చిక్కుల్లో ఆ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సీఎం పదవులకు పొంచి ఉన్న ముప్పు..!

రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ రాజకీయంగా లబ్ది పొందేందుకు కేంద్రం తన ప్రత్యర్థిని టార్గెట్ చేసిందనే చర్చ తెరమీదకు వచ్చింది.

3 States CMs In Trouble : మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పదవులకు ముప్పు ఉందా? కర్నాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కర్నాటకలో ముడా స్కామ్, పశ్చిమ బెంగాల్ లో డాక్టర్ పై హత్యాచారం, జార్ఖండ్ లో చంపై సొరైన్ బీజేపీలో చేరతారనే ప్రచారం.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చిక్కు సమస్యగా మారాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వేళ రాజకీయంగా లబ్ది పొందేందుకు కేంద్రం తన ప్రత్యర్థిని టార్గెట్ చేసిందనే చర్చ తెరమీదకు వచ్చింది. ఈ పరిణామాలకు బీజేపీయే కారణం అని మూడు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు సైతం మండిపడుతున్నాయి.

కర్నాటకలో ముడా స్కామ్ ప్రకంపనలు..
కర్నాటకలో మైసూర్ నగరాభివృద్ధి సంస్థ ముడా స్కామ్ సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంటోంది. సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించింది. పరిహారంగా ఆమెకు మైసూరు విజయనగరంలో స్థలాలు కేటాయించింది. సీఎం మౌఖిక ఆదేశాలతో ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని విపక్షాలు బీజేపీ, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై సామాజిక కార్యకర్తలు గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ కు ఫిర్యాదు చేశారు. దీంతో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు కర్నాటక గవర్నర్ అనుమతి ఇచ్చారు. గవర్నర్ నిర్ణయంపై కాంగ్రెస్ భగ్గుమంటోంది.

సిద్ధరామయ్యను బీజేపీ టార్గెట్ చేసిందని ఎదురుదాడి..
గవర్నర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు సిద్ధరామయ్య. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిన గవర్నర్ ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో మాదిరిగా కర్నాటకలోనూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు గవర్నర్ కొమ్ము కాస్తున్నారని సిద్ధరామయ్య ఫైర్ అయ్యారు. విచారణ కోసం తాను సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మరోవైపు గవర్నర్ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సిద్ధరామయ్యకు మద్దతుగా కర్నాటకలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండటంతో సిద్ధరామయ్యను బీజేపీ టార్గెట్ చేసిందన్న వాదన వినిపిస్తోంది.

దేశాన్ని కుదిపేస్తున్న కోల్‌కతా డాక్టర్ హత్యాచార ఘటన..
కోల్ కతా డాక్టర్ హత్యాచార ఘటనతో యావత్ దేశం అట్టుడుకుతోంది. ఈ ఘటనను ఖండిస్తూ వైద్య సిబ్బంది, విద్యార్థులు, మహిళా సంఘాలు రోడ్డెక్కారు. దీనిపై సీబీఐ విచారణకు దిగడంతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో మమతను ఉద్దేశిస్తూ ఓ విద్యార్థి చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. హింసను ప్రేరేపించేలా పోస్టు చేయడంతో ఆ విద్యార్థిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు కోల్ కతా పోలీస్ కమిషనర్ ని సీబీఐ విచారించాలంటూ బహిరంగంగా డిమాండ్ చేసిన తృణమూల్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కు సమన్లు ఇచ్చారు. ఘటన జరిగిన మూడు రోజుల వరకు స్నిపర్ డాగ్స్ ను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించిన ఆయన.. తన అరెస్ట్ ను అడ్డుకోవాలని కోరుతూ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించారు.

విపక్షాలపై దీదీ ఎదురుదాడి..
డాక్టర్ హత్యాచారం ఘటనపై కోల్ కతా హైకోర్టు సీరియస్ అయ్యింది. దాదాపు 7వేల మంది గుంపుగా ఆసుపత్రిపై దాడికి తెగబడితే పోలీసులు ఏం చేశారని నిఘా వైఫల్యాన్ని ఎత్తి చూపింది. పోలీసులు ఉన్నా ఈ ఘటన ఎలా జరిగింది అని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు భయపడకుండా ఎలా పని చేయగలుగుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వెంటనే నివేదికను సమర్పించాలని అటు పోలీసులను, ఇటు ఆసుపత్రి ఉన్నతాధికారులను కోల్ కతా హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 21న జరగనుంది. ఈ ఘటన వెనుక తృణమూల్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉన్నారంటూ విపక్షాలు ఆరోపించడంతో హైకోర్టే ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. మరోవైపు ఈ ఘటనకు విపక్షాలే కారణం అంటూ మమతా బెనర్జీ ఎదురుదాడికి దిగారు.

బీజేపీవైపు చూస్తున్న చంపయి సోరెన్..
అటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న జార్ఖండ్ రాష్ట్రంలోనూ రాజకీయ అస్థిరత నెలకొంది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చంపయి ఢిల్లీలోనే మకాం వేశారు. తనకు జేఎంఎంలో అవమానాలు జరిగాయంటూ చంపై సోరెన్ చెప్పారు. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నందునే ప్రత్యామ్నాయం కోసం చూడాల్సి వచ్చిందన్నారు. అయితే బీజేపీలో చేరికపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. బీజేపీ నేత సువేంద్రు అధికారి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

చీలిక తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం..
చంపయి సోరెన్ బీజేపీలో చేరుతారన్న వార్తలపై జేఎంఎం నేత, సీఎం హేమంత్ సోరెన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర ప్రజల్లో చీలిక తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందని, డబ్బుతో ఎమ్మెల్యేలకు గాలం వేసేందుకు ఆ పార్టీ వెనకాడబోదని ఆరోపించారు. సమాజంలో విభజనలు తేవడమే కాదు.. కుటుంబాలను, పార్టీలను విచ్ఛిన్నం చేసే పనిలో పడిందన్నారు. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ని నిర్ణయించేది ఎన్నికల సంఘం కాదు ప్రతిపక్ష పార్టీ అని మండిపడ్డారు. మొత్తానికి కర్నాటక, బెంగాల్, జార్ఖండ్ లో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ రగడకు దారితీశాయి.

Also Read : కోల్‌కతా డాక్టర్ కేసులో అసలేం జరిగింది? కనిపించే దేవుళ్లకు భద్రత ఏది?