ECI: ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ వ్యాఖ్యల్లో నిజమెంత.. డబ్బు, మద్యం చేరాల్సిన చోటుకు చేరిపోయాయా?

పార్టీలు ఇచ్చే డబ్బు విషయంలో ఓటర్లు ధర్నాలు చేయడాన్ని సీఈసీ కోట్ చేసిందంటనే ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.

why election commission of india warns voters?

Election Commission Warning: తెలంగాణ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా వేసిందా? ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తుందా? నాయకులు, పార్టీలు.. ఉద్యోగులే కాదు చివరికి ఓటర్లను కూడా వదిలిపెట్టేది లేదని ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇవ్వడంలో అసలు ఉద్దేశమేంటి? పారదర్శక ఎన్నికలకు పకడ్బందీ ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలు కూడా లేవనెత్తని విషయాలపైనా ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టడానికి కారణాలేమై ఉంటాయి?

తెలంగాణ ఎన్నికలకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. వారం, పదిరోజుల్లోనే ఎన్నికల క్రతువు ప్రారంభమ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే తుది ఓటర్ల జాబితాపై కసరత్తు పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. అటు కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీసింది. ఐతే గతంలో ఎప్పుడూ లేనట్లు ఈ సారి ఎన్నికల కమిషన్ రాష్ట్రంలోని పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది.

ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో డబ్బు, మద్యం, ఇతర తాయిలాలు చేరాల్సిన చోటుకి చేరిపోయాయంటూ ఎన్నికల కమిషన్ వ్యాఖ్యానించడం హాట్‌టాపిక్గా మారింది. ఏ సమాచారం లేకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషన్ వద్ద ఇలాంటి అక్రమాలపై ఆధారాలు ఉంటే చర్యలకు ఆదేశించకుండా.. సూచనలు చేయడంపైనా చర్చ జరుగుతోంది. ఇంతకీ కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అవేంటంటే..?

1. ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ వ్యాఖ్యల్లో నిజమెంత?
2. ఏ ఆధారాలతో సీఈసీ ఆ వ్యాఖ్యలు చేసింది?
3. ఎవరైనా ఫిర్యాదులు చేశారా? లేక సొంతంగా నివేదికలు తెప్పించుకున్నారా?
4. సీఈసీ చెప్పినట్లు డబ్బు, మద్యం చేరాల్సిన చోటుకు చేరిపోయాయా?

ఎన్నికలు అంటేనే డబ్బు, మద్యం పంపిణీగా మారిపోయింది పరిస్థితి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా తెలంగాణలో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంటోందని సీఈసీ చెబుతోంది. గతంలో నమోదైన కేసులు సీఈసీ వ్యాఖ్యలకు కారణమై ఉండొచ్చని అనుకున్నా.. ప్రస్తుతం మద్యం, డబ్బు చేరాల్సిన చోటుకు చేరిపోయాయనే వ్యాఖ్యలే రాజకీయం హీట్ పుట్టిస్తున్నాయి. ఎవరి డబ్బు ఎవరికి చేరింది..? ఎక్కడికి చేరింది..? మద్యం స్టాక్ చేశారా? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.. డబ్బు చేతులు మారిందన్న సమాచారంపై ఫిర్యాదులు ఉంటేనే కాని వేలెత్తి చూపలేం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటేనే డబ్బు అక్రమంగా తరలిస్తున్నదీ.. లేనిదీ స్పష్టమయ్యేది కానీ.. మద్యం విషయం అలా కాదు. మద్యం ఉత్పత్తి, అమ్మకాలు.. స్టాకు ఇలా ప్రతిదీ పక్కాగా రికార్డై ఉంటాయి. ఒక వేళ అసాధారణ రీతిలో మద్యం అమ్మకాలు పెరిగితే ఎవరైనా పక్కాగా పట్టుబడుతారు? కీలమైన ఎన్నికల కమిషన్ ఈ విషయంలో ప్రత్యేక నిఘా వేస్తే మద్యం నిల్వల గుట్టు వీడే అవకాశం ఉంది. ఒకవేళ ఇలాంటి స్టాక్‌పై సీఈసీ వద్ద పక్కా ఆధారాలు ఉంటే ఇక అధికారులు దాడులకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనట్లే.

తెలంగాణలో డబ్బు స్వాధీనం చాలా తక్కువ
ఇక సీఈసీ మరో కీలక వ్యాఖ్యలు చేసింది.. కర్ణాటక, గుజరాత్, ఈశాన్య రాష్ట్రాల్లో పోల్చితే తెలంగాణ డబ్బు స్వాధీనం చాలా తక్కువగా ఉండటం అధికారుల వైఫల్యంగా అభిప్రాయపడుతోంది. ఇప్పటివరకు పట్టుబడిన డబ్బు వివరాలను తెలుసుకునే విషయంపైనా అసంతృప్తి వ్యక్తం చేసిందంటే.. రాష్ట్ర అధికారుల పనితీరుపై సీఈసీకి సదాభిప్రాయం లేనట్లే. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఎన్నికల నిర్వహణకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక అధికారులను నియమించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇదేసమయంలో జిల్లాల్లో అధికారుల బదిలీలపైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది సీఈసీ. ఇవన్నీ పరిశీలిస్తే రాష్ట్రంలో ఈ సారి ఎన్నికల నిర్వహణపై సీఈసీ పక్కాగా వ్యవహరించే సూచనలే కనిపిస్తున్నాయి.

Also Read: ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు మరో షాక్.. బీఆర్ఎస్‌లో చేరిన మెదక్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి

అధికారులపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సీఈసీ పర్యటనలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగిపోయింది. ఇంతవరకు ప్రధాన పార్టీలు అభ్యర్థులు ఎంపికపైనే దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే ఈ వడబోత కార్యక్రమం పూర్తి చేయగా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటనపై వాయిదాలు వేసుకుంటూ వస్తోంది. ఇక బీజేపీ దరఖాస్తుల తీసుకుని.. తీరిగ్గా ఆలోచిస్తున్నట్లే కనిపిస్తోంది. అంతేకాని ప్రతిపక్షాలు ఎన్నికల ఏర్పాట్లపై ఎలాంటి నిఘా వేసినట్లు కనిపించడం లేదు. పక్కనున్న ఏపీలో ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులపై ప్రధాన పార్టీలు రెండూ బహిరంగ యుద్ధానికి దిగాయి.. కాని, తెలంగాణలో ఇంతవరకు ఎన్నికల ఏర్పాట్లపై ఏ పార్టీ పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కాంగ్రెస్ మాత్రం కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసింది.

Also Read: బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకి కలిపి 36 సీట్లు వస్తాయి.. కాంగ్రెస్‌కేమో..: రేవంత్ రెడ్డి

ఈ పరిస్థితుల్లో అంతా సజావుగా జరుగుతున్నట్లే భావిస్తుండగా.. ఎన్నికల కమిషన్ పిడుగులాంటి వ్యాఖ్యలు చేసింది. పార్టీలు ఇచ్చే డబ్బు విషయంలో ఓటర్లు ధర్నాలు చేయడాన్ని సీఈసీ కోట్ చేసిందంటనే ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎన్నికలు తాయిలాలు అందుకున్నవారిపైనా.. సరఫరా చేసినవారిపైనా.. సూత్రధారులపైనా చర్యలు ఉంటాయని హెచ్చరించడం ద్వారా తామెంత సీరియస్ గా ఉన్నామన్నది చెప్పకనే చెప్పినట్లయింది. ఇక అధికారులు జాగ్రత్తగా వ్యవహరించకపోతే.. కోరి ముప్పుతెచ్చుకున్నట్లేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఈసీ వార్నింగ్‌ను పరిశీలిస్తే ప్రతి అధికారి, ప్రతి నాయకుడే కాదు.. ఓటర్లు కూడా ఈసీ రాడార్ పరిధిలో ఉన్నారనే విషయాన్ని గుర్తించుకోవడం అత్యంత ముఖ్యం.. లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితికి సిద్ధమవడమే హాట్‌టాపిక్.

ట్రెండింగ్ వార్తలు