వామ్మో.. చోరీలు, దోపిడీలు నేర్పించే స్కూల్.. ఫీజు రూ.3 లక్షలు.. శిక్షణ పొందాక పిల్లలకు డబ్బే డబ్బు..

మొత్తం 300 మందికి పైగా పిల్లలు దేశంలోని పలు వివాహ వేడుకల్లో చోరీల కేసుల్లో ఉన్నారని తెలిపారు.

క్రీడా విశ్వవిద్యాలయాలు ఉంటాయి.. సాంకేతిక విశ్వవిద్యాలయాలు ఉంటాయి.. స్కిల్ యూనివర్సిటీలు ఉంటాయి.. స్కూలు విద్య నుంచి విశ్వవిద్యాలయాల వరకు మంచి అలవాట్లతో చదువు నేర్పిస్తాయి. మధ్యప్రదేశ్‌లోని మూడు మారుమూల గ్రామాలైన కడియా, గుల్ఖెడి, హుల్ఖేడిలో మాత్రం దొంగతనాలు ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. 64 కళల్లో ఒకటిగా దొంగతనం ఉందని, అది కూడా నేర్పించవచ్చని అనుకున్నారేమో ఈ కేటుగాళ్లు.

చోరీ చేయడం, మనుషుల మీద కత్తులతో దాడి చేసి, హింసించి డబ్బులు లాక్కోవడం వంటి కళలను నేర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి 117 కిలోమీటర్ల దూరంలోని రాజ్‌గఢ్ జిల్లాలో ఆ మూడు గ్రామాలు ఉంటాయి. చోరీ, దోపిడీ కళలలో పిల్లలకు శిక్షణ ఇస్తూ అప్రఖ్యాతిని మూటగట్టుకుంటున్నాయి.

లక్షలు కట్టి చేర్పిస్తున్నారు..
ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు.. దోపిడీలు నేర్చుకుంటేనైనా నాలుగు డబ్బులు సంపాదించుకుంటారంటూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ మూడు గ్రామాల్లోని శిక్షకుల వద్దకు పంపి చోరీలు నేర్పిస్తున్నారు. 12-13 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఈ నేర కార్యకలాపాలలో శిక్షణ ఇస్తున్నారు నిర్వాహకులు.

ఇందుకుగానూ తల్లిదండ్రులు రూ.2-3 లక్షల మధ్య ఫీజు కూడా కడుతున్నారు. ఇక్కడ చిన్నారులు క్రిమినల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు. జనాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో జేబులు కొట్టేయడం, చైన్ స్నాచింగులు, బ్యాగులు చోరీ చేయడం వంటి వాటిని నిర్వాహకులు నేర్పిస్తున్నారు. ఏడాదిపాటు శిక్షణ పూర్తయ్యాక ఆ పిల్లల తల్లిదండ్రులకు గ్యాంగ్ లీడర్లు ఏడాదికి రూ.3 నుంచి రూ.5 లక్షల మధ్య డబ్బు ఇస్తారు. దేశ వ్యాప్తంగా ఆ గ్యాంగులు చోరీలకు పాల్పడుతున్నాయి.

హైదరాబాద్ వ్యాపారి నగులు ఎత్తుకెళ్లింది వీళ్లే..
ఆగస్ట్ 8న జైపూర్‌లోని హయత్ హోటల్‌లో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఒక మైనర్ 1.5 కోట్ల రూపాయల విలువైన నగలను ఎత్తుకెళ్లాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమారుడి పెళ్లి జరుగుతున్న సమయంలో ఆ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరుగుతున్న పెళ్లిలో 14 ఏళ్ల బాలుడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆ బాలుడు ఆ బ్యాగును చోరీ చేసిన తీరు పోలీసులను కూడా ఆశ్చర్యపర్చింది. ఆ హోటల్‌లోని సీసీటీవీ ఆధారంగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు.

300 మంది పిల్లలు.. పోలీసులకు సవాలు
జైపూర్‌లోనే కాక దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఆ గ్యాంగులే చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఇటువంటి కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి. ఈ నేరగాళ్లు బ్యాగులు ఎత్తుకెళ్లడం, బ్యాంకుల్లో డబ్బులు కాజేయడం, ఇతర నేరాల్లో సమగ్ర శిక్షణ తీసుకుని ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. కడియా, గుల్ఖెడి, హుల్ఖేడిలోని మొత్తం 300 మందికి పైగా పిల్లలు దేశంలోని పలు వివాహ వేడుకల్లో చోరీల కేసుల్లో ఉన్నారని తెలిపారు.

Also Read: చిత్రపురి కాలనీలో కూల్చివేతలు.. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

ట్రెండింగ్ వార్తలు