BJP Telangana: అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని ముఖ్యనేతలంతా అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీలు పడుతుండే.. బీజేపీలో మాత్రం సీనియర్లను పోటీ చేయాలని ఒత్తిడి చేయాల్సి వస్తోంది.

telangana bjp senior leaders not interest to contest assembly

BJP Telangana senior leaders : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుతామని ప్రకటించిన బీజేపీ అభ్యర్థుల ఎంపికలో ఆపసోపాలు పడుతున్నట్లు కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రెండూ అభ్యర్థుల ఎంపికను ఓ కొలిక్కి తీసుకువచ్చి.. ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుండగా.. బీజేపీ ఇంకా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన దశలోనే ఉంది. ఆశావహుల నుంచి ఆరు వేల దరఖాస్తులు అందుకున్న బీజేపీ.. అందులో సమర్థులైన నేతలెవరో తేల్చలేక.. సతమతమవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల్లోని ముఖ్యనేతలంతా అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీలు పడుతుండే.. బీజేపీలో మాత్రం సీనియర్లను పోటీ చేయాలని ఒత్తిడి చేయాల్సి వస్తోంది. ఒకరిద్దరు తప్పా చాలామంది నేతలు అసెంబ్లీ బదులు లోక్ సభ బరిలో దిగేందుకే ఆసక్తిగా ఉన్నారు. అందుకే రోజులు గడుస్తున్నా, నానిమేషన్లకు సమయం సమీపిస్తున్నా బీజేపీ జాబితాపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

తెలంగాణలో ఆల్టర్నేట్ సర్కార్ తెస్తామంటూ ప్రతి వేదికపైనా ప్రచారం చేస్తూ హడావుడి చేసిన కమలదళం.. సమయం వచ్చేసరికి తటాపటాయించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసెంబ్లీకి పోటీ చేయాలంటూ ఆర్నెల్లుగా సీనియర్లను పార్టీ హైకమాండ్ ఒత్తిడి చేస్తున్నా ఏ ఒక్కరూ సై అనడం లేదట. ప్రతి ఒక్కరూ తాము పార్లమెంట్ కే పోటీ చేస్తామంటూ అసెంబ్లీ సమరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో అధిష్టానానికి సీనియర్లను ఒప్పించి బరిలో దింపడమే సవాల్ గా మారుతోంది.

రాష్ట్ర బీజేపీలో ముఖ్యనేతలైన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తిచూపడం లేదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు వీలుగా వీరిద్దరికి అధిష్టానమే వెసులుబాటు కల్పించిందని చెబుతున్నారు. ఇక బీజేపీలో ఐకానిక్ లీడర్లుగా చెప్పుకునే ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు వారివారి నియోజకవర్గాల నుంచి పోటీకి సిద్దమౌతున్నారు. ఎంపీలు సోయం బాబూరావు, ధర్మపురి అరవింద్ సైతం అసెంబ్లీ బరిలో దిగేందుకు రెడీ అవుతున్నారు. అయితే మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయశాంతి, వివేక్, జితేందర్ రెడ్డి, చాడ సురేశ్ రెడ్డి తదితరులు అసెంబ్లీ బరిలో దిగేందుకు ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు.

Also Read: ఈసారి వెనక్కి తగ్గొద్దు.. పవన్ కల్యాణ్ కు తెలంగాణ జనసేన నేతల విజ్ఞప్తి

సీనియర్ నాయకులు పోటీ చేస్తే తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసిందనే అభిప్రాయం కల్పించొచ్చని అధిష్టానం భావిస్తే.. సీనియర్ల ఆలోచనలు మరోలా ఉండటంతో హైకమాండ్ ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాములమ్మను కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పోటీకి దింపేందుకు అధిష్టానం ప్రయత్నిస్తుండగా.. ఆమె మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తానంటూ తేల్చిచెప్పేసారట. ఇక కొండా విశ్వేశ్వర్ రెడ్డిని తాండారు నుంచి.. వివేక్ ను ధర్మపురి నుంచి పోటీ చేయించాలని ప్రయత్నించగా.. వారు చేవెళ్ల, పెద్దపల్లి పార్లమెంట్ స్థానాలనుండి పోటీ చేస్తామంటూ తప్పించుకుంటున్నారు. దీంతో అసెంబ్లీ బరిలో బీజేపీకి సెకండ్ క్యాడర్ నాయకులే పోటీదారులయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Also Read: వైఎస్ షర్మిల పార్టీకి అభ్యర్థుల కొరత, ఈ దుస్థితికి కారణం అదేనా?

ట్రెండింగ్ వార్తలు