కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు

వీధి కుక్కల బెడదను అరికట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ..

CM Revanth Reddy

CM Revanth Reddy : హైదరాబాద్​ జవహర్ నగర్లో వీధి కుక్కలు రెండేళ్ల బాలుడిపై దాడిచేయడంతో ఆ బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ  విషాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి మృతి ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. భ‌విష్య‌త్‌లో ఇటువంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా వీధి కుక్కల బెడదను అరికట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

Also Read : 24గంటల్లో న్యాయం అన్నారు… ఏమైంది లోకేశ్ ? : విజయసాయి రెడ్డి

వీధి కుక్క‌ల దాడులకు వాతావ‌ర‌ణ ప‌రిస్థితులా, లేక సీజ‌న‌ల్ కార‌ణాలా.. అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూక్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల నిపుణుల కమిటీ వేయడం జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయటం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణ అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం ఆదేశించారు.

Also Read : సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. కేసీఆర్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారులు, పెద్దలపై వీధి కుక్కల దాడి ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ జవహర్ నగర్ లో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. విహాన్ అనే రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు అత్యంత పాశవికంగా దాడి చేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికంగా విషాదం నెలకొంది.

 

 

ట్రెండింగ్ వార్తలు