Bhimavaram Constituency: అంతుచిక్కని భీమవరం పాలిటిక్స్.. ఈసారి కనిపించబోయే సీనేంటి.. రఘురామ కృష్ణంరాజు బరిలో ఉంటారా?

భీమవరం పాలిటిక్స్ మాత్రం ఎవరికీ అర్థం కాకుండా, అంతు చిక్కకుండా.. ఉన్నాయ్. రోజురోజుకు.. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయ్.

Bhimavaram Assembly Constituency: భీమవరం.. ఏపీలో ఎంతో క్రేజ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. గత ఎన్నికల్లో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో.. ఇదీ ఒకటి. కానీ.. ఆయన వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌పై పరాజయం పాలయ్యారు. మరి.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ భీమవరం నుంచే బరిలో దిగుతారా? లేదా? దీనిమీదే.. లోకల్‌గా పెద్ద డిబేట్ నడుస్తోంది. అయితే.. భీమవరం పాలిటిక్స్ మాత్రం ఎవరికీ అర్థం కాకుండా, అంతు చిక్కకుండా.. ఉన్నాయ్. రోజురోజుకు.. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయ్. అయితే.. ఈ పరిస్థితుల్లో.. ఇప్పటికే ఒకసారి ఇక్కడ ఓడిన పవన్ కల్యాణ్.. మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా? వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాన్ఫిడెన్స్ ఏంటి? విపక్షాల నుంచి పోటీకి సిద్ధంగా ఉన్న నేతలెవరు? ఓవరాల్‌గా.. భీమవరం అసెంబ్లీ సీటులో ఈసారి కనిపించబోయే సీనేంటి?

రసవత్తరంగా భీమవరం పాలిటిక్స్
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరంలో.. రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయ్. ఈసారి భీమవరం బరిలో నిలిచి.. విజేతగా ఎవరు నిలుస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు.. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న భీమవరం.. రకరకాల రాజకీయ కారణాలతో.. పట్టు కోల్పోయింది. దాంతో.. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లోనూ.. ఇదే రిపీట్ అవుతుందని.. వైసీపీ శ్రేణులు చెబుతున్నాయ్. మరి.. ఇది సాధ్యమవుతుందా? లేదా ? అనేది చూసేదానికంటే ముందు.. భీమవరం (Bhimavaram) పొలిటికల్ హిస్టరీని ఓసారి పరిశీలిద్దాం. 1952లో.. భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు.. 16 సార్లు ఎన్నికలు జరిగితే.. 6 సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు. మొట్టమొదటిసారి 2019 ఎన్నికల్లో వీచిన జగన్ వేవ్‌లో.. వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఈ నియోజకవర్గంలో.. భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం, వీరవాసరం (Veeravasaram) మండలాలున్నాయి. వీటి పరిధిలో.. 2 లక్షల 46 వేల మందికిపైనే ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా క్షత్రియ, కాపు (Kapu) సామాజికవర్గాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు. ఈ సెగ్మెంట్‌లో.. కాపు సామాజికవర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు. క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది.

గ్రంధి శ్రీనివాస్ (Photo: FB)

విజయంపై గ్రంధి దీమా
భీమవరం పాలిటిక్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంధి శ్రీనివాస్ (Grandi Srinivas).. మరోసారి గెలుపు తనదేననే ధీమాలో ఉన్నారు. జగన్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే.. తనని గెలిపిస్తాయంటున్నారు. భీమవరంలో వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని చెప్పుకుంటున్నారు. అధినేత జగన్ ఆదేశిస్తే.. మరోసారి పోటీకి సై అంటున్నారు. భీమవరం ప్రజలతో తాను మమేకమయ్యాయని.. ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేసినా.. విడివిడిగా బరిలో దిగినా.. విజయం మాత్రం వైసీపీదేనని గట్టిగా చెబుతున్నారు. భీమవరం జిల్లా (Bhimavaram District) కేంద్రంగా ఏర్పడేందుకు తాను మంత్రి పదవిని సైతం త్యాగం చేశానంటున్నారు. పదవి కంటే నియోజవర్గ అభివృద్ధే తనకు ముఖ్యంగా భావించానని చెబుతున్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లోనూ.. విజయం తనదేనని నమ్మకంగా ఉన్నారు.

పవన్ కల్యాణ్ (Photo: Twitter)

జనసేనాని మళ్లీ పోటీ చేస్తారా?
జనసేన కూడా గతంతో పోలిస్తే.. భీమవరంలో కాస్త బలపడినట్లు కనిపిస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈసారి కూడా ఇక్కడి నుంచే పోటీ చేయాలని.. పార్టీ నాయకులు కోరుకుంటున్నారు. పొత్తులు ఉన్నా.. లేకున్నా.. భీమవరంలో రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరడం ఖాయమని.. ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లోనే.. జనసేనకు 62 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఈసారి.. భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా.. వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీ నాయకులంతా.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. భీమవరంలో.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని.. జనసేన నాయకులు విమర్శిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు.. భీమవరమేనని చెబుతున్నారు.

Also Read: దెందులూరులో వైసీపీ హవాకు చింతమనేని చెక్ పెడతారా?

టీడీపీ అధినేత చంద్రబాబు, తోట తారామలక్ష్మి(Photo: FB)

టీడీపీలో అయోమయం
ఇక.. భీమవరంలో తెలుగుదేశం పరిస్థితి అయోమయంగా మారింది. గ్రూప్ పాలిటిక్స్.. పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి. ఒకప్పుడు.. టీడీపీకి ఎదురులేని సీటుగా ఉన్న ఈ సెగ్మెంట్.. ఇప్పుడు సరైన నాయకత్వం లేక.. వెనుకబడిపోతోంది. ప్రస్తుతం.. నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉన్న, జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి (Thota Sita Rama Lakshmi)కి వ్యతిరేకంగా.. పార్టీలో కొత్త వర్గం తయారైంది. సీతారామలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా.. టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు. మరికొందరు నేతలు కూడా పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో.. భీమవరం (Bhimavaram) నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారనే విషయంలో.. క్యాడర్ కన్ఫ్యూజన్‌లో పడిపోయింది. అయితే.. అధిష్టానం నిర్ణయం మేరకే ఎవరు బరిలో ఉంటారనే విషయం తేలుతుందని.. భీమవరం టీడీపీ ఇంచార్జ్ సీతారామలక్ష్మి చెబుతున్నారు.

Also Read: పవన్ కల్యాణ్.. పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారా?

రఘురామ కృష్ణంరాజు (Photo: FB)

బరిలో రఘురామ..?
ఇక.. ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు(Raghu Rama Krishna Raju) కూడా భీమవరం నుంచే పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే.. ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు.. భీమవరంపై మరింత పట్టు సాధించాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో.. ఒకప్పటి తమ కంచుకోటపై.. మళ్లీ పసుపు జెండా ఎగరేయాలని.. తెలుగుదేశం (Telugu Desam) తాపత్రయపడుతోంది. జనసేన నాయకులు మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లో.. తమ పార్టీకి.. భీమవరాన్ని అడ్డాగా మారుస్తామని చెబుతున్నారు. భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే.. ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని.. ఇక్కడి ప్రజల్లో సెంటిమెంట్ ఉంది. దాంతో.. ఎలాగైనా.. ఇక్కడ గెలవాలని, అధికార, ప్రతిపక్ష పార్టీలు.. వ్యూహాలు రచిస్తున్నాయ్. ఎవరికి వారు.. నియోజకవర్గంలో బలపడేందుకు.. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో.. వైసీపీ అభ్యర్థికి మళ్లీ చాన్స్ ఇస్తారా? లేక.. జనసేన (Janasena) వైపు చూస్తారా? ఈ రెండూ కాకుండా.. తెలుగుదేశానికి అవకాశం ఇస్తారా? అనేది ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు