Anantapur Constituency: అనంతపురంలో పవన్ పోటీ చేస్తే జనసేన, వైసీపీ మధ్యే పోటీ.. లేదంటే అంత ఈజీ కాదు!

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉండటంతో జనసేన పార్టీ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. జనసేన పార్టీ అధినేత పోటీచేస్తారనే టాక్ అనంత రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది.

Anantapur Urban Assembly Constituency Ground Report

Anantapur Urban Assembly Constituency: రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న జిల్లా అనంతపురం (Anantapur District). తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) కంచుకోటలాంటి ఈ జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. గతంలోనూ జిల్లా అంతా పసుపు జెండా రెపరెపలాడినా.. జిల్లా కేంద్రం అనంతపురంలో కాంగ్రెస్ హవాయే నడిచేది. రాష్ట్ర విభజనాంతరం కాంగ్రెస్(Congress Party) గల్లంతుకావడంతో ఆ స్థానాన్ని వైసీపీ (YCP) ఆక్రమించింది. సీనియర్ నేత సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి (Anantha Venkatarami Reddy) వైసీపీకి ప్రత్యేక బలం. వివాద రహితుడిగా ఆయనకు ఉన్న గుర్తింపుతో అనంత రాజకీయంలో దూసుకుపోతోంది వైసీపీ. కానీ ఈ సారి సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఫిట్టింగ్ పెట్టేలా సొంత పార్టీ నేతలు గ్రూపులు కడుతున్నారు. అదే సమయంలో టీడీపీలో కూడా వర్గ విభేదాలు చికాకు పుట్టిస్తున్నాయి. ఈ రెండు ప్రధాన పార్టీలు అంతర్గత సమస్యలతో రగిలిపోతుంటే.. ఇక్కడ నుంచి జనసేన(Janasena) తరఫున ఆ పార్టీ అధినేత పోటీచేస్తారనే టాక్ అనంత రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేసింది.

అనంతపురం అర్బన్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ నియోజకవర్గ పరిధిలో 50 డివిజన్లు, మూడు పంచాయతీలు ఉన్నాయి. సుమారు 5 లక్షల జనాభా. 2 లక్షల ఓటర్లు ఉన్నారు. ముస్లిం, బలిజ సామాజికవర్గమే ఇక్కడ ఎక్కువ. ఆ తరువాత కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారు. ముస్లింలు, బలిజలు ఎవరికి మద్దతు పలికితే వారిదే విజయం పక్కా అని చెబుతుంటారు. నియోజకవర్గంలో విద్యావంతుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

అనంత వెంకట్రామిరెడ్డి (photo: facebook)

ప్రస్తుతం ఈ స్థానం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా అనంత వెంకట్రామిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా సీనియర్ నేత. తండ్రి అనంత వెంకటరెడ్డి నుంచి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చారు. నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించిన అనంత వెంకట్రామిరెడ్డి.. ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సన్నిహితుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతపురం లోకల్ అభ్యర్థిగా ఎమ్మెల్యేకు అనుకూలంగా మారింది. వివాద రహితుడిగా పేరుతెచ్చుకున్నారు. అవినీతి ఆరోపణలు లేని ఎమ్మెల్యేగా కూడా అధికార పార్టీలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే కార్యకర్తలు, సొంత పార్టీ నేతలకు ఎలాంటి సాయం చేయడం లేదన్న అపవాదు ఉంది.

Also Read: వేడి పుట్టిస్తున్న రాప్తాడు రాజకీయాలు.. పరిటాల అడ్డా అని రుజువు చేస్తారా?

ఇక అభివృద్ధి కార్యక్రమాల పరంగా ఎమ్మెల్యే పనితీరుపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రోడ్ల నిర్మాణంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 380 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి విస్తరణ పనులు, రైల్వే బ్రిడ్జి నిర్మాణం ఎమ్మెల్యేకు ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు. అయితే కాలనీల్లో అంతర్గత రోడ్లు సరిగా లేకపోవడం డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడం, ఓల్డ్ టౌన్ లో మంచి నీటి సమస్య వంటివన్నీ ఎమ్మెల్యేకు మైనస్ గా మారే ఛాన్స్ ఉంది.

గురునాథ్ రెడ్డి (photo: facebook)

నగరంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య. ఓల్డ్ టౌన్ లో రోడ్ల విస్తరణ జరగలేదు. దీనిపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రతి రోజు ఈ మార్గంలో వెళ్లేవారు నరకం చూస్తున్నారు. రోడ్ల విస్తరణలో అవకవతవకలు జరిగాయని… వంకర టింకరగా రోడ్లు వేశారని ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో ప్రతికూలంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధికార వైసీపీలో కార్పొరేటర్లు కూడా అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తమ డివిజన్లలో పనులు చేసేందుకు నిధులు కొరతగా ఉండటంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలకు తోడు ఎమ్మెల్యేకు స్వపక్షం నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి(Bodimalla Gurunatha Reddy), ఆహుడా ఛైర్మన్ మహాలక్ష్మీ శ్రీనివాస్, చవ్వా రాజశేఖర్ రెడ్డి(Chavva Rajasekhar Reddy)తో పాటు మరికొందరు నేతలు ఈ సారి ఒక్కచాన్స్ కావాలని ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అయితే జగన్‌తో ఉన్న సంబంధాలు.. వివాదరహితుడిగా ఉన్న పేరుతో వచ్చే ఎన్నికల్లో తనకే మళ్లీ టిక్కెట్ దక్కుతుందని అంటున్నారు ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి.

ప్రభాకర్‌ చౌదరి (photo: facebook)

ఇక టీడీపీ విషయానికొస్తే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి (Vykuntam Prabhakar Chowdary) నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఈయన 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. నగరంలో బలమైన నేతగా ప్రభాకర్‌చౌదరికి గుర్తింపు ఉంది. మిగిలిన నేతల్లో ఎవరికీ లేనంత వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నేత ప్రభాకర్‌చౌదరి. అయితే పార్టీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఒక అడుగు ముందకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది టీడీపీ పరిస్థితి. చౌదరి వర్గం, జేసీ వర్గంగా చీలిపోయిన నాయకులు, కార్యకర్తలు ప్రజా సమస్యలు కన్నా.. వ్యక్తిగత ప్రతిష్టకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు గ్రూపుల్లో ఒకరికి టికెట్ ఇస్తే.. రెండవ వర్గం సహకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ విభేదాలే లేకుంటే టీడీపీకి గెలిచే ఛాన్స్ పుష్కలంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం ఈ సారి అనంతలో టీడీపీ జెండా కచ్చితంగా ఎగరవేస్తానని ధీమాలో మాత్రం ఉన్నారు. అధికార పార్టీ ఈ నాలుగేళ్లలో చేసిందేమీ లేదని విమర్శిస్తున్నారు.

టీసీ వరుణ్ (photo: facebook)

ఈ నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం అత్యధికంగా ఉండటంతో జనసేన పార్టీ కూడా ఎక్కువ ఆశలు పెట్టుకుంది. స్థానిక జనసేన నేత టీసీ వరుణ్ (TC Varun) టిక్కెట్ ఆశిస్తున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణే ఇక్కడ నుంచి పోటీచేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. నిజంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తే రాజకీయం మొత్తం మారిపోవడం ఖాయం. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరి ఇక్కడ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేస్తే తాను మద్దతు ఇస్తానని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఓపెన్ గా చెబుతున్నారు.

Also Read: హీటు రేపుతోన్న గుడివాడ అసెంబ్లీ సీటు.. కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్..

పవన్ పోటీ చేస్తే జనసేన, వైసీపీకి మధ్య.. లేకపోతే టీడీపీ వర్సెస్ వైసీపీగా ఇక్కడ పోటీ ఉంటుంది. కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసిన వైసీపీ మళ్లీ ఈ స్థానం నిలబెట్టుకుంటుందో లేదో చెప్పడం అంత ఈజీ కాదు. అభ్యర్థి ఎంపికే జయాపజయాలను నిర్దేశించనుంది. అదేసమయంలో పొత్తు రాజకీయాలు టీడీపీ భవిష్యత్‌ను నిర్దేశించనున్నాయి. ప్రస్తుతానికి రెండు పార్టీలూ హోరాహోరాగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఎవరు బలం పెంచుకుంటారో.. ఇంకెవరు రేసులోకి దూసుకొస్తారో వేచిచూడాల్సిందే..

ట్రెండింగ్ వార్తలు