HMDA New Layouts : భారీ లే-అవుట్ల రూపకల్పనపై హెచ్‌ఎండీఏ ఫోకస్

HMDA New Layouts : భూమిని విక్రయించడం ద్వారా ఇతర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని హెచ్‌ఎండీఏ భావిస్తుంది.

HMDA Focus on New Layouts ( Image Source : Gooogle )

HMDA New Layouts : నగరంలో పలుచోట్ల కొత్త లే-అవుట్లను డెవలప్‌ చేసి… కొంత ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు రచిస్తోంది. రైతుల నుంచి భూములను సేకరించి డెవలప్ చేయాలని హెచ్‌ఎండీఏ ప్లాన్‌ చేస్తోంది. తన వాటాగా వచ్చిన భూమిని విక్రయించడం ద్వారా ఇతర ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని హెచ్‌ఎండీఏ భావిస్తుంది. అంతే కాకుండా ఆ భూములను ప్రభుత్వ నిర్ణయాల మేరకు కేటాయింపులు చేసే అవకాశం కూడా ఉంటుంది.

ఇక ల్యాండ్ డెవలప్‌మెంట్‌లో తమ వాటా పెంచాలని చాలా కాలం నుంచి రైతులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు గత సర్కార్‌ ఓకే చెప్పడంతో రైతుల వాటా 60శాతానికి పెరిగింది. దీంతో ఇప్పుడు భూములు ఇచ్చే రైతులకు మరింత లబ్ధి చేకూరుతుంది. భూములిచ్చే వారికి పూర్తి స్థాయి భద్రత, ఎక్కువ శాతం ప్రయోజనం చేకూరుతుంది.

Read Also : Mahindra Thar Roxx : మహీంద్రా థార్ రోక్స్ చూశారా? భలే ఉంది భయ్యా.. థార్ 5-డోర్ వెర్షన్‌.. ఫీచర్లు ఇవేనట!

భూములు ఇచ్చే వారికి ఆర్ధికపరమైన ఇబ్బందులు రాకుండా అన్ని రకాల అనుమతుల వ్యవహారాలను హెచ్‌ఎండీఏ పర్యవేక్షిస్తుంది. సాధారణంగా వ్యవసాయ భూములను లే-అవుట్లుగా మార్చాలంటే నాలా చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. కాని హెచ్‌ఎండీఏకు భూములు అప్పజెప్పితే వాటికి నాలా చార్జీలతో పాటు పాటు ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చార్జీలను హెచ్‌ఎండీఏ భరిస్తుంది. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం హెచ్‌ఎండీఏ చెల్లించాలని నిర్ణయించడంతో రైతులపై భారం మరింత తగ్గనుంది.

భూములు ఇచ్చిన రైతులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం : 
ఇక టీఎస్ఐఐసీకి చెందిన భూములను ఇటీవల హెచ్‌ఎండీఏ ఆన్ లైన్ వేలంలో విక్రయించింది. దీంతో భారీ ఆదాయం వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో భూములకు ఎకరానికి 100 కోట్ల రూపాయల ధర కూడా పలికింది. గత ప్రభుత్వం హయాంలో కోకాపేట్, బుద్వేల్, మోకిలా, షాబాద్ తదితర ప్రాంతాల్లో వేసిన లే-అవుట్లలో ప్లాట్లను విక్రయించి వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది హెచ్‌ఎండీఏ.

అంతే కాకుండా ఆయా ప్రాంతాల్లోని భూములను వివిధ అవసరాల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టింది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్‌, న్యూ వర్క్ సెంటర్లను డెవలప్‌ చేయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. దీనికోసం భూ యజమానులు, రైతులు, పట్టాదారులు ఒంటరిగా లేదా సమూహంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 50 ఎకరాలు.., ఔటర్ రింగ్ రోడ్డు బయట 100 ఎకరాలు కనీసంగా ఉండాలని అధికారులు నిర్ణయించారు.

ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ల వద్ద ఎక్కువ లే-అవుట్లు ఉండేలా హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఎక్కువ లే-అవుట్లు వేయాలనే లక్ష్యంతో ఉంది హెచ్‌ఎండీఏ. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ సమీపంలోని భూములకు భారీ డిమాండ్‌ ఉంది. వీటిని డెవలప్‌ చేస్తే వేలంలో భారీ ధర పలుకుతుందని హెచ్‌ఎండీఏ యోచిస్తోంది. అంతే కాకుండా ఒకే చోట ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండ్ లభిస్తుండడంతో కార్పొరేట్ సంస్థలు అందులో కొనుగోలుకు ఆసక్తి చూపుతాయి. అదే ప్రాంతంలో 150, 200 గజాల స్థలం కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు అధికారులు. దాంతో అందరికీ అందుబాటులో ఉండేలా లే-అవుట్ల రూపకల్పనపై అధికారులు ఫోకస్ చేస్తున్నారు.

ఇక సిటీ చుట్టూ ఉండే ప్రతాప సింగారం, కొర్రెముల, భోగారం, లేమూరు, దండు మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే దాదాపు 9 వందల ఎకరాలకు పైగా భూమిని డెవలప్‌మెంట్‌ కోసం అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇక ఒక ఎకరం 4 వేల 840 గజాల భూమిని డెవలప్ చేస్తే అందులో 40 శాతం రోడ్లు మరియు గ్రీనరీకి పోతుంది. మిగిలిన 2904 గజాల్లో 60 శాతం వాటా అంటే ఒక వెయ్యి 742 గజాలు భూయజమానికి, 40 శాతం వాటాలో 11 వందల 62 గజాల భూమి హెచ్‌ఎండీఏకు చెందుతుంది.

ఇలా హైదరాబాద్ చుట్టూ దాదాపు 11వేల ఎకరాల భూమిని హెచ్‌ఎండీఏ సేకరించి డెవలప్ చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో దాదాపు 10 వేల ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో, అలాగే ప్రధానమైన జంక్షన్ల వద్ద ఉండేలా ప్లాన్‌ చేస్తోంది హెచ్‌ఎండీఏ. ఇలా చేయడం ద్వారా ఇటు ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు…, ప్రజలకు క్లియర్ టైటిల్ ఉండే భూములు సరైన ధరల్లో దొరికేందుకు అవకాశం ఏర్పడుతుంది.

Read Also : iPhone 13 Price Drop : అమెజాన్ ప్రైమ్ డే 2024 సేల్.. ఆపిల్ ఐఫోన్ 13పై భారీ తగ్గింపు.. మరెన్నో బ్యాంక్ డిస్కౌంట్లు!