Hyderabad Rain : హైదరాబాద్(Hyderabad) నగరాన్ని వరుణుడు వెంటాడుతున్నాడు. మరోసారి నగరంలో భారీ వర్షం(Rain) కురుస్తోంది. ఆర్టీసీ ఎక్స్ రోడ్డు, లోయర్ ట్యాంక్ బండ్, వీఎస్టీ, నారాయణగూడ, గోల్కొండ ఎక్స్ రోడ్డు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీగా వాన పడుతోంది. కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, చందానగర్, అల్వాల్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్, అంబర్ పేట్, బేగంపేట్ సర్కిళ్ల పరిధిలో వర్షం కురుస్తోంది.
జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, బాలానగర్, సనత్ నగర్, భరత్ నగర్, పటాన్ చెరు, కొంపల్లి సహా మరికొన్ని ప్రాంతాల్లో వాన దంచికొడుతోంది. గంట పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read..Heavy Rains : తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. అన్ని సర్కిళ్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని బల్దియా సూచించింది. వర్షం వల్ల ఏ ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్ నెంబర్లు 040- 21111111, 9000113667కి ఫిర్యాదు చేయాలని నగరవాసులకు సూచించారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి జిల్లాల్లో రేపు ఉదయం 8.30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీట మునిగాయి. తీవ్ర పంట నష్టం వాటిల్లింది. కుండపోత వానలతో జనజీవనం స్థంభించింది. అయితే, వాతావరణ కేంద్రం మరోసారి భారీ వర్ష సూచన చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.