Telangana Elections 2023: ఏడుగురు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకుండా కేసీఆర్ ఇంత పెద్ద షాక్ ఎందుకు ఇచ్చారో తెలుసా? 

పేరుకే తొలి జాబితా అయినా 119 మంది అభ్యర్థుల్లో 115 మంది అభ్యర్థుల పేర్లు వచ్చేశాయి. కామారెడ్డి నుంచి పోటీ చేయకుండా.. కేసీఆర్ కోసం గంప గోవర్ధన్ తప్పుకున్నారు.

CM KCR

Telangana Elections 2023 – BRS: తెలంగాణ(Telangana)లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల కంటే ముందు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వేదికగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. పేరుకే తొలి జాబితా అయినా 119 మంది అభ్యర్థుల్లో 115 మంది అభ్యర్థుల పేర్లు వచ్చేశాయి.

సిట్టింగుల్లో ఏడుగురికి అవకాశం దక్కలేదు. వేములవాడ, బోధ్, ఉప్పల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, కామారెడ్డి, వైరా సిట్టింగులకు టికెట్ ఇవ్వట్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అలాగే, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యకూ టికెట్ దక్కలేదు. కామారెడ్డి నుంచి గంప గోవర్ధన్ టికెట్ ను కేసీఆర్ కోసం ఇచ్చేశారని చెప్పుకోవాలి. నిజానికి టికెట్ దక్కించుకోని ఎమ్మెల్యేలు మొత్తం ఎనిమిది మంది. వారిలో షాక్ తగిలింది ఏడుగురికే. గంప గోవర్ధన్ కు భవిష్యత్తులో మరో పదవి ఇచ్చే అవకాశం ఉంది.

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమేని రమేశ్‌ గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వివాదాల్లో చిక్కున్నారు. పౌరసత్వం వివాదంలో చెన్నమనేని రమేశ్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. భారత పౌరసత్వానికి రమేశ్ అనర్హుడని కేంద్ర హోంశాఖ గతంలో స్పష్టం చేసింది. దీంతో ఈ సారి వేములవాడ టికెట్ చెన్నమేని రమేశ్‌కు రాకపోవచ్చనే ప్రచారం ముందు నుంచీ జరిగింది. అదే నిజమైంది. ఆయన స్థానంలో విద్యా సంస్థల అధిపతి చెలిమడ నరసింహారావుకి కేసీఆర్ టికెట్ ఇచ్చారు.

ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ఒకే ఒక్క మార్పు జరిగింది. వైరా నియోజకవర్గంలో అభ్యర్థిని కేసీఆర్ మార్చారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కు షాక్ ఇచ్చారు. ఆ నియోజక వర్గం నుంచి మదన్ లాల్ పోటీ చేస్తారని ప్రకటించారు. నిజానికి మదన్ లాల్ ఇటీవల వార్తల్లో నిలిచారు. మదన్ లాల్ ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారంటూ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే, టికెట్ కోసం కుట్ర పూర్వకంగా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం ఇలాంటి ఫొటోలు మార్ఫింగ్ చేసిందని మదన్ లాల్ వర్గీయులు అన్నారు. చివరకు మదన్ లాల్ కే టికెట్ దక్కింది.

ఇక కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నారు. గజ్వేల్ నుంచి కూడా ఆయన బరిలో దిగనున్నారు. ఈ నియోజక వర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గంప గోవర్ధన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మాస్టర్ ప్లాన్ ను ప్రజలు వ్యతిరేకించారు. దీంతో అక్కడి నుంచి తానే పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఒకవేళ గజ్వేల్ లో కేసీఆర్ గెలిస్తే కామారెడ్డి స్థానం నుంచి రాజీనామా చేస్తారన్న ఊహానాగాలు వ్యక్తమవుతున్నాయి. గంప గోవర్ధన్ ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్ కోసం ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నారని చెప్పుకోవాలి.

ఉప్పల్ – ఈ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ నేత బేతి సుభాస్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో 1,17,442 ఓట్లు ఆయనకు పడ్డాయి. అయితే, ఆయన ప్రభ తగ్గిపోయిందని ప్రచారం జరిగింది. సర్వేల్లోనూ కేసీఆర్ కు ఇదే స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి బండారు లక్ష్మారెడ్డిని బరిలోకి దింపుతున్నారు. ఇదే నియోజక వర్గం నుంచి బొంతు రామ్మోహన్ కూడా టికెట్ ఆశించారు.

బోధ్ నియోజక వర్గం నుంచి రాథోడ్ బాపు రావుకు షాక్ తగిలింది. ఆయనకు టికెట్ దక్కలేదు. కొన్ని వారాల క్రితమే ఆయన ఓ పంచాయతీ సెక్రటరీని బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. బోధ్ నుంచి ఈ సారి అనిల్ కుమార్ పోటీ చేయనున్నారు.

ఆసిఫాబాద్- ఈ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలిచారు. ఆయనకు 65,788 ఓట్లు రాగా బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి 65,617 ఓట్లు వచ్చాయి. అత్యల్ప మెజార్టీతో ఆత్రం సక్కు గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు ఈ నియోజక వర్గం నుంచి కోవా లక్ష్మి బరిలోకి దిగుతున్నారు.

ఖానాపూర్ – ఈ నియోజక వర్గ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఆ స్థానం నుంచి భూక్యా జాన్సన్ రాథోడ్ కు ఛాన్స్ ఇచ్చారు. గతంలో అజ్మీరా రేఖ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ లో ఆమెపై వ్యతిరేకత ఉంది. అందుకే టికెట్ దక్కలేదు.

BRS List: రాజయ్యకు మొండిచేయి ఎందుకు? ఇక్కడ చదవండి

మరో నలుగురి పరిస్థితి?

మరో నలుగురు అభ్యర్థుల పేర్లను మాత్రమే ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థులను ప్రకటించని స్థానాలు నాంపల్లి, గోషామహల్, జనగాం, నర్పాపూర్. ఈ నాలుగు స్థానాల్లో కనీసం ఇద్దరు సిట్టింగులకు టికెట్లు దక్కవని ప్రచారం జరుగుతోంది.

BRS Candidates 1st List: బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వచ్చేసింది.. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు వీరే..

ట్రెండింగ్ వార్తలు