుమార్తె విద్య లేదా వివాహం కోసం భారీ మొత్తంలో డబ్బులను పెట్టుబడిగా పెట్టవచ్చు. ఈ పథకం 8.20శాతంగా వడ్డీ రేటును అందిస్తుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS):
ఈ పథకం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం తీసుకొచ్చారు. బ్యాంక్ FDల కన్నా ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లను అందిస్తుంది. త్రైమాసికానికి ఒకసారి చెల్లిస్తుంది. ఇక్కడ కూడా ప్రభుత్వం సంవత్సరానికి 8.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లు (RBI FRSB) :
ప్రస్తుతం వడ్డీ రేటు 8.05 శాతం వరకు ఉంది. కాలానుగుణంగా వడ్డీ రేటు మారుతుంది. మీరు ఆర్బీఐ రిటైల్ యాప్ ద్వారా ఈజీగా కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఎఫ్ డీ మాదిరిగానే చాలా సేఫ్. కొంచెం ఎక్కువ రాబడిని అందిస్తాయి.
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS):
అద్భుతమైన ప్రభుత్వ పదవీ విరమణ పథకం. మీ డబ్బును బాండ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతుంది. 8శాతం వరకు దీర్ఘకాలిక రాబడిని అందిస్తుంది. 60 ఏళ్ల వయస్సు తర్వాత పెన్షన్ను అందిస్తుంది. ముఖ్యంగా, భారీ పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) :
మీరు 5 ఏళ్ల కాలానికి పెట్టుబడి పెట్టాలనుకుంటే.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ బెస్ట్ ఆప్షన్. 7.70శాతం వడ్డీ రేటును అందిస్తుంది. మీరు కేవలం రూ. 1,000తో ప్రారంభించి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ఆదా చేసుకోవచ్చు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) :
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేది పాపులర్ లాంగ్ టైమ్ సేవింగ్స్ స్కీమ్లలో ఒకటి. ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటును 7.10 శాతంగా అందిస్తుంది. ఈ పథకం టెన్యూర్ 15 ఏళ్లు, పెట్టుబడులు పన్ను మినహాయింపు పొందుతాయి. కాలక్రమేణా భారీ మొత్తంలో రాబడి సంపాదించుకోవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర (KVP):
కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి మొత్తం 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. ఈ డబ్బు రెట్టింపు పథకం 7.5శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
