AP Students in Ukraine : ఏపీ విద్యార్థుల కోసం యుక్రెయిన్ సరిహద్దులకు ప్రతినిధుల బృందం..!

AP Students in Ukraine : యుక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

AP Students in Ukraine : యుక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. యుక్రెయిన్‌లో యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే కర్ణాటకకు చెందిన మెడిసిన్ స్టూడెంట్ రష్యా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. యుక్రెయిన్‌లో ఏపీ విద్యార్థులను తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు ఈ ప్రతినిధుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ మేరకు యుక్రెయిన్‌ సరిహద్దు దేశాలైన పోలండ్, హంగేరీ, రొమేనియా, స్లొవేకియాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. హంగేరీ దేశానికి ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఏపీ ఎన్‌ఆర్టీ అధ్యక్షుడు, ప్రవాసాంధ్రుల ప్రభుత్వ సలహాదారుడు మేడపాటి ఎస్‌.వెంకట్, పోలాండ్ యూరప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్రారెడ్డి, రొమేనియాకు ప్రవాసాంధ్రుల ప్రభుత్వ ఉప సలహాదారుడు చందర్షరెడ్డి, స్లొవేకియాకు నాటా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ను పంపనుంది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీ విద్యార్థులను తిరిగి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రతినిధుల బృందం ఢిల్లీలోని ఏపీ భవన్ స్పెషల్ రెసిడెంట్ కమీషనర్, విదేశాంగ శాఖను కలవనుంది. యుక్రెయిన్ నుంచి తిరిగి వచ్చే తెలుగు విద్యార్థులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఈ ప్రతినిధుల బృందం పనిచేయనుంది. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఆయా దేశాలకు రాష్ట్ర ప్రతినిధులను పంపనున్నట్లు ఢిల్లీలోని ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాష్‌ వెల్లడించారు.

Ap Students In Ukraine Ap Govt To Appoint Task Force Team To Return Telugu Students From Ukraine

ఈ నేపథ్యంలో యుక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థుల వివరాలను వారి తల్లిదండ్రుల ద్వారా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనో ధైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని స్థానిక తహసీల్దార్లకు అప్పగించింది.

యుక్రెయిన్‌లో సుమారు 586 మంది భారతీయులు ఉన్నారని అంచనా.. అందులో 555 మంది విద్యార్థుల ఇళ్లకు అధికారులు స్వయంగా వెళ్లారు. తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. ఏపీ విద్యార్థుల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధులకు పంపి.. వారిని వేగంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు.. యుక్రెయిన్‌ నుంచి బయల్దేరిన 28 మంది ఏపీ విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వారందరికీ అధికారులు అవసరమైన సౌకర్యాలను ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఏర్పాటు చేశారు. ఏపీ భవన్‌లో వసతి, భోజన సదుపాయంతో పాటు రాష్ట్రానికి వెళ్లేందుకు అవసరమైన రవాణా సదుపాయం కూడా కల్పించారు.

Read Also :  India : యుక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి.. ఏపీ, తెలంగాణ భవన్ కు చేరుకున్న తెలుగు విద్యార్థులు

ట్రెండింగ్ వార్తలు