CM Revanth Reddy : పుట్టినరోజు నాడు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి.. ఎమోషనల్ స్పీచ్.. కేటీఆర్, కవితపై ఆసక్తికర కామెంట్స్
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటిస్తున్నారు. రెండోరోజు పర్యటనలో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా హకీంపేటలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భవనాలకు ప్రారంభోత్సవాలు చేశారు. కాగా.. ఇవాళ సీఎం రేవంత్ పుట్టినరోజు కావడంతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. హకీంపేటలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.
ఆడబిడ్డలతో నా పుట్టినరోజును జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదమే నా బలం. నాకు ఎలాంటి కోరికలు లేవు. గొప్ప పదవులకోసం ఆశించట్లేదు. నా జీవిత లక్ష్యం ఒక్కటే. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం. అందుకు నా సర్వశక్తుల ధారపోస్తాను అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు. ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివించండి. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడొద్దు. మీ ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివిస్తామని నా పుట్టినరోజున మాట ఇవ్వండి. ఆడబిడ్డల చేతిలో పెత్తనం ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మహిళలు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ భాగస్వాములుగా ఉన్నారు. మహిళా సంఘాలకు రూ.79వేల కోట్ల రుణాలను ఇచ్చాం. మహిళా రుణాలకు రూ.1900 కోట్ల వడ్డీ చెల్లించాం. ఇంటి పట్టా మహిళలకే ఇచ్చాం. మహాలక్ష్మీ పథకానికి ఇప్పటిదాకా రూ.13వేల కోట్లు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళల ఆర్థికాభివృద్ధికి మరిన్ని పథకాలను అమల్లోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నవంబర్ 19న కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
పదేళ్ల కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారు. తెలంగాణ ప్రజలకోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నాం. పదేళ్ల పాలనలో వాళ్లు ఏం చేశారో.. మేం మూడేళ్లలో ఏం చేశామో ప్రజలే ఆలోచించాలని సీఎం రేవంత్ ప్రజలను కోరారు.
కేటీఆర్ సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఆమెను ఇంటి నుంచి గెంటేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. చెల్లి ఏదైనా తప్పు చేసినా క్షమించి అక్కున చేర్చుకునేవారే అన్న.. కేటీఆర్ మాత్రం జైలు నుంచి వచ్చిన చెల్లిని బయటకు పంపించేశారు. కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేని వారు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
