Telangana Politics: తెలంగాణ ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు.. సిద్ధాంతాలు, భావోద్వేగాలు మాటలకే పరిమితా?

why political leaders frequently changed parties in Telangana?

Telangana Political Leaders : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఎప్పుడూ నిజం చేస్తూనే ఉంటారు నేతలు. నేటి మిత్రులు.. రేపటి శత్రువులుగా.. నేటి శత్రువులు.. రేపటి మిత్రులుగా మారుతుంటారు. ఈ రోజు ఉన్న పార్టీని ఒక్క క్షణంలో వదిలేస్తారు. జెండాలు మార్చేస్తారు. అజెండాలు వదిలేస్తారు. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో ఎవరికీ అర్థం కాదు. ఇదేమని అంటే అదే రాజకీయం అంటారు. రంగులు మార్చడమే రాజకీయంగా మారింది. సిద్ధాంతాలు.. భావోద్వేగాలు.. వంటివన్నీ కేవలం మాటలకే పరిమితం.. తెలంగాణ ఎన్నికల వేళ ఈ సిత్రాలు ఎన్నో కనిపిస్తున్నాయి. ప్రధాన పార్టీల్లో జంపింగ్ జపాంగ్‌లే ఎక్కువయ్యారు. పార్టీ ప్రయోజనం కన్నా.. సొంత మేలు కోసం పార్టీలు ఫిరాయించడం.. అధిష్టానం ధిక్కరించడం ఓ ప్రహసనంగా మారింది. ఏ పార్టీలో ఏ లీడర్ తీరు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం

నేను.. నా వారు సేఫ్‌గా ఉంటే చాలు.. పార్టీ ఏమైతే మాకేంటి? మాకు మంచి జరిగితే ఓకే.. లేదంటే నాట్ ఓకే అన్నట్లు తయారైంది మన నేతల తీరు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేదు. తేడా జరిగితే జంప్ చేసేయడమే.. నిన్నటి వరకు తిట్టిన నోరే.. నేడు జైకొడుతుంది.. విమర్శలు స్థానంలో ప్రశంసలు కురిపిస్తుంది.. తెలంగాణ ఎన్నికల్లో ఈ సిత్రాలు మరీ ఎక్కువయ్యాయి. గతంలో గెలిచాక పార్టీలు మారిన నేతలు కొందరైతే.. ఇప్పుడు గెలుపు ఆశతో గోడ దూకుతున్న నేతలే ఎక్కువవుతున్నారు. ఐదేళ్లుగా రాసుకుపూసుకు తిరిగిన పార్టీని.. తమ వర్గంగా చెప్పుకున్న నేతలను ఒక్క క్షణంలో వదిలేస్తున్నారు. ఇది ఏ ఒక్క పార్టీకో ప్రత్యేకం కాదు.. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇదేపరిస్థితి.. ఐతే బీజేపీలో ఈ జోరు కాస్త ఎక్కువగా కనిపిస్తోంది.

Eatala Rajender, Enugu Ravinder Reddy

రాజకీయ ప్రయోజనాల కోసం పక్కచూపులు
అధికార బీఆర్‌ఎస్‌లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేత ఈటల రాజేందర్ (Eatala Rajender) అధినేత కేసీఆర్‌పై (CM KCR) విభేదించి కమలం పార్టీలో చేరారు. తనతోపాటే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని (Eanugu Ravinder Reddy) బీజేపీలోకి తీసుకువెళ్లారు. బీజేపీలో కీలక నేతగా మారారు ఈటల.. ఆ పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గం తయారుచేసుకున్నారు. తన ప్రధాన అనుచరుడు ఏనుగు రవీందర్‌రెడ్డితోపాటు మరో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి (Yennam Srinivas Reddy) కూడా ఈటల వర్గంలో చురుగ్గా వ్యవహరించేవారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను (Bandi Sanjay) పదవి నుంచి దించేవరకు విశ్రమించకుండా పోరాడింది ఈటల వర్గం.. తాము అనుకున్నది సాధించిన తర్వాత పార్టీ బలపేతానికి కృషి చేయాల్సిన ఈటల వర్గం ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకునే పనిలో పడ్డారు. ఈటల వర్గంలో యాక్టివ్‌గా ఉన్న ప్రధాన నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి బీజేపీని వీడేందుకు రెడీ అయిపోతున్నారు. బండిని దించే వరకు కలిసివున్న ఈ నేతలు చివరికి తమ సొంత నియోజకవర్గాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం పక్కచూపులు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది..

కాంగ్రెస్‌లో విచిత్రమైన పరిస్థితులు
ఇక కాంగ్రెస్‌లో మరీ విడ్డూరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం కత్తులు దూసుకునే నాయకులు ఇప్పుడు యుగళ గీతాలు ఆలపిస్తుండగా.. ఇన్నాళ్లు కలిసిమెలిసి తిరిగిన వారు తమ పక్కనున్న వారికి పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ మార్క్ రాజకీయంలో ఎన్నో ట్విస్టులు ఉంటాయని అంతా అనుకుంటారు. ఐతే తెలంగాణ కాంగ్రెస్‌లో జీ9 లీడర్ల రాజకీయం అంతకుమించి అన్నట్లు సాగుతోంది. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై గతంలో ఒంటికాలిపై లేచిన సీనియర్లు ఇప్పుడు అవసరాలు, అవకాశాలే లక్ష్యంగా సర్దుకుంటున్నారు. 50 కోట్ల రూపాయలకు పీసీసీ పీఠం కొనుక్కున్నారని రేవంత్‌రెడ్డిని విమర్శించిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇప్పుడు పీసీసీ చీఫ్‌తో ఎంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. జీ9 గ్రూపులో తనతోపాటు కీలకంగా వ్యవహరించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు కోమటిరెడ్డి.

UttamKumar Reddy, Padmavathi Reddy

వచ్చేఎన్నికల్లో రెండు టిక్కెట్లు ఆశిస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చెక్‌చెప్పేలా వన్‌ ఫ్యామిలీ.. వన్ టిక్కెట్ ఫార్ములాను బలపర్చడమే కాకుండా బీసీ నినాదానికి సపోర్ట్ చేస్తున్నారు కోమటిరెడ్డి. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భార్య పద్మావతి పోటీ చేయాలని చూస్తున్న కోదాడను బీసీలకు కేటాయించాలని ప్రతిపాదిస్తున్నారు కోమటిరెడ్డి. అవసరమైతే తన నియోజకవర్గం నల్లగొండను బీసీల కోసం త్యాగం చేస్తానని ప్రకటనలు చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.

Also Read: కాంగ్రెస్‌లో భారీ చేరికల ప్లాన్.. ఇంతకీ చేరుతున్నది ఎవరెవరు? ముహూర్తం ఎప్పుడు?

Jagga Reddy, Revanth Reddy

ఇలా కోమటిరెడ్డి ఒక్కరే కాదు కాంగ్రెస్‌లో చాలామంది లీడర్లు మొదట్లో రేవంత్‌రెడ్డిని వ్యతిరేకించినా.. ఎన్నికలు సమీపించడంతో చేతులు కలుపుతున్నారు. ఇది ఆ పార్టీ వరకు మంచి పరిణామమే అయినా.. అప్పటివరకు తమతో కలిసితిరిగిన నేతలకు చెక్ చెపుతుండటమే ఆశ్చర్యకరంగా మారుతోంది. ఇదే కోవలో రేవంత్‌రెడ్డితో కొన్నాళ్లు గ్యాప్ మెంటైయిన్ చేసిన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఇప్పుడు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌లో తానో మోనార్క్‌గా చెప్పుకునే జగ్గన్న.. ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కాక ఆయన సన్నిహితులు సైతం జుట్టు పీక్కుంటున్నారు. జగ్గన్న ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారో అర్థం కాక.. తాము ఎవరితో కలవాలో.. ఎవరికి దూరంగా ఉండాలో అర్థం చేసుకోలేక అయోమయంలో పడిపోతున్నారు.

Mynampalli, KCR

బీఆర్‌ఎస్‌ అసంతృప్తుల కొత్త దారులు
ఇలా రెండు ప్రతిపక్ష పార్టీల్లో వర్గాలు విచ్ఛిన్నమవుతుండగా.. అధికార బీఆర్‌ఎస్‌లో అసంతృప్తులు పార్టీని చికాకు పెడుతున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తుండగా.. టిక్కెట్లు దక్కని వారు గోడదూకే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తీరు తల పండిన రాజకీయా నేతలకే దిమ్మదిరిగేలా చేస్తోంది. గత పదేళ్లలో రాజయ్యపై ఎన్నో ఆరోపణలు.. విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు బీఆర్‌ఎస్ అధిష్టానం. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిచే పరిస్థితి లేదన్న కారణంతో సీనియర్ నేత కడియం శ్రీహరికి టిక్కెట్ ఇచ్చింది గులాబీ పార్టీ. ఐతే ఇన్నాళ్లు పార్టీని అంటిపెట్టుకున్న రాజయ్య టిక్కెట్ దక్కలేదన్న ఆక్రోశంతో ఇప్పుడు కొత్త దారులు వెతుకుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో రాజయ్య భేటీకావడం రాజకీయ వర్గాలను విశేషంగా ఆకర్షించింది.

Revanth Reddy, Tummala Nageswar Rao

బీఆర్‌ఎస్ బాస్‌కు దిమ్మదిరిగేలా..
ఇక ఖమ్మం రాజకీయం బీఆర్‌ఎస్ బాస్‌కు దిమ్మదిరిగేలా చేసింది. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసిన తుమ్మల ఆ ఎన్నికల్లో ఓడిపోతే.. పాలేరు ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చి గెలిపించింది కారు పార్టీ. తుమ్మల సీనియార్టీని గౌరవించి మంత్రి పదవి అప్పగించింది. మంత్రిగా ఉంటూనే 2014లో రెండోసారి ఓడిపోయారు తుమ్మల. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకు టిక్కెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారు తుమ్మల. పార్టీ ఎంతలా గౌరవమిచ్చినా.. తమ స్వప్రయోజనాలే చూసుకుంటున్నారని తుమ్మల, రాజయ్యపై విమర్శలు చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. ఇక మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కథ వేరే.. ఒకప్పుడు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేసిన మైనంపల్లిని పార్టీలో చేర్చుకుని.. ఆ స్థానం ఖాళీగా లేకపోవడంతో మల్కాజ్‌గిరిలో అవకాశం ఇచ్చింది గులాబీ పార్టీ.. ఇప్పుడు తన కుమారుడి కోసం మెదక్ టిక్కెట్ ఆశిస్తూ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు మైనంపల్లి. మంత్రి హరీశ్‌రావుపై దూషణలకు దిగడం బీఆర్‌ఎస్‌లో అగ్గి రాజేసింది. హరీశ్, మైనంపల్లి ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన నాయకులైనా.. కేవలం తన కుమారుడికి టిక్కెట్ దక్కలేదన్న ఏకైక కారణంతో హరీశ్‌పై విరుచుకుపడ్డారు మైనంపల్లి.

Also Read: రాజకీయాల్లో అన్ని అర్థరాత్రే జరుగుతుంటాయి ఇది కూడా అంతే : సీపీఐ నారాయణ

ఇక కంటోన్మెంట్ నేత క్రిశాంక్ బాధ ఇంకోలా ఉంది. కేటీఆర్ ప్రధాన అనుచరుడిగా ఉన్న క్రిశాంక్ కంటోన్మెంట్ టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మరణంతో టిక్కెట్ తనకే దక్కుతుందని ఆశించారు. ఐతే చివరి నిమిషంలో క్రిశాంక్‌ను తప్పించి సాయన్న కుమార్తె లాస్య నందినికి టిక్కెట్ ఇచ్చింది పార్టీ.. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మంత్రి తనకు టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారని రగిలిపోతున్నారు క్రిశాంక్. ఐతే మిగిలిన నేతల్లా క్రిశాంక్ పార్టీ లైన్ దాటకపోయినా.. ఆయన అలక వచ్చే ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశీలకులు. ఇలా ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ జెండా మార్చేసిన నేతల లిస్టు భారీగానే ఉంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లితోపాటు చాలా మంది నేతలు స్వప్రయోజనాలు ఆశించే జెండాలు మార్చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ రంగులు మార్చే రాజకీయమే క్లియర్‌కట్ హాట్‌టాపిక్.

ట్రెండింగ్ వార్తలు